వెలగపూడి సచివాలయం: రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే టీడీపీ నిస్సిగ్గుగా తమ యాప్ ల ద్వారా ఓటర్ల డేటా చోరీకి తెరలేపిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఇవాళ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఆయన టీడీపీ అక్రమాలతో పాటు ఓటర్ల డేటా గోప్యత లోపాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం బయటికి వచ్చాక మీడియాతో మాట్లాడనివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించడంపై వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్ఐఆర్ తొలిరోజే టీడీపీ అక్రమాలు మొదలు ఎస్ఐర్ ప్రక్రియ ప్రారంభమైన రోజే టీడీపీ, కూటమి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, గోప్యంగా ఉండాల్సిన అంశాల్ని యాప్ ల ద్వారా సేకరిస్తున్నారని ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాం. మై టీడీపీ యాప్ లో మీరు ఏ రాజకీయ పార్టీ అని, ఏ కులం అని అడుగుతున్నారు. భారత రాజ్యాంగం ఇలాంటి అంశాలపై గోప్యత పాటించాలని చెబుతోంది. కానీ ఎక్కడా అది కనిపించడం లేదు. గోప్యంగా ఉండాల్సిన సమాచారం తీసుకుని ప్రత్యర్థుల ఓట్లు తీసేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల జాబితాలో వైయస్ఆర్‌సీపీ ఓటర్ల ఫొటోలు కూడా గుర్తుపట్టలేం. కానీ టీడీపీకి చెందిన బీఎల్వోల చేతుల్లో కలర్ ఫొటోలతో ఉన్న జాబితాలు ఉంటున్నాయి. మాకూ వాటిని ఇవ్వాలని అడిగాం. యాప్ లను అనుమతించే అవకాశం ఉంటే మేం కూడా పెట్టుకుంటామని చెప్పాం. కానీ మేం వ్యక్తిగత సమాచారం అడగబోమని చెప్పాం. మ్యాపింగ్ కాని ఓటర్లను నమోదు చేసే ప్రక్రియలో డాక్యుమెంట్లు ఇస్తే తీసుకోవాలి కానీ బీఎల్వోలు మాత్రం ఓటర్ల లిస్ట్ ప్రచురణ అయిన తర్వాత తీసుకుంటారని చెప్తున్నారు. అది సరికాదు. ఇప్పుడే డాక్యుమెంట్స్ ఇస్తే తీసుకోవాలి. అలాగే అక్ నాలెడ్జ్ మెంట్ కూడా ఇవ్వాలని కోరాం. బీఎల్వోకు రాజకీయ పార్టీలు ఐడీ కార్డులు ఇస్తే వాటిని ఈసీ అధికారులు ధృవీకరించాలని కోరాం. ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓటర్ల నమోదు చేశారు, ఎన్ని ఓట్లు మ్యాప్ చేశారు, ఎన్ని కాలేదన్న వివరాలు ఆన్ లైన్ లో పెట్టాలని సీఈఓను కోరాం. దీనికి ఆయన అంగీకరించారు. రాష్ట్రంలో ప్రజల గొంతు నొక్కే యత్నం రాష్ట్రంలో గతంలో అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని తరహాలో ప్రజల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వైయస్ఆర్‌సీపీ తరఫున ప్రజల అభిప్రాయాల్ని తెలియజేశాం. తర్వాత బయటికి వచ్చి మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే అక్కడ కాదు, ఇక్కడ అంటూ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏ దిశగా పాలన చేయాలని ఆలోచిస్తుందో అర్దం కావడం లేదు. ఎమ్మెల్సీలుగా మాకు గొంతెత్తి మాట్లాడేందుకు మాకు అవకాశం లేదా ? మేం ఏమీ రాజకీయ అంశాలపై మాట్లాడాలనుకోలేదు. ఎన్నికల ప్రధానాధికారికి చెప్పిన అంశాల్నే మీడియాతో మాట్లాడదామని ప్రయత్నిస్తుంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఏదో నియంతల రాజ్యంలా ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుంటున్న తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన అవసరం ఉంది. వీటిపైన మేం మాట్లాడేందుకు ప్రయత్నిస్తే.. ప్రభుత్వం అధికారుల్ని అడ్డుపెట్టుకుని మా గొంతు నొక్కాలని చూస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదు. ఎవరైనా అధికారుల్ని కలిసినప్పుడు వారి ఇబ్బందులు చెప్పినప్పుడు, వాటిని బయట కూడా చెప్పుకునేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. కానీ ఇక్కడ ఎవరి అభిప్రాయాలు, సమస్యలు చెప్పుకోనివ్వడం లేదు. అంతా రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తున్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా మేం ప్రజల గొంతుకగా మాట్లాడుతూనే ఉంటాం. ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే ప్రజాస్వామ్య పద్దతుల్లో నిరసన కూడా తెలియజేస్తామని లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు.