వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు దుర్మార్గం

 వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి ఆగ్ర‌హం

విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, ఆ వైఫల్యాలను ఎండగడుతున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి విమర్శించారు.  విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైయ‌స్ఆర్‌సీపీ అధికారిక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేయించడం ద్వారా కూటమి ప్రభుత్వం మానసిక ఆనందం పొందుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉందా అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు.

ప్రజల పక్షాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తుంటే కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోందన్నారు. సోషల్ మీడియా వేదికగా వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకే ఆ ఖాతాలపై ఆంక్షలు విధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 
వాస్తవాలను దాచిపెట్టి ప్రతిపక్ష గొంతు నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, రాష్ట్రంలో "రెడ్‌బుక్ రాజ్యాంగం" అమలవుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోందని మండిపడ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఈ అంశంపై న్యాయపోరాటం చేపడతామని అంజిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వ దమనకాండను ఎండగడుతూనే ఉంటామని పేర్కొన్నారు.
 

Back to Top