నెల్లూరు: చంద్రబాబు 25 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశాడో చెప్పుకోలేక, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న వైయస్ జగన్‌పై వ్యక్తిగత కక్ష పెంచుకున్నాడని.. ఆ అక్కసుతోనే నోటికొచ్చినట్టు తిడుతూ తన ఎమ్మెల్యేలతో తిట్టిస్తున్నాడని నెల్లూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండేళ్ల చంద్రబాబు కూటమి పాలనంతా కెమెరాల మధ్యనే సాగిందని, ఒక కుటుంబానికి న్యాయం చేస్తే మిగిలిన లక్షలాది కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. నెల్లూరు పర్యటనకు వచ్చిన చంద్రబాబు గంట సేపు మాట్లాడినా వైయస్ జగన్ గారు ప్రెస్‌మీట్‌లో సంధించిన ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేకపోయాడని ఎద్దేవా చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్, పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య, అమరావతిలో వేల కోట్ల దోపిడీ, అమరాతి రైతులకు అన్యాయంపై ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పుకుండా పవన్ కళ్యాన్ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. చంద్రబాబుతో జతకట్టిన పాపానికి పవన్ కళ్యాణ్‌ని పేకాటలో జోకర్‌లా వాడుకుంటున్నాడని విమర్శించారు. ఇది సంక్షేమ పాలన కాదు, పబ్లిసిటీ పాలన అనేది ప్రజలకు అర్థమైపోయిందని, సరైన సమయంలో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.... - ప్రతినెలా కెమెరాల ముందు చంద్రబాబు నట విశ్వరూపం జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నాడంటే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా సీఎం చంద్రబాబు నెల్లూరు పర్యటన సాగింది. రెండేళ్ల చంద్రబాబు పాలన చూస్తే పనుల కన్నా పబ్లిసిటీలు, ఈవెంట్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ప్రజా సమస్యల పరిష్కారం కన్నా కెమెరాల ముందు నటనలే ఎక్కువైపోయాయి. ప్రతినెలా ఒకటో తేదీ పింఛన్ల పంపిణీ పేరుతో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని రావడం, ఆ గ్రామంలో సెలెక్ట్ చేసుకున్న కుటుంబాన్ని కలిసి ఐదారు కెమెరాల ముందు తన నట విశ్వరూపం చూపిస్తాడు. ముందుగా ఎంపిక చేసుకున్న కుటుంబాన్ని కలెక్టర్ కలిసి వారిలో బాగా మాట్లాడే వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని వారికి స్క్రిప్టు ఇచ్చి ప్రాక్టీస్ చేయిస్తారు. చంద్రబాబు వచ్చాక వారితో కెమెరాల ముందు చెప్పించి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయించుకుంటారు. గ్రామస్తులందరికీ వారి ఊరిలో షూటింగ్ జరిగినట్టు ఉంటుందే కానీ, ఒక ముఖ్యమంత్రి వచ్చి సమస్యలకు పరిష్కారం ఊపించి పోయినట్టు ఉండదు. సమస్యలు చెప్పుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే రెక్కలు పట్టుకుని లాగిపడేస్తారు. ఫిర్యాదులు చేయడానికి వచ్చాడని తెలిస్తే పోలీస్ వ్యాన్ ఎక్కించేస్తారు. ఒక కుటుంబానికి ఇళ్లో, ఉద్యోగమో, ఆటోనో, ఇంకేదో ఇచ్చేస్తే లక్షలాది కుటుంబాలకు న్యాయం జరిగినట్టు ఎలా అవుతుంది? ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు సంగతేంటి? - 25 నెలలుగా షూటింగ్‌లు, సెట్టింగ్‌లు, ఈవెంట్లు, డ్రామాలు.. గతంలో కూడా చంద్రబాబు ఒకసారి నెల్లూరు జిల్లాకు వచ్చి మంట లేకుండా గ్యాస్ మీద వంట చేసి పోయాడు. పింఛన్ల పంపిణీ కోసం వస్తున్న చంద్రబాబు రెండేళ్లలో ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదు సరికదా, వైయస్సార్సీపీ హయాంలో ఇచ్చిన 6 లక్షల పింఛన్లకు కోత పెట్టేశాడు. సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు అమలవుతాయా లేదా అని ప్రజలు అడుగుతున్నారు. ఒక కుటుంబానికి ఒక ఆటో ఇచ్చి పోతే, మిగతా లక్షలాది కుటుంబాలను కూడా ఆదుకున్నట్టేనా? జగన్ గారిని తిట్టే రాజకీయాలు చేసే నాయకుడొద్దు, మాకు న్యాయం చేసే నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సమస్యలు పరిష్కరించే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు లాంటి ఈవెంట్ మేనేజర్‌ని కాదు. పింఛన్లు పంపిణీ చేయడం అంటే ఒక కుటుంబం ముందు కెమెరాలు పెట్టి నటించడం కాదు. షూటింగ్‌లు, సెట్టింగ్‌లు, ఈవెంట్లు, డ్రామాలు.. వీటితో ప్రజా సమస్యలు పరిష్కారం కావు. ఇది సంక్షేమ పాలన కాదు, పబ్లిసిటీ పాలన అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఆయన ప్రజల మధ్యకు వెళ్తున్నారా, కెమెరాల మధ్యకు వెళ్తున్నారా అనేది ఆలోచించాలి. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాలు రకరకాల సమస్యలతో సతమతం అవుతుంటే వారి కోసం ఆలోచించాల్సిందిపోయి ఒక కుటుంబంతో ఫొటోలు దిగితే సరిపోతుందా? 25 నెలల్లో 25 కుటుంబాలను ఆదుకుంటే కోటిన్నర కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారు? - జగన్‌ని తిట్టకుండా చంద్రబాబుకి రోజు గడవడం లేదు ప్రజా సమస్యలు చర్చకు వస్తాయన్న ఉద్దేశంతోనే ఇలాంటి సెట్టింగులు ఏర్పాటు చేసుకుని వైయస్ జగన్ గారిని తిట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. వైయస్ జగన్ గారిని తిట్టకుండా వైయస్సార్సీపీ పేరు ప్రస్తావించకుండా చంద్రబాబుకి ఒక్క రోజు గడవడం లేదు. అధికారంలోకి వచ్చిన 25 నెలల్లో ఏం చేశాడో ఇప్పటికీ చెప్పలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడు. ఆయన మీటింగులలో ఆత్మస్తుతి, పరనింద తప్పితే ఇంకోటి లేదు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. వైయస్ జగన్ గారు ఫ్రశ్నిస్తే చంద్రబాబులో బీపీ పెరిగిపోతోంది. వాటికి సమాధానం చెప్పుకోలేని నిస్సహాయస్థితిలో ఆయన్ను నోటికొచ్చినట్టు తిట్టిపోస్తున్నాడు. తన వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెడుతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నాడనే అక్కసుతో వైయస్ జగన్ గారి మీద చంద్రబాబు వ్యక్తిగత ద్వేషం పెంచుకున్నాడు. గంట మీటింగ్‌లో వైయస్ జగన్ గారు ప్రెస్‌మీట్‌లో సంధించిన ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పిన పాపాన పోలేదు. - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా? చంద్రబాబుతో జతకట్టిన పాపానికి పవన్ కళ్యాన్ ని, ఆయన కుటుంబాన్ని పేకలో జోకర్ లా ఇష్టమొచ్చినట్టు వాడేస్తున్నాడు. తనకి ఏ సమస్య వచ్చినా ఆయన్ను ముందుకు దించి డైవర్షన్ పాలిటిక్స్ చేయిస్తున్నాడు. పరిపాలన సమస్యలొస్తే వాటికి సమాధానం చెప్పుకోలేక ఇన్నాళ్లు తన కుటుంబ సభ్యులనే రాజకీయాలకు వాడుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నాడు. ప్రజలకు కావాల్సింది డైవర్షన్ పాలిటిక్స్ కాదని తెలుసుకోవాలి. అమరావతి పేరుతో జరుగుతున్న వేల కోట్ల అవినీతిని ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పే దమ్ము లేదు. మావిగన్ మోడల్ ఎందుకు అవసరమో చెబితే, అంతకన్నా అమరావతితో కలిగే ప్రయోజనాలు వివరించే సత్తా లేదు. అమరావతిలో అవినీతి పేరెత్తితే చంద్రబాబు సహించలేకపోతున్నాడు. తన వారిని వెంటనే రంగంలోకి దించి వైయస్ జగన్ గారిని తిట్టిస్తున్నాడు. అమరావతిలో అవినీతికి ఆధారాలు చూపిస్తుంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదు? అమరావతి నిర్మాణంలో పారదర్శకంగా ఉంటే ఖర్చులకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదు? గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారు? పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబానికి ఎందుకు న్యాయం చేయడం లేదు? ఈ రెండు కేసులను సీబీఐ విచారణకు ఇవ్వమని డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఎందుకు భయపడిపోతోంది? లా అండ్ ఆర్డర్ మీద ఎందుకు మాట్లాడటం లేదు? సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఎందుకు చెప్పడం లేదు ? - మనిషి ప్రాణం తీసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? సాయికృష్ణ లాకప్ డెత్‌పై చంద్రబాబు మాట్లాడిన మాటలు మతిభ్రమించి మాట్లాడినట్టుగా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా అవి? పోలీసులపై చాలా ఒత్తిడి ఉంటుంది. పోలీసులకు టెన్షన్ వస్తుంది. అంటే ఒత్తిడిలో ఖైదీలను లాకప్‌లో చావకొట్టి చంపేస్తారా? లాకప్ డెత్‌లకు పాల్పడే పోలీసులను సీఎం చంద్రబాబు సమర్థిస్తున్నాడా? రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం ఇలాగేనా? చట్టాలను, న్యాయ వ్యవస్థలను ఆయన గౌరవించరా? ఒక మనిషి ప్రాణం తీసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? ఒక నిండు ప్రాణం తీస్తే కేవలం వీఆర్‌కి పంపించి చేతులు దులిపేసుకుంటున్న దౌర్భాగ్య కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. పోలీసులు తప్పులు చేస్తే కులాలను ఎందుకు తీశారు? - మహిళలపై దాడులు చేసే వారికి అదే ఆఖరి రోజు అన్నావు కదా.. మహిళలపై చెయ్యేస్తే వారికి అదే ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు చెబుతుంటాడు. కావలిలో ఎరుకుల కులానికి చెందిన ఒక ఎస్టీ మహిళల మీద టీడీపీ నాయకుడు చెయ్యేసి కొట్టడమే కాకుండా ఆమెను రోడ్డు మీదకు లాగి వివస్త్రను చేసి వేధించారు. మానసికంగా శారీరకంగా దాడి చేసి వేధిస్తే వారం తర్వాత వారి మీద కేసు పెట్టారు. కానీ ఈరోజుకి ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇలాంటి వ్యక్తి మహిళల పట్ల గౌరవం ఉందని చెబితే సరిపోదు. ఇలాంటి ఘటనలు జరిగనప్పుడు తన చిత్తశుద్ధిని చూపించాలి. వైయస్ జగన్ గారిని తిట్టడం ద్వారానో, పవన్ కళ్యాణ్ కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగడం ద్వారానో చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరు. సాయి కృష్ణ లాకప్ డెత్‌కి, అమరావతిలో జరుగుతున్న అవినీతికి తప్పకుండా సమాధానం చెప్పుకోవాలి. ఇకనైనా ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలి. సరైన సమయంలో ఖచ్చితంగా బుద్ధి చెబుతారని గుర్తుంచుకోవాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.