పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి 

రైతు సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు హెచ్చ‌రిక‌

ఏలూరు జిల్లా: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెంలో రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు,  వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా, ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెట్టి గురునాథరావు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, చింతలపూడి ఇన్‌చార్జ్ కంభం విజయరాజు తదితరులు పాల్గొన్నారు.

 రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం:  దూలం నాగేశ్వ‌ర‌రావు
 పొగాకు రైతుల మహాధర్నా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతోంది. ప్రభుత్వం వ్యాపార సంస్థలా కాకుండా రైతులకు ఎలా మేలు చేయాలనే దానిపై దృష్టి పెట్టాలి. పొగాకు పంట ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ, రైతులకు మాత్రం గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, మామిడి రైతులు ఆందోళన చేస్తే లాఠీచార్జి చేయడం తప్ప రైతుల సమస్యలు పరిష్కరించే ఆలోచన కనిపించడం లేదు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని దూలం నాగేశ్వ‌ర‌రావు హెచ్చరించారు.

రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం:  చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌
రైతు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రైతులకు ఏర్పడింది. రైతుల సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పూర్తిగా విఫలమైంది. రైతుల ఉసురుతో ప్రభుత్వం నిలబడదని, వెంటనే గిట్టుబాటు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ హెచ్చరించారు.


 

Back to Top