వైయస్ఆర్ జిల్లా: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ (TET) నిర్వహించడం సరికాదని, ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టంలో తగిన సవరణలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, బీఈడీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరి 20 నుంచి 25 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులను మళ్లీ టెట్ రాయాలని చెప్పడం అన్యాయమని వివరించారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్ర విద్యాహక్కు చట్టంలో సవరణలు చేయించాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. వారి వినతిపై స్పందించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ అంశాన్ని వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి ఉపాధ్యాయుల సమస్యను వివరించి, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.