గుంటూరు : గుంటూరు కృష్ణబాబు కాలనీలో ఓ మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనపై వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి పాత్రపై తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బాధితురాలు మొదట ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు కేసు నమోదు చేయకపోవడం వెనుక ఎమ్మెల్యే జోక్యం ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, మొదటి, రెండో ఘటనలపై వెంటనే కేసులు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. వీడియోలు బయటకు వచ్చిన తర్వాతే పోలీసులు స్పందించారని, ఆ వీడియోలు బయటకు పంపిన మహిళనే ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని ఆమె సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. పరువునష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే గల్లా మాధవి చెబితే స్వాగతిస్తామని, ఏ న్యాయపోరాటానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. పోతిన మహేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రెడ్‌బుక్ పాలనలో మహిళలు భయంతో జీవించే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే గల్లా మాధవి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ మహిళల రక్షణ బాధ్యత వహించాల్సిన హోంమంత్రి అనిత పూర్తిగా విఫలమయ్యారని, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. బాలసాని కిరణ్ మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినా చర్యలు తీసుకోవడం లేదని, ఎమ్మెల్యే గల్లా మాధవి స్పందించిన తీరు బాధ్యతారాహిత్యంగా ఉందని విమర్శించారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రూ.10 వేల లంచం కోసం ఓ మహిళను వివస్త్రను చేయడం దేశం సిగ్గుపడే ఘటన అని అన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హోంమంత్రి అనిత నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.