విశాఖపట్నం: మత్స్యకారుల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే.కే. రాజు డిమాండ్ చేశారు. మరోవైపు విశాఖలో జరుగుతున్న భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం సీబీఐతో దర్యాప్తు నిర్వహించాలని ఆయన కోరారు. ప్రభుత్వం మత్స్యకారుల ప్రాణాలకు భరోసా కల్పించడంతో పాటు విశాఖ భూముల పరిరక్షణలోనూ చిత్తశుద్ధితో వ్యవహరించాలని కే.కే. రాజు స్పష్టం చేశారు. విశాఖలోని వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టెక్నాలజీ, రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసి మత్స్యకారుల ప్రాణాలకు భరోసా కల్పించాలని కోరారు. మరోవైపు విశాఖలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణలు పెరిగాయని ఆరోపిస్తూ, వాటిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... - బాధితుల రక్షణలో ప్రభుత్వ నిర్లక్ష్యం... విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేట ముగించుకుని తిరిగి వస్తుండగా భారీ అలల కారణంగా బోటు తిరగబడింది. ప్రమాదంలో ఒకరు మాత్రమే చైనా మర్చెంట్ నేవీ నౌక సాయంతో ప్రాణాలతో బయటపడగా, మిగిలిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బాధిత కుటుంబాలు తమ వారి కోసం శోకసంద్రంలో మునిగిపోయాయి, కనీసం వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అన్న సమాచారం కూడా ఇప్పటివరకు అందకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ప్రమాదం జూలై 4 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మెరైన్ పోలీసులు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కోస్ట్ గార్డ్, నేవీ బృందాలు జూలై 5 ఉదయం వరకు సమర్థవంతమైన సహాయక చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు చిన్నా తెలిపిన వివరాల ప్రకారం, బోటు తిరగబడిన తర్వాత రాత్రంతా బోటుపైనే ప్రాణాలతో పోరాడుతూ గడిపారని, అనంతరం 12 నుంచి 15 కిలోమీటర్ల మేర 5 నుంచి 6 గంటలు ఈదుకుంటూ వచ్చినా రక్షణ అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. - మెరైన్ పోలీసులు వైఫల్యం... ప్రమాదం అనంతరం మెరైన్ పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారో ప్రజలకు స్పష్టంగా వివరించాలి. హోంశాఖ ఆధ్వర్యంలోని వ్యవస్థలు ఎలా పనిచేశాయి? ఎక్కడ లోపం జరిగింది? అనే అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంతటి విషాదం జరిగినప్పటికీ స్థానిక ఎంపీ, హోంమంత్రి, ఇతర బాధ్యతగల ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వకపోవడం అత్యంత బాధాకరం. టెక్నాలజీ విషయంలో గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు, మత్స్యకారుల భద్రత కోసం ఆధునిక సాంకేతికతను ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన నాలుగు రోజులైనా గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనుగొనలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. - జీపీఎస్, కమ్యూనికేషన్ వ్యవస్థలను తప్పనిసరి చేయాలి ఫిషింగ్ బోట్లకు జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థను తప్పనిసరి చేయాలి. ప్రమాదం జరిగిన వెంటనే ఫిషింగ్ హార్బర్ ద్వారా సంబంధిత అధికారులకు ఆటోమేటిక్ అలర్ట్ వెళ్లే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. మత్స్యకారులకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు, సముద్రంలో నిరంతర కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మత్స్యకారులకు చెల్లించాల్సిన బీమా సొమ్ములు కూడా సకాలంలో చెల్లించలేదు. కేవలం "మత్స్యకార భరోసా" పేరుతో కంటితుడుపు చర్యలు చేపట్టకుండా, మత్స్యకారుల ప్రాణాలు, ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పించే విధానాన్ని అమలు చేయాలి. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి ద్వారా లభించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని గల్లంతైన వారి ఆచూకీ కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు. ఇటీవలి కాలంలో బోట్లు తిరగబడటం, మత్స్యకారులు గల్లంతవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి.. వీటి నివారణకు తగిన చర్యలు అధికారులు తీసుకోవాలి. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు బదులుగా మత్స్యకారుల సమస్యలపై దృష్టి పెట్టి వారికి అవసరమైన రక్షణ, సహాయ సహకారాలు అందించాలి. - పెట్టుబడుల పేరుతో ప్రచారం... కనిపించని పురోగతి. గత నాలుగు రోజులుగా కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా విశాఖలో పెట్టుబడుల పేరుతో ప్రచారం చేస్తోంది. కానీ వాస్తవంగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. 14 నెలల క్రితం ఐటీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులే ఇప్పటికీ ముందుకు సాగలేదు. శంకుస్థాపనలు తప్ప అభివృద్ధి కనిపించడం లేదు, పెట్టుబడులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. - విశాఖలో భూ ఆక్రమణలు పెరిగాయి విశాఖలో ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములపై అధికార పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు అక్రమ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి రాత్రికి రాత్రే సుమారు 7 వేల గజాల ప్రైవేటు స్థలాన్ని బుల్‌డోజర్లు, లారీలతో ఆక్రమించేందుకు ప్రయత్నించారు. గీతం కళాశాల మాజీ ప్రొఫెసర్‌కు చెందిన సుమారు రూ.20 కోట్ల విలువైన స్థలాన్ని కూడా ఆక్రమించారు. అధికార పార్టీ నేతల మధ్య వాటాల వివాదాలు రావడంతోనే ఈ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వీటిపై తక్షణమే దర్యాప్తు చేయాలి. - ప్రభుత్వ భూములు కబ్జా... కరెంటు చోరీ కూడా రాత్రికి రాత్రే ప్రభుత్వ భూములు ఆక్రమించి, పగలు మీటర్లు లేకుండానే విద్యుత్ వినియోగిస్తున్నారు. ఈ అంశాలన్నింటిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు సీరియస్‌గా స్పందించడం లేదు, ఇది కూడా పరిపాలనా వైఫల్యానికి నిదర్శం. మురళీనగర్‌లో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కూటమి నేతలు ఆక్రమించారు. - భూ ఆక్రమణలపై సీబీఐ విచారణ జరపాలి ఈ నేపథ్యంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రభుత్వ భూములు దోచుకోవడానికి కాకుండా ప్రజల సంక్షేమం కోసం వినియోగించాలని కే కే రాజు, విశాఖలో జరుగుతున్న ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సముద్ర ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీని అత్యవసరంగా కనుగొని, వారి కుటుంబాలకు పూర్తి భరోసా కల్పించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని కే కే రాజు ప్రభుత్వాన్ని కోరారు.