నరసరావుపేట: ప్రజలకు మంచినీరు, సాగునీటికి ఉపయోగపడే వంకాయలవారి కుంట చెరువును తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ పల్నాడు జిల్లా వైయస్ఆర్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “గుడ్ మార్నింగ్ నరసరావుపేట” కార్యక్రమంలో భాగంగా విసప్పాలెం–జొన్నలగడ్డ బైపాస్ రోడ్డులోని వంకాయలవారి కుంట చెరువును పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 1.70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు స్థానిక ప్రజలకు మంచినీటి, సాగునీటి అవసరాలకు ఉపయోగపడేదని పేర్కొన్నారు. అయితే చెరువులోని నీటిని తొలగించి, మట్టితో పూడ్చివేసి, అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించేందుకు చర్యలు చేపట్టడం దారుణమన్నారు. మార్చి 5న స్థానిక గ్రామస్తులతో కలిసి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చెరువులు, నీటి వనరులను ఇతర అవసరాలకు కేటాయించరాదని అప్పుడే వివరించామని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు పరిశీలన జరపాల్సి ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మార్చి 23న ఈ భూమిని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించాలని ప్రతిపాదనలు పంపడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి తమకు అభ్యంతరం లేదని, అయితే ప్రజలకు ఉపయోగపడే చెరువులను కబ్జా చేసి వినియోగించడం సమర్థనీయం కాదన్నారు. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఇసప్పాలెం అమ్మవారి ఆలయంలో రాజకీయ జోక్యం వద్దు ఇసప్పాలెం అమ్మవారి ఆలయాన్ని కూడా సందర్శించిన గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దేవాలయ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం తగదని అన్నారు. వైయస్సార్ హయాంలో ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు కేటాయించి అన్ని వర్గాల భాగస్వామ్యంతో అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆలయంలో గతంలో అమలైన సంప్రదాయాలను కొనసాగించాలని, కంకణధారాల కార్యక్రమాల వంటి ఆచారాల విషయంలో వివాదాలకు తావివ్వొద్దని కోరారు. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయకుండా ఆలయ నిర్వహణ సాగాలని, పూజారులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఇసప్పాలెంలో పారిశుద్ధ్యం అధ్వాన్నం మున్సిపాలిటీలో విలీనం అయిన ఇసప్పాలెం ప్రాంతంలో పారిశుద్ధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని గోపిరెడ్డి ఆరోపించారు. మురికి కాలువలు శుభ్రం చేయకపోవడం, చెత్త తొలగించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రత్యేకించి వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులు అధికంగా నివసించే వీధుల్లో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి కాలువల శుభ్రత, చెత్త తొలగింపు చర్యలు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని వైయస్ఆర్‌సీపీ తరఫున డిమాండ్ చేశారు.