విశాఖపట్నం: తిరుపతిలో వెన్నుపోటు పార్టీ పెట్టిన వెన్నుపోటు సభ అట్టర్ ప్లాప్ అయిందని, ఇందులో ఓవైపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూనే, మరోవైపు మహిళలకు ఆడబిడ్డ నిధి ఎగ్గొడుతున్నట్లు బహిరంగంగానే చెప్పుకోవడం దారుణమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రెండేళ్ల వెన్నుపోటు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనడానికి వైయస్ఆర్‌సీపీ నిర్వహించిన నిరసనలకు వచ్చిన మద్దతే నిదర్శనమని ఆయన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆపితే, ఇందుకు విరుద్దంగా అబద్ధాలు చెప్పుకుంటున్నారని బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. స్టీల్ ప్లాంట్ లో రెండేళ్లుగా జరిగిన ప్రమాదాలపై సీఎండీని కలుస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రెస్ మీట్లో బొత్స సత్యనారాయణ ఇంకేమన్నారంటే... తిరుపతిలో వెన్నుపోటు సభ: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులతో పాటు స్వచ్చందంగా ప్రజలు కూడా ముందుకొచ్చి వెన్నుపోటు ప్రభుత్వం రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు తెలపడం అభినందనీయం. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి పోరాటాలు ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా రెండేళ్లలో ఏదో ఉద్ధరించామని చెప్పుకుంటూ వెన్నుపోటు పార్టీ తిరుపతిలో బహిరంగసభ పెట్టింది. సూపర్ సిక్స్- సూపర్ హిట్ అంటున్నారు. హిట్ అంటే చంద్రబాబు అర్ధం ఏంటో మాకూ తెలియడం లేదు. ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చారా ? కొన్ని నెరవేర్చాం, మిగిలినవి వచ్చే మూడేళ్లలో నెరవేరుస్తాం అంటే ఫర్వాలేదు. కానీ అన్నీ పూర్తి చేసేశామంటున్నారు. ఆడబిడ్డ నిధి ఇచ్చారా, నిరుద్యోగ భృతి ఇచ్చారా అని అడుగుతున్నాం. కాబట్టి తిరుపతిలో వెన్నుపోటు పార్టీ పెట్టింది వెన్నుపోటు సభే. మహిళలకు వెన్నుపోటు పొడుస్తున్నట్లు ఈ సభలోనే కూటమి నాయకులు చెప్పేశారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం అన్ని రంగాల్ని ఇబ్బంది పెట్టింది. అందుకే నిన్న తిరుపతి సభలో సౌండ్ మాత్రమే వినిపించింది, రీసౌండ్ మాత్రం రాలేదు. విద్యాశాఖ పనితీరుపై లోకేష్ గొప్పలా ? నిన్న ఉద్యమం అంత పెద్ద ఎత్తున జరిగింది అంటే అన్ని వర్గాల ప్రజలు పడుతున్న బాధలే కారణం. ఎక్కడో యుద్దం వచ్చింది కాబట్టి ధరలు పెరిగాయని అనుకుందామన్నా అలాంటి పరిస్ధితి లేదు. దిగుమతి చేసుకునే వస్తువులతో పాటు పండించిన వస్తువులకూ ధరలు పెరిగిపోయాయి. మధ్యలో లాభపడుతుంది దళారులే. రైతు పండించిన పంటకు ధరలేదు కానీ నిత్యావసరాల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఓ పక్క గొప్పగా ఇంద్రులం, చంద్రులం అని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి తర్వాత స్ధానంలో ఉన్న విద్యాశాఖ మంత్రి తన శాఖను ఛాలెంజ్ గా తీసుకున్నామని చెప్తున్నారు. బాగుచేయడానికా లేక పాడు చేయడానికా ఆ ఛాలెంజ్ అని అడుగుతున్నాం. పాఠశాలలు తెరిచారు, పిల్లలు మంచి బొమ్మలు వేశారని, చెంగు చెంగుమని పరిగెడుతున్న ఫొటోలు ఇవాళ పత్రికల్లో కనిపించాయి. కానీ గతంలో వైయస్ జగన్ గారి ప్రభుత్వ హయాంలో ఉన్నట్లుగా పిల్లలకు యూనిఫామ్, బుక్స్, బ్యాగ్ మాత్రం అందులో కనిపించలేదు. ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి ? పోనీ రాష్ట్రంలో మిగతా రంగాలు ఏమైనా బాగున్నాయా ? వ్యవసాయ రంగంలో పొగాకు, మిర్చి వంటి పంటలకు గిట్టుబాటు ధరలు ఉన్నాయా ?, పాడైపోయిన మామిడి పండ్లు సరే, బాగున్న పండ్లకు కూడా ధర లేదు. సీఫుడ్స్ గురించి చంద్రబాబు ఈ మధ్య గొప్ప గొప్ప మాటలు చెప్పారు. మేం ఐదేళ్లలో ఆక్వా ఫీడ్ ఫ్యాక్టరీల్ని, రైతుల్ని, అధికారుల్ని సమన్వయం చేసుకుంటూ అక్వారంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశాం. కానీ ఇప్పుడు ఆక్వా రైతులు ఛలో అమరావతి అంటున్నారు. వీరు మా పార్టీ వాళ్లు కాదు. అన్ని పార్టీల వాళ్లూ ఉన్నారు. రైతుకు పార్టీ అంటూ ఉండదు. ఇవీ వెన్నుపోటు పార్టీ ఘనతలు. దీనికి కూటమిలో మరో రెండు పార్టీలు తానా తందానా అంటుంటాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంది జగనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తిరుపతిలో మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒత్తాసు పలికిందని చెప్పారు. మీ మాటలకు నవ్వాలో, ఏడవాలో కూడా తెలియడం లేదు. మీ కేంద్రమంత్రి కుమారస్వామి జగన్మోహన్ రెడ్డి హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుపడ్డారని చెప్పింది నిజం కాదా ? ఆ విషయం కూడా మీకు గుర్తు లేదా ? ఏదో మైకు దొరికిందని ఏది పడితే అది మాట్లాడితే ఎలా ? గతంలో విశాఖ వచ్చినప్పుడు ప్రధాని మోడీకి జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ వ్యతిరేకత వద్దని చెప్పలేదా ? ఈ రెండేళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో పలు ప్రమాదాలు జరిగాయి. ఇందులో తాజా ఘటన కాకుండా అంతకు ముందే 8 మంది చనిపోయారు. వీటిపై లోకేష్ తనకు సమాచారం లేదని చెప్పడం దారుణం. మంత్రిగా ఉన్న ఆయన అన్నీ తెలుసుకోరా ? ఆయనకు నేర్చుకోవాలన్న తపన, ఆలోచన లేవు. లోకేష్ మాట్లాడితే తాను గ్రేట్ అని చెప్పుకుంటారు, ఆడ బిడ్డ నిధి డబ్బులు ఎగ్గొట్టడం గ్రేటా ? విద్యార్ధులకు స్కూల్ కిట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టడంలో ఆయన గ్రేటా చెప్పాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో గత రెండేళ్లుగా చోటు చేసుకున్న ప్రమాదాలపై వైయస్ఆర్‌సీపీ తరఫున సీఎండీని కలిసి విచారణ కోరబోతున్నాం. వెన్నుపోట్లు ఇకనైనా ఆపండి కరెంటు ఛార్జీల మీదా కూటమి నాయకులు అవే అబద్ధాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు రూపాయి తగ్గినట్లు చూపించండి. ఓ పక్క కరెంటు ఛార్జీలు పెంచేస్తే, మరో పక్క పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. అడిగితే ప్రపంచమంతా సంక్షోభం వచ్చిందంటున్నారు. మరి మీరు పెంచిన ధరలతో వచ్చిన సంక్షోభం గురించి ఎందుకు మాట్లాడరు ? మీ హయాంలో రెండేళ్లలో మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేసి ఏ పథకమైనా సక్రమంగా అమలు చేస్తున్నారా ? ఓ ఫీజు రీయింబర్స్ మెంట్, ఓ ఆరోగ్య శ్రీ ఇస్తున్నారా ? మీరు వెన్నుపోటు పొడిచిన మహానాయకుడి పేరు పెట్టుకుని మరీ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారు. ఎకరం రూపాయికి ఇచ్చి తెరవెనుక ముడుపులు తీసుకోమంటే తీసుకుంటారు. డీఎస్సీపైనా కూటమి ప్రభుత్వం అభ్యర్ధులకు అన్యాయం చేసింది. మా ప్రభుత్వ హయాంలో 6500 పోస్టులతో డీఎస్సీ ఇస్తే, దాన్ని రద్దు చేసి 16 వేల పోస్టులతో ఇచ్చామంటున్నారు. కానీ అక్రమాలు లేకుండా దాన్ని నిర్వహించలేకపోయారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 30 వేల కార్యదర్శుల పోస్టుల్ని వేలెత్తి చూపించడానికి లేకుండా భర్తీ చేశాం. టెన్త్ పరీక్షల్లో ఒకసారి తప్పిదాలు జరిగితే బాధ్యుల్ని చిన్నా, పెద్దా చూడకుండా చర్యలు తీసుకున్నాం. ఇంత పెద్ద వ్యవస్ధలో తప్పుడు జరగొచ్చు. కానీ తప్పు తమ దృష్టికి వచ్చినా చర్యలు తీసుకోవడం లేదంటే అందులో మీ పాత్ర కూడా ఉన్నట్లే అనుకోవాలి. ఆడబిడ్డ నిధికి మంగళం పాడేస్తున్నామని చెప్పడానికే నిన్న తిరుపతిలో సభ పెట్టారు. కొత్తగా ఏదైనా చెప్పడం మానేసి గతంలో ఇచ్చిన హామీకే మంగళం పాడేస్తున్నట్లు చెప్పుకోవడం వింతగా ఉంది. వెన్నుపోటు పార్టీ వర్చువల్ మహానాడు పెట్టి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి చట్టంతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు రాజ్యసభ అభ్యర్ధులుగా నలుగురూ పురుషులనే ఎంపిక చేశారు, మహిళలకు ఎందుకు ఇవ్వలేకపోయారు. అప్పుడే మీరు ఇచ్చిన హామీకి వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్దికి చాలా మార్గాలున్నాయి, బీచ్ ఇసుకలో కూర్చోబెట్టి బీరూ, మందూ తాగిస్తే టూరిజం అభివృద్ది కాదు. వచ్చే నాలుగు కుటుంబాలు కూడా వెళ్లిపోతాయి. ఎందుకంటే మనకు సంస్కృతీ సంప్రదాయాలు ఉన్నాయి. కూటమిలో హిందూ సంప్రదాయ పార్టీ దీన్ని ఎలా సమర్ధిస్తోంది? అడిగితే అభివృద్ది నిరోధకులు, బీజేపీ భావాలకు వ్యతిరేకులంటారు. కాబట్టి మిగిలిన రెండేళ్ల పాలనను ప్రజలకు వెన్నుపోట్లు లేకుండా పూర్తి చేసుకోవాలని కూటమి ప్రభుత్వానికి బొత్స సత్యనారాయణ హితవు పలికారు.