కాపులపై దాడులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం

అడపా శేషు ధ్వజం

గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌

ఇతర అన్ని ఘటనలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి

అడపా శేషు డిమాండ్‌

వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ అడపా శేషు.

లాకప్‌డెత్‌తో ఇరకాటంలో పడిన ప్రభుత్వం

సమాధానం చెప్పలేక ప్రజల దృష్టి మళ్లించే యత్నం

అందుకే మాపై జనసేన నేతలతో దూషణల పర్వం

ఆ దిశలోనే జగన్‌గారిపై జనసేన ఎమ్మెల్యే పిచ్చి కూతలు

ప్రెస్‌మీట్‌లో అడపా శేషు ఆక్షేపణ

తాడేపల్లి: రాష్ట్రంలో కాపు సామాజికవర్గంపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని కాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ అడపా శేషు ఆక్షేపించారు. గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌తో పాటు, క్రాంతికుమార్‌ ఆత్మహత్య, గంగమ్మ, కళావతి, తిరుపతమ్మ ఘటనలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌తో ఇరకాటంలో పడిన సీఎం చంద్రబాబు, ఎప్పటిలాగే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని అన్నారు. వరస ఘటనలు అన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను రంగంలోకి దింపారని చెప్పారు. ఆ దిశలోనే జనసేనకు చెందిన కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ సీఎం జగన్‌గారిపై పిచ్చి కూతలు కూశారని మండిపడ్డారు. ఇకనైనా జనసేన నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పార్టీ కేంద్ర కార్యాలయంతో మీడియాతో మాట్లాడిన అడపా శేషు హెచ్చరించారు.
ప్రెస్‌మీట్‌లో అడపా శేషు ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఈ ఘటనలన్నింటికీ ప్రభుత్వానిదే బాధ్యత:
    విజయవాడ, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్, గాదె సాయికృష్ణ మరణం, పోలీసుల దారుణ వేధింపులు తాళలేక దళిత యువకుడు క్రాంతికుమార్‌ ఆత్మహత్య, కర్నూలు జిల్లాకు చెందిన దళిత మహిళ గంగమ్మ, విజయనగరం జిల్లా కళావతి, శ్రీకాకుళం జిల్లా తిరుపతమ్మ ఘటనలు రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఇవి సాధారణ ఘటనలు కావు, పోలీసు కస్టడీలో హింస, అధికార దుర్వినియోగం, మానవ హక్కులు, రాజ్యాంగ హక్కులకు సంబంధించిన అత్యంత తీవ్రమైన అంశాలు. ఈ ఘటనలపై సీఎం, హోం మంత్రి, డీజీపీతో పాటు సంబంధిత అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పోలీస్‌ కస్టడీలో మరణంతో పాటు, ఇతర ఘటనల్లో బాధిత కుటుంబాలకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? చట్టపరమైన ప్రక్రియ పూర్తిగా పాటించారా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

కాపు నేతల సమ్మేళనాన్నీ డైవర్ట్‌ చేసే యత్నం:
    ఒక వ్యక్తి పోలీసు కస్టడీలో చనిపోతే దానికి హోం మంత్రి, డీజీపీ, పోలీసు అధికారులే బాధ్యత వహించాలి. కానీ ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, జనసేన ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి వైయస్సార్‌సీపీ కాపు నేతల ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా డైవర్ట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అత్యంత హేయం. దీన్ని కాపు నాయకులు, ఆ వర్గ ప్రజలు ఎప్పటికీ ఆమోదించరు.

ప్రశ్నించడం ఆపం.. సమాధానం చెప్పాల్సిందే:
    పవన్‌కళ్యాణ్‌ గారూ.. మీరు రాష్ట్రానికి డిప్యూటీ సీఎంనా? లేక సీఎం చంద్రబాబు లాయరా? అన్న సందేహం ప్రజల్లో కలుగుతోంది. మీరు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అయినా, ఆ బాధ్యతలు నిర్వర్తించకుండా, చంద్రబాబు ఎప్పుడు ఇరకాటంలో పడినా, ఆయన్ను కాపాడే బాధ్యత నెత్తికి ఎత్తుకుంటున్నారు. లాకప్‌ డెత్, కాపులపై దాడులు, ఇతర ఘటనలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన సమయంలో, మీరు మా పార్టీ అధినేత, మాజీ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌పై తిట్ల పురాణంతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా గతి తప్పి, మాపై విమర్శ చేస్తూ, హెచ్చరిస్తున్నారు. ఒక విషయం గుర్తు పెట్టుకొండి. సినీ డైలాగ్స్‌ రాజకీయాల్లో పని చేయవు.
    సాయికృష్ణ లాకప్‌డెత్, క్రాంతికుమార్‌ ఆత్మహత్య, గంగమ్మ, కళావతి, తిరుపతమ్మ ఘటనలపై పూర్తి నిజాలు వెలుగులోకి రావాలి. అందుకే ఎవరు, ఎలా బెదిరించినా, ఎంత తిట్టినా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం.

కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం:
    మంత్రి కందుల దుర్గేష్‌ కాపు కార్పొరేషన్‌ గురించి మాట్లాడే ముందు రెండేళ్లుగా ఆ సంస్థకు ఎందుకు నిధులు ఇవ్వలేదో చెప్పాలి. అదే జగన్‌గారి హయాంలో కాపు నేస్తం ద్వారా రూ.2,400 కోట్లు అందించడమే కాకుండా, అమ్మ ఒడి, విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన వంటి పథకాల ద్వారా కాపులతో సహా అన్ని వర్గాలకు సంక్షేమం అందించారు. మొత్తం రూ.36 వేల కోట్ల మేర కాపులకు లబ్ధి చేకూర్చారు. కానీ నేడు కాపులకు ఎలాంటి సంక్షేమం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని అడపా శేషు గుర్తు చేశారు.

Back to Top