తాడేపల్లిగూడెం: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోందని అప్సడా మాజీ వైస్ చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇంచార్జ్ వడ్డీ రఘురాం విమర్శించారు. "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమానికి ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందనతో కూటమి నేతల్లో ఆందోళన మొదలైందన్నారు. ఏలూరు పార్లమెంట్ వైయస్ఆర్‌సీపీ ఇంచార్జ్ కారుమూరి సునీల్ కుమార్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తోట త్రిమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు నాయకుల సమావేశంలో కూటమి ప్రభుత్వ హయాంలో కాపు సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాలపై చర్చించినట్లు చెప్పారు. పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతాయుత రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కావని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన వైయస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచిది కాదన్నారు. ప్రజల్లో వైయస్ఆర్‌సీపీకి, వైయస్ జగన్‌కు వస్తున్న ఆదరణే కొందరు నేతలను అసహనానికి గురిచేస్తోందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తి విసిరిన సవాల్‌ను స్వీకరించే ధైర్యం ఉంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ప్రజా తీర్పు కోరాలని పంతం నానాజీకి సూచించారు. ప్రజల మద్దతు ఎవరికి ఉందో ఎన్నికల ద్వారానే తేలుతుందన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలు కూడా ఖండనీయమని రఘురాం అన్నారు. విలేకరులను అవమానించేలా మాట్లాడటం సరైంది కాదని, వెంటనే క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాపు సామాజిక వర్గం పేరుతో రాజకీయాలు చేస్తూ, అదే వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం తగదన్నారు. పంతం నానాజీ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో వైయస్ఆర్‌సీపీ ప్రజాస్వామ్యబద్ధంగా తగిన సమాధానం ఇస్తుందని హెచ్చరించారు.