నెల్లూరు: డీఎస్సీ-2025 నియామకాల్లో జరిగిన అక్రమాలను ప్రశ్నించినందుకే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన కృష్ణ చైతన్య జూనియర్ కాలేజీలపై తనిఖీల పేరుతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డిని పరామర్శించిన 18 మంది వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ నేతలు ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. వారు ఏమన్నారంటే.. - ఇది వైయస్ఆర్‌సీపీపై జరిగిన దాడిగానే భావిస్తున్నాం: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలు, అవినీతిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బయటపెట్టినందుకే ఆయనకు చెందిన విద్యాసంస్థలపై ప్రభుత్వం తనిఖీల పేరుతో కక్షసాధింపు చర్యలకు దిగింది. రాష్ట్రంలో వందలాది జూనియర్ కాలేజీలు ఉన్నప్పటికీ, కేవలం చంద్రశేఖర్‌రెడ్డికి సంబంధించిన కాలేజీలనే టార్గెట్ చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే వైయస్ఆర్‌సీపీకి చెందిన 18 మంది ఎమ్మెల్సీలు వైయస్ జగన్ ఆదేశాలతో నెల్లూరుకు వచ్చి సంఘీభావం ప్రకటించాం. ఇది ఒక్క చంద్రశేఖర్‌రెడ్డిపై జరిగిన దాడి కాదు.. వైయస్ఆర్‌సీపీపై జరిగిన దాడిగానే భావిస్తున్నాం. - విద్యాసంస్థలపై దాడులతో కొత్త సంప్రదాయానికి తెర వైయస్ఆర్‌సీపీ పాలనలో ఏనాడూ విద్యాసంస్థలపై కక్షసాధింపు చర్యలు జరగలేదు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరలేపింది. విద్యాసంస్థలపై దాడులు, కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మేం వెనక్కి తగ్గం. చంద్రశేఖర్‌రెడ్డి విద్యాసంస్థలపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా నెల్లూరులో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుస్తాం. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం ఉంటే చంద్రబాబు, లోకేష్ ప్రజల ముందుకు రావాలి. కేసులు, దాడులతో వైయస్ఆర్‌సీపీని భయపెట్టలేరు అని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. - సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి విద్యాసంస్థలపైనే ప్రభుత్వం ఎందుకు దాడులు చేస్తోంది? డీఎస్సీ-2025లో జరిగిన అవకతవకలను ప్రశ్నించినందుకే ఆయన కాలేజీలను లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ కక్షసాధింపునకు నిదర్శనం. ప్రభుత్వం తప్పు చేయకపోతే డీఎస్సీ అంశంపై సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోంది? మేం లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దాడులకు పాల్పడటం సరికాదు. చట్టసభల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తుండటంతో డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే వ్యక్తిగత వేధింపులకు దిగుతున్నారు. మంత్రి నారా లోకేష్‌తో పాటు ప్రభుత్వ పెద్దలు ఇటువంటి చర్యలను వెంటనే మానుకోవాలి. డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పడంతో పాటు సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలి. ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డికి వైయస్ఆర్‌సీపీ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుంది అని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు. - డీఎస్సీలో ఉద్యోగం ఇప్పిస్తామని రూ.15 లక్షలు వసూలు: ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు కందుకూరు నియోజకవర్గంలోని కరెడు పంచాయతీలో ఓ మహిళకు డీఎస్సీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.15 లక్షలు వసూలు చేశారు. ఇందుకు సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్లు కూడా తమ వద్ద ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డీఎస్సీ నియామకాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి, టీచర్ పోస్టులను విక్రయించిన వాస్తవాలను తాము ఆధారాలతో బయటపెడుతుంటే, వాటికి సమాధానం చెప్పకుండా తమపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. ప్రశ్నించిన వారిని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నియామకాల్లో అవకతవకలు, పేపర్ లీకుల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నారాయణ విద్యాసంస్థలపై కూడా తనిఖీలు నిర్వహించాలి. ఆ సంస్థల్లో నిబంధనల అమలుపై సమగ్ర విచారణ జరిపితే అనేక విషయాలు బయటపడతాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన వారిపై కక్షసాధింపు చర్యలు కొనసాగితే తగిన రాజకీయ ప్రతిస్పందన తప్పదని మాధవరావు హెచ్చరించారు. -నారాయణ, చైతన్య కాలేజీలపై విచారణ చేసే దమ్ముందా?: ఎమ్మెల్సీ కుంభ రవిబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. శాసన మండలిలో ప్రభుత్వ విధానాలు, డీఎస్సీ–2025 నియామకాలపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రశ్నలు లేవనెత్తినందుకే ఆయనకు చెందిన విద్యాసంస్థలపై తనిఖీల పేరుతో వేధింపులు చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలపై మాట్లాడితే రాజకీయ కక్షతో దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. రాష్ట్ర విద్యావ్యవస్థను దెబ్బతీసిన నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టడం లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ సంస్థల కార్యకలాపాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలి అని కుంభ రవిబాబు సవాల్ విసిరారు. - ప్రశ్నిస్తూనే ఉంటాం: ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టకుండా, వాటిని ప్రశ్నిస్తున్న వైయస్ఆర్‌సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. డీఎస్సీ నియామకాలలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి బహిర్గతం చేసినందుకే ఆయనకు చెందిన విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా సహా పలు విభాగాల్లో ఉద్యోగాల విక్రయంపై తాము ఆధారాలతో ప్రశ్నించాం, ప్రతిభావంతులైన అభ్యర్థులకు అండగా నిలుస్తూ “మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ” అని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాం. అయితే ఆ ఆరోపణలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు దిగింది. ఎన్నో ఏళ్లుగా విద్యాసంస్థలను నిర్వహిస్తున్న చంద్రశేఖరరెడ్డి కాలేజీలపై తనిఖీలు చేసిన అధికారులకు ఎలాంటి అక్రమాల ఆధారాలు లభించకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై వైయస్ఆర్‌సీపీ ప్రశ్నించడం మాత్రం ఆపదని కల్పలతారెడ్డి స్పష్టం చేశారు. - వైయస్ జగన్ గారి గుండె ధైర్యంతో పోరాటం: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇంకా ఎంత దిగజారగలరో స్పష్టంగా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో కృష్ణ చైతన్య కాలేజీలు విద్యా రంగంలో విశ్వాసాన్ని సంపాదించుకున్న సంస్థలు. పేద విద్యార్థులు, అనాథలు, ఫీజులు చెల్లించలేని వారికి కూడా చంద్రశేఖరరెడ్డి విద్యావకాశాలు కల్పించారు. అందుకే ఆ సంస్థలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్‌గా సేవలందించిన చంద్రశేఖరరెడ్డి, తర్వాత వైయస్ జగన్ నాయకత్వాన్ని నమ్మి వైయస్ఆర్‌సీపీలో చేరారు. డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలను ప్రశ్నించినందుకే ఆయన విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపే. వైయస్ఆర్‌సీపీకి వైయస్ జగన్ గారి నుంచి వారసత్వంగా వచ్చిన గుండె ధైర్యం, పోరాట స్ఫూర్తి ఉంది. ఇలాంటి దాడులు, బెదిరింపులకు మేము భయపడే ప్రసక్తే లేదు. ప్రజల తరఫున ప్రశ్నిస్తాం. చంద్రశేఖరరెడ్డికి పార్టీ సంపూర్ణ అండగా ఉంటుంది. లక్ష్యసాధన కోసం మరింత బలంగా పనిచేసి 2029లో వైయస్ఆర్‌సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాం” అని కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. - భయపడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంత్రి నారా లోకేష్ వ్యవహారశైలిలో దుందుడుకుతనం, రాజకీయ కక్షసాధింపు ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. నేను డీఎస్సీ–2025 నియామకాలపై చేసిన ఆరోపణలు ఏవీ ఆధారాలు లేనివి కావు. శాసన మండలిలోనూ, మీడియా సమావేశాల్లోనూ ప్రతి అంశాన్ని సాక్ష్యాధారాలతోనే ప్రజల ముందుంచాను. అయినప్పటికీ వాటికి సమాధానం చెప్పకుండా నా విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని తనిఖీల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. ఇది వ్యక్తిగతంగా నాపై జరిగిన దాడి మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుపై జరుగుతున్న దాడి. వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేశాం. నేడు ఒక విద్యాసంస్థను లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వం, రేపు మరెవరినైనా ఇదే విధంగా వేధించే అవకాశం ఉందని ప్రజలు గుర్తించాలి. ఈ సందర్భంగా నాకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైయస్ జగన్ నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం కొనసాగుతుంది. ఇలాంటి దాడులు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు” అని చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు.