అనంతపురం : రాష్ట్రంలో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని వైయస్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద వైయస్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఓబిరెడ్డి మాట్లాడుతూ గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 56 వేల మంది కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగ హోదా కల్పించిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచనలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు. వైయస్ఆర్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ పేదలు, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తున్న ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందన్నారు. గతంలో వైయస్ జగన్ లాభనష్టాల లెక్కలు చూడకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వేలాది మంది కార్మికుల పక్షాన నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటీకరించి, ప్రభుత్వ ఆస్తులను బినామీలకు కట్టబెట్టే విధానాన్ని కూటమి ప్రభుత్వం అవలంబిస్తోందని విమర్శించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ వల్ల కేవలం ఉద్యోగులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు నష్టపోతారని, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సేవలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. వైయస్ఆర్‌సీపీ నగర అధ్యక్షులు చింత సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తారని విమర్శించారు. ఆర్టీసీని నష్టాల పేరుతో ప్రైవేటీకరించి లక్షలాది కార్మికుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీర్, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షులు మార్కెట్ ఖాజా, బూత్ కమిటీ విభాగం జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు సైఫుల్లా బేగ్, సంపంగి రామాంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, నాగార్జున రెడ్డి, గజ్జల నాగేష్, నిజాం, ప్రకాష్, సాకే చిరంజీవి, రాజశేఖర్ రెడ్డి, కుళ్లాయప్ప, సతీష్, అనిల్ గౌడ్, మహమ్మద్ హుస్సేన్, వెంకటేష్, శ్రీనివాస్ నాయక్, రామంజి, సంగమేష్, శ్రీనివాసులు, వెంకటరెడ్డి, రవికుమార్, సాకే రామాంజనేయులు, మన్సూర్, మణికంఠ, తేజ, ఆటో వెంకీ, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.