పంతం నానాజీ.. నోరు అదుపులో పెట్టుకొండి

కారుమూరి వెంకట్‌రెడ్డి హెచ్చరిక

లేకపోతే మా పార్టీ మహిళలు చెప్పులతో కొడతారు

కారుమూరు వెంకట్‌రెడ్డి స్పష్టీకరణ

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి

పవన్‌కళ్యాన్‌ బాటలో రెచ్చిపోతున్న జనసేన ఎమ్మెల్యేలు

అధికార మదంతో వారు కన్నూ మిన్నూ కానడం లేదు

జనసేన కార్యకర్తలను ఈడ్చి కొడుతున్న టీడీపీ నాయకులు

జనసేనను ఉద్దేశించి నందమూరి బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు

అలగా జనం. సంకరజాతి అంటూ విమర్శ. ఆక్షేపణ

అయినా ఏనాడూ నోరెత్తని పవన్‌. ఆ పార్టీ ఎమ్మెల్యేలు

టీడీపీ లేకపోతే ఎమ్మెల్యేగా గెలవలేనని పవన్‌ భయం 

ప్రెస్‌మీట్‌లో కారుమూరు వెంకట్‌రెడ్డి ధ్వజం

తాడేపల్లి: తానొక ఎమ్మెల్యేనన్న విచక్షణ కూడా మరిచి మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గారిని ఉద్దేశించి బరితెగించి నోటికొచ్చినట్టు మాట్లాడిన కాకినాడ రూరల్‌ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తక్షణం క్షమాపణ చెప్పాలని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్‌ కళ్యాణ్‌ను ఆదర్శంగా తీసుకునే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోతున్నారని, గడిచిన రెండేళ్లుగా వారి వ్యవహారశైలి, మాట్లాడుతున్న భాష చూస్తే గూండాలు, రౌడీలకు ఏమాత్రం తీసిపోకుండా ఉందని ధ్వజమెత్తారు. పంతం నానాజీ ఇలాగే రెచ్చిపోతే వైయ‌స్ఆర్‌సీపీ మహిళలు చెప్పులతో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 
    
చంద్రబాబు, నారా లోకేష్, పవన్‌ సహా జనసేన ఎమ్మెల్యేలందరిపైనా పదుల సంఖ్యలో క్రిమినల్‌ కేసులున్నాయని,  ఆయనే క్రిమినల్స్‌ని పెంచి పోషిస్తున్నాడన్న  కారుమూరు వెంకటరెడ్డి, క్రిమినల్స్‌కి తొక్కి పెట్టి నార తీయాలనుకుంటే వారితోనే మొదలుపెడితే బాగుంటుందని సూచించారు. టీడీపీ నాయకులు జనసేన కార్యకర్తల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడుతుంటే ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. జనసేనను ఉద్దేశించి, అలగా జనం, సంకరజాతి అంటూ నందమూరి బాలకృష్ణ దూషించినా ఇప్పటివరకు నోరెత్తలేని స్థితిలో ఉండి కూడా సమాజానికి ప్రవచనాలు, మాకు హెచ్చరికలు జారీ చేయడం హాస్యాస్పదమని అన్నారు. 
టీడీపీని కాదని బయటకొస్తే ఎమ్మెల్యేగా కూడా గెలవనేనని పవన్‌కు భయం కాబట్టే తిట్టినా, కొట్టినా మరో 15 ఏళ్లు ఆ పార్టీకి ఊడిగం చేయాలని జనసేన కార్యకర్తల్ని మానసికంగా బెదిరిస్తున్నాడని కారుమూరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 
ప్రెస్‌మీట్‌లో కారుమూరు వెంకట్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:

- సభ్యసమాజం తల దించుకునేలా నానాజీ మాటలు:
    
గడిచిన రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ పెద్దల వ్యవహారశైలి, వారు మాట్లాడుతున్న భాష చూస్తే గూండాలు, రౌడీలకు ఏ మాత్రం తీసి పోకుండా ఉంది. కూటమి ఎమ్మెల్యేలే అధికారులను జీపుల్లో తీసుకెళ్లి కొట్టడం, వారిపై దాడులు చేయడం, సొంత పార్టీ నాయకుల ఇళ్ల మీదకు అర్ధరాత్రి బుల్డోజర్‌ తో వెళ్లి ఇళ్లు కూలగొడతానని బెదిరించడం, కులాల పేరుతో దూషించడం, మహిళలను వేధించడం, దాడులు, దౌర్జన్యాలు, కబ్జాల్లో వారి పాత్ర వంటి ఎన్నో ఘటనలు సంఘ విద్రోహ శక్తులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది.
    మాజీ సీఎం జగన్‌గారిని ఉద్దేశించి కాకినాడ రూరల్‌ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. రాష్ట్రంలో ఒక బలమైన పార్టీ అధ్యక్షుడిని, మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వాడు, వీడు, నా కొడక.. అంటూ ఎమ్మెల్యే మాట్లాడడం అత్యంత హేయం. తమ పార్టీ అధినేత పవన్‌ను ఆదర్శంగా తీసుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పిచ్చిగా రెచ్చిపోతున్నారు. 

- మాఫియా డాన్‌లా మారిన నానాజీ:
    
తాను బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధి అన్న విషయాన్ని మర్చిన పంతం నానాజీ, ఒక మాఫియా డాన్‌లా వ్యవహరిస్తున్నాడు. గతంలోనూ ఒక దళిత వైద్యుడైన ఉమామహేశ్వరావుని ఏరా లం.. కొడకా.. చంపేస్తా అంటూ రెచ్చిపోయి రౌడీలతో వచ్చి దాడికి దిగాడు. కాకినాడకు చెందిన సొంత పార్టీ కార్యకర్త ఆకుల బాలరాజుని రూ.10 లక్షలు డిమాండ్‌ చేసి ఇవ్వలేదనే కోపంతో షాపును కూల్చేశాడు. ఆయన నుంచి పవన్‌ కళ్యాణ్‌ ఏమైనా వాటాలు వెళ్తున్నాయో ఏమో కానీ, ప్రపంచానికి నీతులు చెప్పే పవన్‌ కళ్యాణ్‌ మాత్రం  పంతం నానాజీ అరాచకాలు, దోపిడీ, దుర్భాషలు తప్పని హెచ్చరించడు సరికదా, ఏనాడూ కనీసం స్పందించలేదు. ఇదే కాకినాడలో పవన్‌ కళ్యాణ్‌ ‘సీజ్‌ ది షిప్‌’ అన్న తర్వాత కూడా ఎన్నిసార్లు రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిపోయిందో అని ఆయనే చెప్పాడు. అయినా పవన్‌కళ్యాణ్‌ నోరెత్తలేదు.
    క్రిమినల్స్‌ తాట తీస్తానంటున్న పవన్‌ కళ్యాణ్, ఎమ్మెల్యే పంతం నానాజీ మీద 11 క్రిమినల్‌ కేసులున్నాయి. ఆయన తాట తీయొచ్చు కదా. మహిళకు ఐదుసార్లు అబార్షన్‌ చేయించి వేధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ మీద ఏం చర్యలు తీసుకున్నాడు. తిరుపతిలో మహిళల జీవితాలతో ఆడుకుంటున్న కామ కిరణ్‌ ఆగడాలను అరికట్టాడా?  

- జనసేన పార్టీ ఎమ్మెల్యేలందరిపైనా క్రిమినల్‌ కేసులు:

    క్రిమినల్స్‌ కి వార్నింగ్‌ ఇచ్చే పవన్‌ కళ్యాణ్‌ కొన్ని వాస్తవాలు మర్చిపోయినట్టున్నాడు. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ ఇచ్చిన లెక్కల ప్రకారం చంద్రబాబు మీద 19, పవన్‌ కళ్యాణ్‌ మీద 8, నారా లోకేష్‌ మీద 17 క్రిమినల్‌ కేసులున్నాయి. వాసంశెట్టి సుభాష్‌ 12, హోంమంత్రి అనిత 7, నిమ్మల రామానాయుడు 20, కొల్లు రవీంద్ర మీద 17, వారితో జనసేన ఎమ్మెల్యేలు పంతం నానాజీ, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేశ్, బత్తుల రామకృష్ణ, అరవ శ్రీధర్‌ మీద కూడా చాలా క్రిమినల్‌ కేసులున్నాయి. ఇంతమంది క్రిమినల్స్‌ని పార్టీలో పెట్టుకుని, వారిని పెంచి పోషిస్తూ సమాజం మీద పడి ఏడుస్తాడేంటి?.
    కాపు సామాజికవర్గానికి చెందిన గాదె సాయికృష్ణను పోలీసులు చంపేసి, దహనం చేసి చివరకు బూడిద కూడా ఇవ్వకుండా మాయం చేస్తే 40 రోజులైనా ఎందుకు స్పందించడం లేదు? ఈ విషయంలో మా పార్టీ స్పందించకపోయి ఉంటే, అసలు ఈ విషయం ప్రపంచానికి తెలిసేదా? 

- టీడీపీ లేకపోతే, ఎమ్మెల్యే కాలేనని పవన్‌ భయం:

    టీడీపీతో కలిసి పోటీ చేస్తే 6 శాతం ఓట్లు సాధించిన పార్టీలో పంతం నానాజీ రెచ్చిపోతుంటే 40 శాతం ఓట్లున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఇంకెంత గట్టిగా బదులివ్వాలో ఆలోచించుకోండి. జగన్‌గారు మాకు  సంస్కారం నేర్పించారు కాబట్టే మేము ఏమీ అనలేకపోతున్నామని గుర్తుంచుకోండి. టీడీపీ నుంచి అభ్యర్థులు వస్తే తప్ప జనసేనలో ఎమ్మెల్యేగా నిలబడటానికి క్యాండిడేట్లు కూడా లేరు. ఇంకా టీడీపీ లేకపోతే, తాను కనీసం ఎమ్మెల్యే కూడా కాలేనని పవన్‌కు భయం. అందుకే టీడీపీకి 15 ఏళ్లు ఊడిగం చేస్తామని ఆయన చెబుతున్నారు. అలాంటి దిగజారిన పార్టీ ఎమ్మెల్యే అయిన పంతం నానాజీ, ఇకనైనా మాట్లాడేప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని కారుమూరు వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.
 

Back to Top