ఒంటరిగా పోటీ చేసే దమ్ము జనసేనకు ఉందా? 

వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు జక్కంపూడి రాజా స‌వాల్‌

తూర్పుగోదావరి జిల్లా: కాపు నేతల సమావేశంపై జనసేన నేత ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలను వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ‌క్కంపూడి రాజా తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన జనసేన నేత‌ల‌కు స‌వాల్ విసిరారు. ద‌మ్ముంటే జ‌న‌సేన నేత‌లు ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయాల‌ని సూచించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. కాపు వర్గాలు చిరంజీవి కుటుంబాన్ని ఒక తరానికి మార్గదర్శకులుగా భావించాయని, ఆ నేపథ్యంలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని జక్కంపూడి రాజా గుర్తు చేశారు. అయితే అనుకున్న స్థాయిలో రాజకీయ ప్రయాణం కొనసాగలేక మధ్యలోనే ఆగిపోయారని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్, రాజకీయ ప్రస్థానం అన్నీ చిరంజీవి ప్రభావంతోనే వచ్చాయని జక్కంపూడి రాజా అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా, అవి వ్యక్తిగత స్థాయికి దిగజారకూడదని ఆయన స్పష్టం చేశారు. “పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తరహాలోనే జనసేన నేతలు కూడా అదే భాషను కొనసాగిస్తున్నారని” ఆయన విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ కాపు నేతల సమావేశంపై ఇతర పార్టీల స్పందన అవసరం లేనిదని పేర్కొన్నారు.  తప్పు జరిగితే అంగీకరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, ప్రతిపక్షాలపై ప్రతిదాడులు చేయడం సరైన విధానం కాదని జక్కంపూడి రాజా అన్నారు. జనసేన నేతలు “దమ్ము” గురించి మాట్లాడుతున్నారని, నిజమైన రాజకీయ ధైర్యం అంటే ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే సామర్థ్యం ఉండాలని ఆయన సవాల్ విసిరారు. వైయ‌స్ఆర్‌సీపీ ఒంటరిగా పోటీ చేసిన చరిత్రను గుర్తుచేస్తూ, ఇతర పార్టీలతో పొత్తులు లేకుండా ప్రజల్లో నిలబడే శక్తి తమకుందని ఆయన స్ప‌ష్టం చేశారు.

Back to Top