కాకినాడ: వైయస్ఆర్‌సీపీ కాపులను కుక్కలతో పోల్చిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తక్షణం తన మాటలను వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పాలని వైయస్ఆర్‌సీపీ కాపు నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడలోని పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీలో ఉన్న సీనియర్ కాపు నాయకులను కించపరుస్తూ ఆయన మాట్లాడిన భాష అత్యంత హేయమని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ కాపు నాయకులు సమావేశమైతే ఆయనకొచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. కాపులను చంద్రబాబు ప్రభుత్వం రౌడీలుగా చిత్రీకరిస్తున్నాదని, చంద్రబాబు కాపులను మన చేతులతో మన కళ్లనే పొడుచుకునేలా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాకప్ డెత్‌లకు సమాధానం చెప్పలేక, డీఎస్సీ అక్రమాలపై తలెత్తుకోలేక వైయస్ఆర్‌సీపీ నాయకులను తిట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయమని చంద్రబాబు ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ హడావుడిగా కాకినాడలో సమావేశం ఏర్పాటు చేశాడని వారు వివరించారు. తాను వైయస్ఆర్‌సీపీ నాయకులను తిట్టిందే కాకుండా ఎమ్మెల్యే పంతం నానాజీతోనూ వైయస్ జగన్ గారిని తిట్టించాడని స్పష్టం చేశారు. ఇంకోసారి వైయస్ జగన్ గారిని ఉద్దేశించి ఎవరైనా నోటికొచ్చినట్టు వాగితే తగిన విధంగా సమాధానం చెబుతామని వారు హెచ్చరించారు. వారు ఇంకా ఏం మాట్లాడారంటే.. ఐదు లాకప్‌డెత్‌లకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు - దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కాపు యువకుడు గాదె సాయికృష్ణ, మాదిగ యువకుడు క్రాంతికుమార్, అలాగే కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ, విజయనగరం జిల్లాలో కళావతి, శ్రీకాకుళం జిల్లాలో తిరుపతమ్మ సహా ఈ రాష్ట్రంలో జరిగిన లాకప్‌డెత్‌లు, ఆ తర్వాత శవాలను మాయం చేశారన్న ఘటనలు రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. మా ప్రశ్న ఒక్కటే, కస్టడీ మరణాలపై సమాధానం చెప్పండి. బాధ్యులపై చర్యలు తీసుకోండి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయండి. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కొందరు పోలీసు అధికారుల తీరుతో రాష్ట్రంలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది. పోలీసు వ్యవస్థ గాడితప్పింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ లు రాజకీయ కక్షల అమలు కేంద్రంగా మారిపోయాయి. పోలీసులను చూసి ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ప్రభుత్వం కాదా? ఇవన్నీ అడుగుతుంటే ఉన్నట్టుండి కాకినాడలో పవన్ కళ్యాణ్‌తో మీటింగ్ పెట్టించారు. వైయస్ జగన్ గారు గాదె సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పతనమైన తీరును వివరించారు. దీంతో రాష్ట్రమంతా లాకప్‌డెత్‌లపై చర్చ జరుగుతోంది. ఇలాంటి విపత్కర, గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించేందుకు హఠాత్తుగా చంద్రబాబు.. పవన్‌కళ్యాణ్ ని రంగంలోకి దించాడు. టాపిక్ డైవర్షన్‌లో భాగంగానే వైయస్ఆర్‌సీపీ నాయకులను ఉద్దేశించి పవన్‌కళ్యాణ్ గూండా భాష వాడారు. ఆయన బాటలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా మా నాయకుడిని ఉద్దేశించి అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు. వైయస్ఆర్‌సీపీ లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తిట్లతో డైవర్షన్ చేయడం చంద్రబాబు రాజకీయ పద్ధతి. ఇప్పుడు ఆ పనికి పవన్‌కళ్యాణ్‌ను ఉపయోగిస్తున్నారు. బూతులు, బెదిరింపులు, రౌడీ భాష ప్రజాస్వామ్యంలో నడవవు పవన్‌కళ్యాణ్ ఇలా తాను బూతులు మాట్లాడి, తన ఎమ్మెల్యేల చేత మాట్లాడించి, వైయస్ఆర్‌సీపీ దానిపై తీవ్రంగా స్పందిస్తే క్రమంగా పరస్పర తిట్ల పురాణంగా మార్చి, సాయికృష్ణ సహా రాష్ట్రంలో జరిగిన లాకప్‌డెత్‌లు, శవాల మాయమైన అత్యంత దారుణ ఘటనల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలన్న కుట్ర కనిపిస్తోంది. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పే పవన్ కళ్యాణ్, ఇవాళ ప్రజల నుంచి వచ్చిన ప్రశ్నలను చూసి భయపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీరు రౌడీ అని, ఇంకో ఎమ్మెల్యే బూతులు మాట్లాడితే ఈ లక్షలమంది పడతారని అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ మర్యాదకరంగా ఉంటే, సమాజం నుంచి మర్యాద లభిస్తుంది. అమర్యాదకరంగా మాట్లాడితే అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. రాజకీయ భేదాలు ఉండొచ్చు. విమర్శలు ఉండొచ్చు. కానీ బూతులు, బెదిరింపులు, రౌడీ భాష ప్రజాస్వామ్యంలో నడవవు. గతంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఇలాగే దురుసుగా ప్రవర్తిస్తే ఆయన్ను వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు కాకినాడలో ఉరికించి తరిమి కొట్టారు. ఆ విషయం అప్పుడే ఆయన మర్చిపోయినట్టున్నాడు. అగ్రవర్ణాల్లో పేదరికంలో కాపులే ఎక్కువ మంది ఉన్నారు. 2013 నుంచి కాపులకు న్యాయం చేస్తామని నమ్మించి పవన్ కళ్యాణ్ వెంట తిప్పుకుంటున్నాడు. ఓట్ల కోసం 5 శాతం రిజర్వేషన్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. ఇప్పుడు అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ దానికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఉన్న కాపులను చంద్రబాబు చేత సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తున్నారు. వంగవీటి రంగా నుంచి అందర్నీ రౌడీలుగా తిట్టిస్తున్నారు. చంద్రబాబు తన తెలివిని ఉపయోగించి మా చేతులతో మా కళ్లే పొడిపిస్తున్నాడు. బజారు భాషతో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్న వ్యూహం - కురసాల కన్నబాబు, మాజీ మంత్రి చంద్రబాబు ఎజెండాతో పనిచేస్తూ పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అందులో భాగంగానే పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. బజారు భాషతో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్న వ్యూహంలో భాగంగానే ముందుగా పవన్ కళ్యాణ్ మాట్లాడి, తర్వాత పంతం నానాజీతో మాట్లాడించాడు. ఒంటరిగా పోటీ చేస్తే వైయస్ జగన్ గారిని గెలవలేమని, అందుకే ముగ్గురం కలిసొచ్చామని.. మరో 15 ఏళ్లు కలిసే ఉంటామని ప్రతి సభలో చెబుతున్నారు. అలాంటిది జగన్ గారికి పంతం నానాజీ సవాల్ చేయడం చూస్తే నవ్వొస్తుంది. పంతం నానాజీకి వైయస్ జగన్ గారి పేరెత్తే అర్హత కూడా లేదు. వైయస్ జగన్ గారి గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. వైయస్సార్పీపీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు. ఇది లక్షల కుటుంబాల ఆత్మగౌరవం. మాపార్టీలో పేదలను, బడుగులను, బలహీనులను, దళితులను, మైనార్టీలను అవమానించడమే. బొత్స సత్యనారాయణ సహా వైయస్ఆర్‌సీపీ కాపు సీనియర్ నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుంటే పంతం నానాజీ దాన్ని కుక్కల మీటింగ్ అంటున్నాడు. ఇదేనా ఆయన సభ్యత, సంస్కారం? మా పార్టీ కాపు నాయకులు కూర్చుని మాట్లాడుకుంటే ఆయనకెందుకు భయం? కాపులకు బకాయిలున్న హామీలపై ఎందుకు ప్రశ్నించడం లేదు? అసలు పవన్‌కళ్యాణ్ ఒక మంత్రి మాత్రమే. తాను ప్రాతినిథ్యం వహించే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ప్రజల సమస్యలు, గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడాలి. కానీ ఇక్కడ మాట్లాడేది తిట్లు, బెదిరింపులు, డైవర్షన్ రాజకీయాలు. ఆ తల్లికి సమాధానం చెప్పలేవా? వైయస్ఆర్‌సీపీ అధికారంలో ఉండగా శ్రీకాళహస్తిలో మహిళా ఎస్సై ఒక జనసేన కార్యకర్తను అవమానించిందని ఊగిపోయిన పవన్ కళ్యాణ్, తన కొడుకు ఆచూకీ చెప్పమని 40 రోజులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న తల్లి ఆవేదన కనిపించడం లేదా? బూడిద కూడా దొరక్కుండా మాయం చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? క్రిమినల్ కేసులన్నంత మాత్రాన వారిని చంపేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? పోలీస్ స్టేషన్‌లలో జరుగుతున్న దారుణాలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదా? డీఎస్సీ అక్రమాలపై చర్చకు సవాల్ చేసిన నారా లోకేష్ ఆచూకీ ఇంతవరకు తెలియడం లేదు. చర్చకు వైయస్ఆర్‌సీపీ సిద్దంగా ఉందని చెబితే వారం రోజులైనా ఆయన నుంచి సమాధానం రాదే? చంపేసిన సీఐని కాపాడటానికి ధర్నాలు చేయించి ఆయన్ను హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి తోచింది చేసేట్టయితే ఇక రాజ్యాంగం ఉన్నది దేనికి? వైయస్ జగన్ గారు సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శిస్తే 23 కేసులున్న క్రిమినల్‌ని పరామర్శించాడని ప్రచారం చేశారు. తెల్లారి పొద్దున్నే అదే సాయికృష్ణ తల్లిని ఎందుకు పిలిచి మాట్లాడినట్టు? లా అండ్ ఆర్డర్‌ని చూసే చంద్రబాబు, ఇంతగా విఫలమవుతుంటే దానికి ఎందుకు సమాధానం చెప్పడం లేదు? మొదట్నుంచీ చంద్రబాబు మానవత్వంతో ఆలోచించకుండా కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. చచ్చేదాకా పిఠాపురం వదిలేది లేదు - వంగా గీత, మాజీ ఎంపీ - వైయస్ఆర్‌సీపీ కాపు ముఖ్య నాయకులు మీటింగ్ పెట్టుకుంటే ఎందుకంత ఉలిక్కిపాటు? మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో ఉంటే కుక్కలతో పోలుస్తారా? కాపు బిడ్డల గురించి ఇలాగేనా మాట్లాడేది? కాపు ఆడపడుచుగా నేను పంతం నానాజీని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా? కాపులకు ఇస్తామన్న కాపు నేస్తం గురించి ఎందుకు స్పందించడం లేదు? కాపు కార్పొరేషన్ కి ఏడాదికి రూ.3వేల కోట్లు ఇస్తామన్న హామీ ఏమైంది? సంస్కారవంతమైన కాపు కుటుంబంలో పుట్టిన ఏ నాయకుడూ పంతం నానాజీలా ఇంత సంస్కార హీనంగా మాట్లాడడు. అంత జుగుప్సాకరంగా వైయస్ జగన్ గారిని ఉద్దేశించి రెచ్చిపోయాడు. ఒక్క జగన్ గారిని ఎదుర్కోలేక మూడు పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసి ఈవీఎంలతో గెలిచారే కానీ, సొంతంగా పోటీ చేసే దమ్ము ఏ పార్టీకైనా ఉందేమో చెప్పండి. సూపర్ సిక్స్ పథకాలనే అమలు చేయలేని వారు జగన్ పేరెత్తే అర్హత లేదు. పిఠాపురంలో కాపులు ఎక్కువగా ఉన్నారని పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేశాడే కానీ మరే ఇతర నియోజకవర్గాలు ఎందుకు ఎంచుకోలేదు? 1994లోనే ఎన్టీఆర్ గారు పిఠాపురం పంపిస్తే వచ్చాను. 2009లో ప్రజారాజ్యంలో చిరంజీవి గారు సీటిస్తే గెలిచి ఎమ్మెల్యే అయ్యాను. పిఠాపురం నా సొంతం. నేను ఇక్కడే పుట్టా. చనిపోతే నా అంత్యక్రియలు కూడా ఇక్కడే జరుగుతాయి. కాపులకు ప్రభుత్వం నుంచి న్యాయం జరిగేదాకా పోరాడతాం. మీ నాయకుడికి సొంత నియోజకవర్గం అంటూ ఉందా? - తోట నరసింహం, మాజీ ఎంపీ నిన్న వైఎస్సార్‌సీపీ కాపు నేతలం ఆత్మీయంగా సమావేశమైతే, మీకెందుకు అంత ఉలికిపాటు, భయం? మేము కార్లు కూడా ఎక్కకముందే కాకినాడలో ప్రెస్ మీట్ పెట్టి, జగన్ గారిపై అంత దారుణంగా మాట్లాడటం మీ సంస్కారహీనతకు నిదర్శనం. ఒక మాజీ ముఖ్యమంత్రిని, పార్టీ అధినేతను పట్టుకుని 'వాడు, వీడు, నా కొడకా' అని మాట్లాడటం తూర్పుగోదావరి జిల్లా రాజకీయ పరిభాషేనా? నోటికొచ్చినట్టు మాట్లాడే మీ భాష పార్లమెంటరీ లాంగ్వేజ్ కిందకు వస్తుందా, అన్-పార్లమెంటరీ లాంగ్వేజ్ కిందకు వస్తుందా? దమ్ముంటే జగన్ గారిని కాకినాడలో పోటీ చేయమని సవాళ్లు విసురుతున్నారు కదా, మీ నాయకుడికి అసలు సొంతంగా ఒక నియోజకవర్గం అంటూ ఉందా? జగన్ గారికి ఓటమి ఎరుగని పులివెందుల ఉంది, మరి మీ కూటమి నాయకుడికి ఏ ఊరుంది, ఏ నియోజకవర్గం ఉందో చెప్పగలరా? మా కాపు నేతల సమావేశాన్ని 'కుక్కల మీటింగ్' అనడం ద్వారా జనసేనలోని కాపులతో సహా రాష్ట్రంలోని కాపులందరినీ మీరు అవమానించినట్టు కాదా? మీ అధినేత మెప్పు పొందడం కోసం, చప్పట్లు కొట్టించుకోవాలనే తాపత్రయంతో ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడమే. కూటమి ప్రభుత్వం వచ్చాక కాపుల కోసం మీరు సాధించిందేంటో, గత ప్రభుత్వంతో పోల్చి చర్చకు రాగలరా? జగన్ గారు ఇచ్చిన 'కాపు నేస్తం' పథకాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో సమాధానం చెప్పండి. నిరుపేద కాపు పిల్లలకు ఉపయోగపడే విదేశీ విద్యా దీవెన, ఫీజ్ రీఇంబర్స్మెంట్ బకాయిలను మీ ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదు? 'సూపర్ సిక్స్' అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, అందులో నిరుద్యోగ భృతి ₹3000, మహిళలకు ₹1500 ఎంతమందికి ఇచ్చారు? నాడు 'కులం ముఖ్యం' అన్న మీ పవన్ కళ్యాణ్ గారు, నిన్న కాకినాడకు వచ్చి 'కులం లేదు, మతం లేదు' అని ఎందుకు ప్లేట్ ఫిరాయించారు? ఒంటరిగా ఉన్న జగన్ గారిని ఓడించడానికి ముగ్గురు కలిసిన మీరే, వైయస్ఆర్‌సీపీ నేతలు కలిసి కూర్చుంటే భయపడి బురదజల్లడం ఆపండి.