సాలూరు: సాలూరు నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీకి మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా కేసలి పంచాయతీకి చెందిన పలువురు గ్రామస్తులు టీడీపీని వీడి వైయస్ఆర్‌సీపీ వైపు అడుగులు వేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర సమక్షంలో పలువురు వైయస్ఆర్‌సీపీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహభరితంగా డాన్సులు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ కండువాలు ధరించి పార్టీ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజన్నదొర వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలపై విశ్వాసంతోనే ప్రజలు స్వచ్ఛందంగా వైయస్ఆర్‌సీపీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సాలూరు నియోజకవర్గంలో మరిన్ని చేరికలు ఉంటాయని, ప్రజల ఆదరణతో వైయస్ఆర్‌సీపీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నాయకులు తెలిపారు.