అనకాపల్లి: పొద్దు పొడవక ముందే మొదలైన ప్రయాణమది. నెత్తిన సూర్యుడు నిప్పులు చెరుగుతున్నా.. కడుపు ఆకలి ముందు ఆ సెగలు ఓడిపోవాల్సిందే. కుటుంబ పోషణ కోసం, పిల్లల చదువుల కోసం ఆ మండుటెండలోనే ‘ఉపాధి’ వెతుక్కుంటూ వెళ్లిన పేద కూలీల శరీరాలు చెమట నదుల్లో తడిసిపోతున్నాయి. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం మునగపాక గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమైన కార్మికుల పరిస్థితి ఇది. శ్రమ నీరై కారుతుంటే.. దాహార్తితో అల్లాడుతున్న ఆ జీవుల కష్టాన్ని చూసి ఒకరి మనసు ద్రవించింది. ఆయనే వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్. రాజకీయాలకు అతీతంగా, కేవలం మానవత్వమే పరమావధిగా ఆయన ఉపాధి కూలీల చెంతకు చేరారు. శ్రమజీవుల ముఖాల్లో ఆనందాల చిరునవ్వులు ఎండ తీవ్రతను తట్టుకోలేక అల్లాడుతున్న కూలీల ఇబ్బందులను గమనించిన బొడ్డేడ ప్రసాద్, తన సొంత నిధులతో కొనుగోలు చేసిన వాటర్ బాటిళ్లు, హాట్ బాక్సులను వారికి స్వయంగా పంపిణీ చేశారు. మండుతున్న ఎండలో చల్లటి నీటి బాటిల్ చేతికి అందగానే ఆ శ్రమజీవుల ముఖాల్లో చిరునవ్వులు పూశాయి.. ఆ చిన్న సహాయం వారికి ఎంతటి పెద్ద ఊరటనిచ్చిందో చాటిచెప్పాయి. "మా కష్టాన్ని గుర్తించారు.. అంతే చాలు" "రోజంతా ఎండలో నకనకలాడుతూ కష్టపడే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి, ఇలా పరామర్శించి నీడలా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది. మా కష్టాన్ని అర్థం చేసుకునే మనసున్న నాయకుడు అండగా ఉన్నాడనే ధీమా కలిగింది" అంటూ పలువురు ఉపాధి హామీ శ్రామికులు కృతజ్ఞతలు తెలిపారు.