తాడేపల్లి: గడిచిన కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల ఎల్లో మీడియా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై పద్ధతి ప్రకారం విషం చిమ్ముతున్నాయని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీర శేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ గండిపేట భూమి వ్యవహారంలో బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన సోదరుడు బాధితులే తప్ప నిందితులు కారని అన్ని ఆధారాలతో సహా వివరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడమే లక్ష్యంగా తెలంగాణ, ఆంధ్రా సర్కార్ల మధ్య ఉన్న 'బాయ్ బాయ్' సంబంధాలతో అక్రమ కేసులు బనాయిస్తూ కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే.. అసలు గండిపేట భూమి వ్యవహారం ఏమిటి? హైదరాబాద్ శివార్లలోని గండిపేట వద్ద పదెకరాల భూమి కొనుగోలుకు సంబంధించి జరిగిన మోసంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సోదరులు బాధితులే తప్ప నిందితులు కారు. బొల్లా బ్రహ్మనాయుడు సోదరుడు బొల్లా రమేశ్ సదరు రైతులతో రూ. 1 కోటి అడ్వాన్స్ ఇచ్చి ఎంఓయూ (MOU) చేసుకున్నారు. ఆ తర్వాత రాధాకృష్ణ అనే వ్యక్తి తాను సచివాలయ ఉద్యోగిని అని పరిచయం చేసుకుని.. ఈ భూములు రెగ్యులరైజ్ అవుతున్నాయని మాయమాటలతో నమ్మించాడు. భూభారతిలో చేరుస్తున్నామంటూ నమ్మించి బొల్లా బ్రహ్మనాయుడు నుంచి మరో రూ. 2 కోట్లు తీసుకున్నాడు. ఫేక్ జీఓల గుర్తింపు - పోలీసులకు ఫిర్యాదు: అయితే భూమలు రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తూ ఫేక్ జీఓలు చూపించడంతో అనుమానం వచ్చిన బొల్లా సోదరులు నేరుగా జిల్లా కలెక్టర్‌ను సంప్రదించారు. ఆ జీఓలు నకిలీవని తేలడంతో కలెక్టర్ ద్వారా తహసీల్దార్‌కు, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేసి రాధాకృష్ణను అరెస్టు చేయించింది బొల్లా సోదరులేనని గుర్తుచేశారు. ఈ కేసులో ఏ-7గా ఉన్న రాధాకృష్ణ కూడా.. "బొల్లా సోదరులకు ఇందులో సంబంధం లేదు, వారు బాధితులే.. నా స్నేహితులు సునీల్, రాజేష్‌లతో కలిసి నేనే ఫ్రాడ్ చేశాను" అని ఒప్పుకున్నాడు. చంద్రబాబు అడ్డగోలు వాదనలు.. ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కడుంది? రాధాకృష్ణ అనే కేటుగాడు చేసిన మోసానికి, బాధితులుగా ఉన్న బొల్లా సోదరులు రూ. 2 కోట్లు కమిషన్ ఇచ్చారంటూ అక్రమంగా కేసు నమోదు చేశారు, తెలంగాణ పోలీసులు రాధాకృష్ణ వాంగ్మూలాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భూమి కొనుగోలు కోసం అడ్వాన్స్ ఇచ్చి ఎంఓయూ రాసుకుంటే అందులో ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కడుంది చంద్రబాబు గారూ?.. ఈనాడు పత్రిక కబ్జాకోరులుగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తే.. దాన్ని పట్టుకుని సీఎం చంద్రబాబు అసందర్భంగా మాట్లాడుతూ పక్క రాష్ట్రాల్లో రూ. 1500 కోట్ల భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడ్డం దుర్మార్గం. పవన్ కళ్యాణ్ 'కోడి చెరువు' ఆక్రమణపై చంద్రబాబు సమాధానం చెప్పాలి! పక్క రాష్ట్రాల్లో పరువు పోవడం గురించి మాట్లాడే చంద్రబాబుకు తమ కూటమి నేతల అరాచకాలు కనిపించడం లేదా? తెలంగాణలోని నిజాంపేట్ పరిధిలో 'కోడి చెరువు' ఆక్రమణకు పాల్పడి నిజమైన ల్యాండ్ గ్రాబింగ్ చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాదా?.పవన్ కళ్యాణ్ చెరువులను ఆక్రమిస్తే ఆంధ్రప్రదేశ్ పరువు పోలేదా చంద్రబాబు గారూ? దీనికి మీరు సమాధానం చెప్పాలి. టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసుపై ఎందుకు నోరు మెదపరు? టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పక్క రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు అడ్డంగా దొరికి పార్లమెంటు పరువు తీశారు.ఎంపీ అంతటి వ్యక్తి డ్రగ్స్ కేసులో దొరికితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు గంగలో కలవలేదా?దీనికి బాధ్యత వహించి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంది. రాష్ట్రంలో సాగుతోంది 'రెడ్ బుక్' పాలన! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు.ఏపీలో ప్రస్తుతం నారా వారి 'రెడ్ బుక్' రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పిచ్చి కుక్క పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడమే కూటమి పాలకుల లక్ష్యమని.. ప్రజలుఅన్నీ గమనిస్తున్నారని... సరైన సమయంలో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని వీరశేఖర్ రెడ్డి హెచ్చరించారు.