స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి

ఆ కుటుంబంలో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి

శ్రీ వైయస్‌ జగన్‌ డిమాండ్‌

లేని పక్షంలో మా ప్రభుత్వం ఏర్పడగానే మేము ఆ పని చేస్తాం

నెల రోజుల్లోగా కోటి చొప్పున పరిహారం ఇస్తాం

శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటన

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్, సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడారు.

మృతుల కుటుంబాలకు రూ.1.72 కోట్లు వస్తాయని చెబుతున్నారు

అది వారి హక్కు. ఇంకా వివిధ రూపాల్లో మరో రూ.1.45 కోట్లు

అవన్నీ ఎలాగూ హక్కుగా వస్తాయి. మరి బోడి మీరిచ్చేది ఏమిటి?

రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా ఏ సహాయం చేస్తోంది?

చురకలంటించిన శ్రీ వైయస్‌ జగన్‌

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కాపాడేందుకు అన్ని విధాలా కృషి చేశాం

అందుకే ఆ 5 ఏళ్లలో ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయింది

రెండుసార్లు ప్రధానికి లేఖ రాశాం. ప్రత్యక్షంగా విజ్ఞప్తి చేశాం

అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాం

గుర్తు చేసిన శ్రీ వైయస్‌ జగన్‌

స్టీల్‌ ప్లాంట్‌పై చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా?

ఉంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి

తేల్చి చెప్పిన శ్రీ వైయస్‌ జగన్‌

చంద్రబాబు కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు శాపం

గత మా ప్రభుత్వ హయాంలో సంస్థలో 28 వేల ఉద్యోగులు

ఈ రెండేళ్లలో సంస్థలో 10 వేలకు పైగా ఉద్యోగులు తగ్గారు

6,500 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించారు

బలవంతంగా వీఆర్‌ఎస్‌ ఇచ్చి 1800 మందిని పంపించేశారు

మరో 2,500 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు

స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడడం కోసం ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు

శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి

ఉద్యోగులకు నాలుగున్నర నెలలుగా జీతాలు పెండింగ్‌

ఈ రెండేళ్లలో ఏ ఒక్క ఆర్థిక, ఇతర సదుపాయం లేదు

రూ.11,440 కోట్ల ప్యాకేజీపై గొప్పగా ప్రచారం చేశారు

కానీ, ఒక్క రూపాయి కూడా సంస్థ బాగు కోసం పెట్టలేదు

శ్రీ వైయస్‌ జగన్‌ ఆక్షేపణ

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఒకవేళ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆ పని చేయకపోతే, కొంచెం ఓపిక పట్టాలని, దేవుడి దయ వల్ల తమ ప్రభుత్వం ఏర్పడగానే, నెల రోజుల్లో కోటి రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఆయన వెల్లడించారు. సంస్థలో గతంలో జరిగిన ప్రమాదాల్లో బాధితులకు కనుక, తగిన సహాయం అంది ఉండకపోతే, వారిని కూడా ఆదుకుంటామని ఆయన చెప్పారు.
    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. తాడేపల్లి నుంచి నేరుగా విశాఖ చేరుకున్న శ్రీ వైయస్‌ జగన్‌ తొలుత సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం కిమ్స్‌ ఆస్పత్రికి చేరుకున్న ఆయన, అక్కడ కూడా స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాద బాధితులను, క్షతగాత్రులను పరామర్శించారు. వారి కుటుంబాలను ఓదార్చారు.
బాధితుల పరామర్శ తర్వాత సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రి వద్ద శ్రీ వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఒక్కసారి బేరీజు వేసి చూడండి:
    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో స్టీల్‌ మెల్టింగ్‌ వర్క్‌షాప్‌లో జరిగిన ప్రమాదంలో ఇప్పటికే 9 మంది చనిపోయారు. ఇంకా వేర్వేరు ఆస్పత్రుల్లో మరో 5గురు చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. దాదాపు 95 శాతం బర్న్స్‌.
    నేను ఇవాళ కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతున్నాను. మానవత్వం ఏ మాత్రం ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి, మంచి చేయండి. అలాగే అందరూ ఆలోచించాలి. స్టీల్‌ ప్లాంట్‌లో కార్మికులు ఎలా బ్రతుకుతున్నారు? వారి పరిస్థితి ఎలా ఉంది? అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2024 వరకు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కార్మికులు ఎలా ఉన్నారు? ఇప్పుడు వారి పరిస్థితి, టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది? అన్నది అందరూ బేరీజు వేసుకోవాలి.

సంస్థను కాపాడుకునేందుకు ఇవన్నీ చేశాం:
    అప్పట్లో ఇదే ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రస్తావన వస్తే, అప్పుడు మా ప్రభుత్వం గట్టిగా ఆపింది. ఆ మేరకు 2021 ఫిబ్రవరి 6న ప్రధానిగారికి ఒక లేఖ రాశాం. ఏ రకంగా ఈ ప్లాంట్‌ను ఎలా నిలబెట్టాలో అందులో చాలా వివరంగా ప్రస్తావించాం. ఆ తర్వాత నెల రోజుల తర్వాత, 2021 మార్చి 9న మరో లేఖ రాశాం. ఇంకా ఆ తర్వాత, 2021, మే నెలలో అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించవద్దని, దాన్ని ఎలా నడపవచ్చో కూడా చాలా స్పష్టంగా చెప్పాం. ఆ మేరకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి, అన్ని వివరాలతో కేంద్రానికి కూడా పంపాం. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ఆ విధంగా అన్ని విధాలుగా కృషి చేశాం. అలా సంస్థను, ఉద్యోగులను కాపాడగలిగాం.
    అంతే కాకుండా 2022, నవంబరు 12న ప్రధానిగారు విశాఖ వచ్చినప్పుడు జరిగిన సభలో, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని ఆ సభలోనే ప్రధాని గారిని కోరాం. మా పార్టీ అంత గట్టిగా నిలబడింది కాబట్టి, ఉద్యోగులకు తోడుగా నిలబడింది కాబట్టి, సంస్థ ప్రైవేటీకరణ జరగలేదు.

10 వేలకు పైగా ఉద్యోగులు తగ్గారు:
    ఆరోజు మా ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో రెగ్యులర్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులంతా కలిసి 28 వేల మంది పని చేయగా, ఈ రెండేళ్లలో 10,500 మందికి పైగా ఉద్యోగులు తగ్గారు. 6,500 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. వీఆర్‌ఎస్‌ ప్రకటించి బలవంతంగా 1800 మందిని తప్పించగా, మరో 2,500 మంది పదవీ విరమణ చేశారు. దీంతో ఈరోజు సంస్థలో కేవలం 16 వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు.

స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులపై కక్ష సాధింపు:
    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఇప్పుడు ఉన్న ఉద్యోగుల పరిస్థితి దారుణం. వారికి నాలుగున్నర నెలల జీతాలు పెండింగ్‌. ఎప్పుడూ చూడని విధంగా, దేశంలో ఎక్కడా జరగని విధంగా, తొలిసారిగా ఉద్యోగస్తుల జీతాలు.. ప్రొడక్షన్‌తో లింక్‌ పెట్టారు. అంటే ఉత్పత్తి ఆ స్థాయిలో ఉంటేనే జీతాలు. లేకపోతే లేదు అన్న నిబంధన వి«ధించారు. దేశంలో ఎక్కడా, ఏ సంస్థలో ఇలాంటి విధానం లేదు.
    ఇంకా ఉద్యోగుల క్వార్టర్లకు గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో విద్యుత్‌ వినియోగంలో యూనిట్‌కు కేవలం 50 పైసలు మాత్రమే వసూలు చేయగా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లు యూనిట్‌కు ఏకంగా రూ.8.50కి పెంచారు. ఆ విధంగా వారిపై ఒత్తిడి తెచ్చి, క్వార్టర్లు ఖాళీ చేయించే కుట్ర చేశారు.
    ఉద్యోగులకు ఇప్పటి వరకు ఈ రెండేళ్లలో నో బోనస్‌. నో మెడికల్‌ ఫెసిలిటీస్‌. నో హెచ్చార్‌ఏ. నో ఎల్‌టీసీ. నో ఎల్‌ఎల్‌టీసీ. నో లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌. నో ఇన్సెంటివ్స్‌. ఈ మాదిరిగా ఉద్యోగులు దారుణ పరిస్థితిలో పని చేస్తున్నారు.

ఆ ప్యాకేజీని వేటి కోసం వాడారంటే..:
    ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం నుంచి రూ.11,440 కోట్ల ప్యాకేజీ సాధించామని చంద్రబాబుగారు, ఆయన కుమారుడు, మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. నిజానికి ఆ ప్యాకేజీ ఇక్కడ నిర్వహణ కోసమో, భద్రత మెరుగపర్చడం కోసమో, సామర్థ్యం పెంచడం కోసమో కాకుండా, కేవలం ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ అమలు, జీఎస్టీ బకాయిల చెల్లింపు, ఇంకా బ్యాంక్‌ రుణాలు కొంత తీర్చడం కోసం వాడారు.

తప్పిదం లేకపోయినా కార్మికులు బలయ్యారు.
ఆ కుటుంబాలు బాధ పడుతున్నాయి:

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఇప్పుడు జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరం. ఈ ఘటనలో ఉద్యోగులు, కార్మికుల తప్పిదం ఏ మాత్రం లేదు.లిక్విడ్‌ మెటల్‌ పొంగి, బ్లాస్ట్‌ అయింది. అలా ఎందుకు జరిగిందంటే.. మిక్స్‌ సరిగ్గా చేయకపోవడం, రా మెటేరియల్‌ సరిగ్గా కలపకపోవడం, రా మెటేరియల్‌లో నాణ్యత లోపించడం కారణం.
అందుకే ఈ ప్రమాదంలో ఎక్కడా ఉద్యోగుల తప్పిదం లేదు.
    ఇక్కడ మానవత్వం చూపాల్సిన చోట.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరు అమానవీయం. ఒక్కసారి ఆలోచన చేయండి.
ఒక కేస్‌ స్టడీ:
    నా పక్కనే.. భాగ్యశ్రీ అనే బాధితురాలు ఉంది. ఆమె తండ్రి పేరు పెంటయ్య. 14 నెలల క్రితం ఇక్కడే, ఇదే సంస్థలోనే ఈ మాదిరిగానే ప్రమాదం జరిగి, పెంటయ్య చనిపోయాడు. ఆయన పర్మినెంట్‌ ఉద్యోగి. మాస్టర్‌ టెక్నీషియన్‌. 2025, ఏప్రిల్‌ 1న ప్రమాదంలో చనిపోయాడు. ఆయన కూతురు భాగ్యశ్రీ. ఆయనకు ఇంకా ఇద్దరు కొడుకులు. నవీన్, ప్రసాద్‌. వారి తండ్రి చనిపోయినప్పుడు పిల్లలు ఇద్దరికి నెలలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, చివరకు పరిహారం కూడా చెల్లించలేదు. ఇది దారుణం.

విచిత్రంగా నారా లోకేష్‌ మాటలు:
అవి వారి హక్కు. ‘బోడి’ మీరిచ్చేదేమిటి?:

    ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో మంత్రి నారా లోకేష్‌ చాలా విచిత్రంగా మాట్లాడాడు. ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.1.72 కోట్లు వస్తాయని చెబుతున్నావు. అది రెగ్యులర్‌గా వచ్చేది. ‘బోడి’ మీరిచ్చేది ఏమిటి? మరి ప్రభుత్వం నుంచి ఏం ఇస్తున్నట్లు? ఆ రూ.1.72 కోట్లు అది వారి హక్కు.
    ఇంకా ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్‌ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్‌ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్‌ ఇన్సూరెన్స్‌.. అన్నీ కలిపి రూ.1.45 కోట్లు వస్తాయి. మరోవైపు సంస్థ తన వంతుగా రూ.25 లక్షలు ఇస్తుంది. ఇంకా ప్రధాని సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున వస్తుంది.
    మరి ‘బోడి’ రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తోంది. మీకు మీరుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. వాళ్లకు హక్కుగా వచ్చేది వస్తోంది తప్ప, రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఇస్తున్నది ఏమీ లేదు.

నాడు తొలిసారిగా కోటి చొప్పున ఇచ్చాం.
మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా..:

    గతంలో ఇదే విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీక్‌ వల్ల 14 మంది చనిపోతే, మా ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించడమే కాకుండా, నేనే స్వయంగా ఇక్కడకు వచ్చి చనిపోయిన వారి కుటుంబాలకు కోటి చొప్పున ఇచ్చాం. గతంలో దేశంలో ఎక్కడా అలా జరగలేదు. ఆ కుటుంబాలకు తోడుగా నిలబడ్డాం. ఆ కుటుంబాల్లో పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చూశాం.
    కాగా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చాలా దారుణంగా ఉంది.
కార్మికులకు రావాల్సినవే వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేయాలి. నాడు మా ప్రభుత్వంలో ఇచ్చినట్లు, ఇప్పుడు కూడా ఇవ్వమని డిమాండ్‌ చేస్తున్నాం. నాడు మేము చేసింది, ఇప్పుడు మీరు చేయాలని కోరుతున్నాం.
    సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతున్నాం. చిత్తశుద్ధి చూపండి. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులకు తోడుగా నిలబడండి. సంస్థ ప్రైవేటీకరణ వద్దంటూ మా మాదిరిగానే అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపండి.

మా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే..:
    ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం కనుక ఇప్పుడు, ఆ సహాయం చేయకపోతే, బాధ పడకండి. కొంచెం ఓపిక పట్టండి. మా ప్రభుత్వం ఏర్పడగానే, నెలలోపు ఆ సహాయం చేస్తాం. అలా కోటి రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటించారు. అందుకే ప్రభుత్వం ఇకనైనా మానవత్వం చూపి, కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు.
 

Back to Top