కొత్త పింఛన్లు ఇంకెప్పుడు ఇస్తారు? 

అవ్వాతాతలు, వికలాంగుల పొట్ట కొడుతున్న చంద్రబాబు 

ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ?

మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిల‌దీత‌

విశాఖపట్నం: ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. రెండేళ్లు గడిచినా అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు కొత్త పింఛన్లు ఎందుకు మంజూరు చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్‌ సూటిగా ప్రశ్నించారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 31వ వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపూ ఆనంద్ అధ్యక్షతన, దక్షిణ నియోజకవర్గ పరిశీలకులు వీసాల రామకృష్ణ సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వినూత్న నిరసన చేపట్టారు. శవపేటికల్లో వృద్ధుల మృతదేహాల నమూనాలు ఉంచి, “చనిపోయిన వృద్ధుల పింఛన్లు అయినా మాకు ఇప్పించండి” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.

ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 66 లక్షలకు పైగా పింఛన్లు అందించారని గుర్తుచేశారు. అయితే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్ర‌బాబు, లోకేష్‌ రెండేళ్లలో ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకుండా, వివిధ సాకులతో 6 లక్షలకు పైగా పింఛన్లు తొలగించి అవ్వాతాతల పొట్ట కొట్టారని మండిపడ్డారు.

“సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు. 18 ఏళ్లు నిండిన వారికి రూ.1,500, 50 ఏళ్లకే పింఛన్, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కనపెట్టారు” అని విమర్శించారు. రెండేళ్లలో సుమారు 7 లక్షల మంది వృద్ధులు మరణించారని, తొలగించిన మరో 6 లక్షల పింఛన్లు కలిపి కనీసం 13 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. “పేదల పొట్ట కొట్టి చంద్రబాబు, లోకేష్‌లు తెలంగాణలో పండగలు చేసుకోవడం సిగ్గుచేటు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకు రూ.15 వేల జీతంతో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పథకాలు నిలిపివేయడం దారుణమన్నారు.

“విలువలు, సిద్ధాంతాల గురించి మాట్లాడే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇవన్నీ కనిపించడంలేదా? ప్రశ్నిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు?” అని వాసుపల్లి ధ్వజమెత్తారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన 66 లక్షల పింఛన్లతో పోలిస్తే ప్రస్తుతం కేవలం 53 లక్షల మందికే పింఛన్లు అందుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి పేదలకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, జిల్లా, రాష్ట్ర స్థాయి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top