వైయ‌స్ జగన్‌పై కక్ష సాధింపే లక్ష్యంగా కూటమి ‘డైవర్షన్ పాలిటిక్స్’ 

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి  రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫైర్‌

ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వం, టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్‌పై పచ్చమూకలు కక్ష సాధింపుతో మార్ఫింగ్ ఫోటోలు సృష్టించి అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై విఫలమైన కూటమి ప్రభుత్వం వాటి నుంచి దృష్టి మళ్లించేందుకే ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తోందని ఆయన విమర్శించారు. ఒకప్పుడు డాక్యుమెంటరీలో లేని జగన్ పేరు, ఫోటో ఇప్పుడు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలని నిలదీశారు.

‘బ్లడ్ శాండర్స్’ పుస్తకంలో జగన్ ప్రస్తావనే లేదని రచయిత ఉడుముల సుధాకర్ రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారని రాచమల్లు గుర్తుచేశారు. అయినప్పటికీ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఈ విషయంలో పచ్చ మీడియా, కూటమి నేతలపై న్యాయపరంగా పోరాడతామని హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లర్లను పక్కన పెట్టుకుని జగన్‌పై విమర్శలు చేయడం దురుద్దేశపూర్వకమని మండిపడ్డారు. అంతర్జాతీయ స్మగ్లర్ మహేష్ నాయుడును టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించలేదా అని ప్రశ్నించారు.

కొల్లం గంగిరెడ్డికి, వైఎస్ జగన్‌కు ఎటువంటి సంబంధం లేదని, రెండు దశాబ్దాలుగా పరిచయం కూడా లేదని స్పష్టం చేశారు. గంగిరెడ్డి బీజేపీలో చేరింది పురందేశ్వరి సమక్షంలోనేనని గుర్తుచేస్తూ, ఇప్పుడు జగన్‌కు ఎలా ముడిపెడతారని ప్రశ్నించారు. చంద్రబాబు చుట్టూ స్మగ్లర్లు, నకిలీ స్టాంపుల నేరస్తులు ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి నేతల ప్రెస్ మీట్లకు టీడీపీ కార్యాలయం నుంచే స్క్రిప్ట్ వస్తోందని, జగన్‌పై విషం చిమ్మడమే వారి పని అయిందని అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి కీలక పథకాలు అటకెక్కాయని, ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.వివేకా కేసులోని గంగిరెడ్డి, స్మగ్లర్ గంగిరెడ్డి ఒకరేనని చెప్పడం కూటమి నేతల అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. దస్తగిరి పేరుతో కూడా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మార్ఫింగ్ ఫోటోలతో బురద జల్లే నీచ రాజకీయాలకు టీడీపీ తెరతీసిందని, ప్రజలు ఈ కుట్రలను గమనిస్తున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
 

Back to Top