దేవరపల్లి: "వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర లేక, అమ్ముకోలేక నష్టపోతున్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సహా వైయస్ఆర్‌సీపీనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి టొబాకో బోర్డు కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసనలో వారు మాట్లాడుతూ.. గతంలో కేజీ రూ.400 పలికిన పొగాకు, నేడు రూ.260కి పడిపోయిందని, సాగు వ్యయం కూడా దక్కని దుస్థితిలో రైతులు ఆత్మహత్యాయత్నం చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని వర్జీనియా పొగాకును కొనుగోలు చేయడంతో పాటు మద్ధతు ధర ప్రకటింలాని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఎవరేమన్నారంటే... చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి. రైతులగురించి కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. రియల్ టైమ్ గవర్నెన్స్ అని చెప్పుకునే చంద్రబాబు రైతులను రియల్ కష్టాలకు గురిచేస్తున్నాడు. ఒక కేజీ పొగాకు పండించడానికి రైతుకు రూ.300 ఖర్చవుతుంటే రైతుకు ఆదాయం మాత్రం కేజీకి రూ.260 మాత్రమే వస్తుంది. రైతులు నష్టానికి పొగాకు అమ్ముకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వ పనితీరుకు నిరసనగా ఇవాళ వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళన చేపడుతోంది. ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయంపై ప్రతి గ్రామంలోనూ చర్చ జరగాలి. వేలాది మంది పొగాకు రైతులకు కనీస మద్ధతు ధర ఇవ్వడంలో విఫలమైన కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన బాధ్యత మనపై ఉంది. కేజీ పొగాకు రూ.400 గతంలో ఉంటే నేడు రూ.260 కు పడిపోయిన దుస్థితి. అంటే రైతు కేజీ మీద సుమారు రెండు వందల వరకు నష్టపోతున్నాడు. ఇటీవల పెట్రోల్, డీజిల్ కొరత ఉంటే... ప్రజల ఇబ్బందులను పక్కన పెట్టి బల్క్ గా అమరావతికి సరఫరా చేయమని ఆదేశాలు ఇచ్చారు. అంటే ప్రజలు ఏమైనా ఫర్వాలేదు.. తన స్వార్ధమే ముఖ్యమన్నట్టు వ్యవహరించారు. అదే విధంగా ఇవాళ పొగాకు రైతుల విషయంలోనూ కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతుంటే.. .వ్యవసాయశాఖ మంత్రి వ్యవసాయమే లేని సింగపూర్ వంటి దేశాల్లో పర్యటనలతో కాలం వెళ్లదీయడం దారుణం. ఇదే ప్రశ్న అడిగితే సమాధానం లేదు. పొగాకు రైతుల కష్టాలను కనీసం ప్రస్తావించకుండా ప్రభుత్వం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రమే రైతులకు న్యాయం జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం నిద్ర నటిస్తూ... రైతులను గాలికొదిలేస్తే చూస్తూ ఉరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోకపోతే వారి తరపున మరింత ఉధృతంగా పోరాటం చేస్తాం. సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, అనపర్తి. దేవరపల్లిలో పొగాకు రైతులు మద్ధతు ధర కోసం చేపడుతున్న నిరసన దీక్షకు వైయస్ఆర్‌సీపీ తరపున పూర్తి మద్ధతు ప్రకటిస్తున్నాం. వైయస్సార్ హయాంలో రైతు రాజులా జీవించాడు. రైతులకు అనేక ప్రోత్సాహకాలు, సంక్షేపథకాలు అందించడం ద్వారా వైయస్.జగన్ కూడా తన హయాంలో రైతులను రారాజులను చేశాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చంద్రబాబు పాలనలో ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అదే విధంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వలే ఆత్మహత్యలు చేసుకోవడం మినహా మరో గత్యంతరం లేని స్ధితిలోకి రైతులు వస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు పూర్తి సహకారం అందించడంతోపాటు పండిన పంటలకు మద్ధతు ధర కల్పించాలని వైయస్ఆర్‌సీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం. జీ శ్రీనివాస నాయుడు, నిడదవోలు ఇన్ ఛార్జి. పొగాకురైతులు కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో, ప్రచార సాధనాల్లోనూ రైతులకు అండగా ఉంటామని గొప్ప ప్రకటనలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్ధాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇవాళ రాష్ట్రంలో పొగాకు రైతులు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గతంతో పోల్చుకుంటే వర్జీనియా పొగాకు రేటు గణనీయంగా తగ్గిపోవడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతేడాది కేజీ పొగాకు రూ.400 వరకు ధర పలికితే ఈ ఏడాది కనీసం రూ.260 కూడా రాకపోవడం పై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చివరకు కనీస గిట్టుబాటు ధర అయిన రూ.330 కూడా రావడం లేదు. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణం. గతంలో వైయస్.జగన్ హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు మద్ధతు ధర రానప్పుడూ ఈ డిఫరెంట్ అమౌంట్ ను చెల్లించేవారు. అదే తరహాలో కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా టొబాకో బోర్డు కూడా రైతుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించిన మేరకు పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నిడదవోలు నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తలారి వెంకటరావు, మాజీ ఎమ్మెల్యే. గోపాలపురం నియోజకవర్గంలో మెట్టప్రాంత రైతులకు ప్రధాన పంట పొగాకు. ఈ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఇబ్బంది వచ్చినా... దివంగత సీఎం వైయస్.రాజశేఖర్ రెడ్డి రూ.500 కోట్లు వెచ్చించి పొగాకు కొనుగోలు చేసే బాధ్యత తీసుకున్నారు. అదే విధంగా తండ్రికి తగ్గ తనయుడుగా వైయస్.జగన్ 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే దేవరపల్లి వచ్చి పొగాకు రైతులను పరామర్శించి, వారి పంట గురించి తెలుసుకున్నారు. ఆయన వచ్చిన తర్వాతే కేజీకి రూ.20 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరలా ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయింది. ధాన్యం కొనుగోలు చేయడం లేదు. మొక్కజొన్న పంట రూ.2400 కు కొనుగోలు చేయాల్సి ఉండగా.. కేవలం రూ.1600 కే కొనుగోలు చేస్తున్న పరిస్థితి. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో మార్క్ ఫెడ్ ద్వారా ఆ రోజు రూ.500 కోట్లు ప్రభుత్వం నష్టపోయినా కొనుగోలు చేశారు. అదే విధంగా పొగాకు కూడా కనీసం కేజీ రూ.300 ఉంటే రేటు గిట్టుబాటు ఉంటుంది. కానీ రూ.260 ఉండడంతో రైతులు నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉంది. కేంద్రంతో మాట్లాడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. గూడూరు శ్రీనివాసరావు, వైయస్ఆర్‌సీపీ నేత. దేవరపల్లి ప్రాంతంలో పొగాకు దాదాపు 12,500 మంది రైతులు సుమారు 30 వేల హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్నారు. కనీస మద్ధతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వం పొగాకు కొనుగోలు వేగవంతం చేయాలి. వర్జీనియా పొగాకుకు మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. జక్కంపూడి రాజీ, మాజీ ఎమ్మెల్యే. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా ఆ కాలమంతా రైతుల నోట్లో మట్టికొట్టినట్లే ఉంటుంది. ఇది వాస్తవం. గడిచిన రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ అన్ని రకాల రైతుల కంట్లో కన్నీరు తప్ప మరేం మిగల్లేదు. అదే వైయస్.జగన్ ఆధ్రర్వంలోని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులను చేయిపట్టుకుని ముందుకు నడిపించింది. పరిపాలనలో సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తెచ్చి రైతులకు అన్ని రకాల మేల్లు చేసింది. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అండగా నిల్చిన ఘతన వైయస్.జగన్ కే దక్కుతుంది. కానీ ఇవాళ రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ ఇవాళ పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. రైతుల నుంచి పండిన పొగాకు కూడా కొనుగోలు చేయలేని దయనీయ స్ధితిలో ఉంది. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసి వారి ఖాతాలో వేసుకోవడం తప్ప... ఆ ప్రజలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఇందుకు పొగాకు రైతులే ఉదాహరణ. ఈ నేపధ్యంలో పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలని, వర్జీనీయా పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయడంతో పాటు మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ పోరాటం ఆరంభం మాత్రమే... రానున్న రోజుల్లో పొగాకు రైతులకు ప్రభుత్వం తోడుగా నిలబడకపోతే రైతులకు తోడుగా పోరాటాన్నివైయస్ఆర్‌సీపీ ఉధృతం చేస్తాం. రైతుల పట్ల మనసున్న ప్రభుత్వంగా ఆ రోజు వైయస్.జగన్ వ్యవహరించిన విధంగా కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాం. తానేటి వనిత, మాజీ హోంమంత్రి. గోపాలపురం నియోజకవర్గం మెట్ట ప్రాంతంలో రైతులు పొగాకు ఎక్కువగా సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది పొగాకు రైతులకు కనీస మద్ధతు ధర లేకపోవడం, ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పొగాకు రైతులకు మద్ధతుగా ఇవాళ వైయస్ఆర్‌సీపీ వారి తరపున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకూ మద్ధతు ధర లేని పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా పొగాకు రైతులు కూడా తమ పంటకు గిట్టుబాటు ధర లేక పంటను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర లేదని పొగాకును నిల్వ చేద్దామంటే నాణ్యత పోతుందని రైతులు భయపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే రైతులకు అండగా నిలవాలని బాధ్యత గల ప్రతిపక్షంగా ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాం. వాస్తవానికి రైతులు అండగా నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వైయస్.జగన్ ఆధ్వర్యంలో ఆ రోజు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతిఅడుగులోనూ విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతలకు అండగా నిలబడ్డాం. కానీ చంద్రబాబు ప్రభుత్వం రైతులకు కనీసం బస్తా యూరియా కూడా అందించలేని దుస్థితిలో ఉంది. రైతులకు ఎరువులు ఇవ్వలేక .. వాటి వాడకం వల్ల వ్యాధులు వస్తాయంటూ సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడ్డం దారుణం. ఈ నేపధ్యంలో గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, వర్జీనియా పొగాకుకు కనీస మద్దతు ధర కల్పించాలని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేలా కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని వైయస్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులకు కనీస మద్దతు ధర అందే వరకు, వారి పక్షాన ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.