టీడీపీ నాయ‌కులు లాక్కున్న భూముల‌ను గిరిజ‌నుల‌కు తిరిగి ఇవ్వాలి 

వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి డిమాండ్ 

నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం బ్ర‌హ్మ‌దేవునిపాలెం గ్రామంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి 

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం గిరిజ‌నుల‌కు ప‌ట్టాలిచ్చిన భూముల స్వాధీనం దారుణం

నివాస స్థ‌లాల నుంచి గిరిజనుల‌ను త‌రిమేసి వ్య‌వ‌సాయం చేయ‌డం సిగ్గుచేటు

ఎమ్మెల్యే సోమిరెడ్డికి గిరిజ‌నుల అభివృద్ధి, సంక్షేమంపై చిత్త‌శుద్ధికి ఇదే నిద‌ర్శ‌నం

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మండిపాటు 

నెల్లూరు(స‌ర్వేప‌ల్లి):  ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి గిరిజ‌నుల మీద ప్రేమ ఉంటే, గిరిజ‌నుల సంక్షేమం, అభివృద్ధిపై ఆయ‌న‌కు నిజంగా చిత్త‌శుద్ధి ఉంటే టీడీపీ నాయ‌కులు లాక్కున్న భూమిని తిరిగి వారికి అప్ప‌గించాలని వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు. బ్ర‌హ్మ‌దేవుని గ్రామ పంచాయతీలో వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో నిర్మించిన ఇళ్ల‌ను ప‌రిశీలించి ల‌బ్ధిదారుల‌తో ఆయ‌న మాట్లాడారు. అదే గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలో ఎస్టీల‌కు ఇళ్ల స్థ‌లాలు కేటాయించి ప‌ట్టాలు మంజూరు చేస్తే, టీడీపీ నాయ‌కుల‌ను రాళ్ల‌ను తొల‌గించి ఆ భూముల‌ను స్వాధీనం చేసుకుని వ్య‌వ‌సాయం చేస్తుండటంపై కాకాణి మండిప‌డ్డారు. గిరిజ‌నుల ప‌ట్ల ఎమ్మెల్యే సోమిరెడ్డికి ప్రేమ ఉన్న‌ట్టు న‌టిస్తున్నాడ‌ని, టీడీపీ నాయ‌కులు వారికి కేటాయించిన స్థ‌లాల నుంచి గిరిజ‌నుల‌ను త‌రిమేసి వారికి నిలువ నీడ లేకుండా చేస్తే ఏం చేస్తున్నాడ‌ని ప్ర‌శ్నించారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన ఈ రెండేళ్ల‌లో పేద‌ల‌కు సెంటు ఇంటి స్థ‌లం ఇవ్వ‌క‌పోగా వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో ఇచ్చిన స్థ‌లాల నుంచి వారిని బెదిరించి త‌రిమేయ‌డం దుర్మార్గ‌మ‌ని కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ధ్వ‌జమెత్తారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...  

మేం ఇచ్చిన స్థ‌లాల నుంచి గిరిజనుల‌ను త‌రిమేశారు 
వైయ‌స్ జ‌గ‌న్ గారిచ్చిన ఇళ్ల ప‌ట్టాల‌తో ఇళ్లు నిర్మించుకున్న ల‌బ్ధిదారులు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఎవ‌ర్ని క‌దిలించినా అద్దె కష్టాల నుంచి విముక్తి ల‌భించింద‌ని చెబుతున్నారు. గ‌త వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో కోట్ల రూపాయ‌ల విలువైన భూముల‌ను కొనుగోలు చేసి పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు కేటాయిస్తే ఎల్లో మీడియా మాత్రం నివాస యోగ్యం కాని స్థ‌లాలంటూ బుర‌ద‌జ‌ల్లుతూ వ‌చ్చింది. త‌న జీవిత కాలంలో పేద‌ల‌కు సెంట్ స్థ‌లం కూడా ఇవ్వ‌ని చంద్ర‌బాబుని మాత్రం ఎల్లో మీడియా ఏనాడూ ప్ర‌శ్నించ‌దు. వైయ‌స్ జ‌గ‌న్ గారు పేద‌ల‌కు కేటాయించిన ఇళ్ల స్థ‌లాల‌ను టీడీపీ నాయకులు దౌర్జ‌న్యంగా లాగేసుకున్నా వారికి క‌నిపించ‌దు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక టీడీపీ నాయకులు లేఅవుట్‌ల నుంచి ఎస్టీల‌ను త‌రిమేసి ఇళ్ల ప‌ట్టాల కోసం వేసిన రాళ్ల‌ను పీకేసి వ్య‌వసాయం చేస్తున్నారు. గిరిజ‌నుల‌కు నిలువ నీడ లేకుండా చేశారు. 

ఒక్కో ఇంటి స్థ‌లం విలువ రూ. 15 ల‌క్ష‌లు 
గ‌త వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో 2022లో పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇవ్వాల‌న్న ల‌క్ష్యంతో బ్ర‌హ్మ‌దేవుని గ్రామ పంచాయతీలో 4.57 ఎకరాల ప్ర‌భుత్వ భూమిలో ఇళ్ల ప‌ట్టాలు మంజూరు చేయ‌డం జ‌రిగింది. లేఅవుట్ వేసి 137 ప్లాట్లుగా విభ‌జించి ఒక్కో ల‌బ్ధిదారునికి 9 అంక‌ణాల స్థ‌లం కేటాయించ‌డం జ‌రిగింది. 74 ఇళ్లు పూర్తి చేస్తే 54 ఇళ్ల‌లో ల‌బ్ధిదారులు నివాసం ఉండ‌గా మ‌రో 20 ఇళ్లు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. ఈ లేఅవుట్లో ఎస్టీల‌కు 36  ప్లాట్లు కేటాయించ‌డం జ‌రిగింది. ఇళ్ల నిర్మాణం కోసం నాటి వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం ఇచ్చే నిధుల‌కు అద‌నంగా మ‌రో రూ. 15వేలు సీఎస్ఆర్ (కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబులిటీ) కింద అంద‌జేయ‌డం జ‌రిగింది. కానీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక గడిచిన రెండేళ్లుగా ఆ ఇంటి నిర్మాణాల‌ను అర్ధాంత‌రంగా ఆపేయ‌డంతో ల‌బ్ధిదారులంతా చెరువు గ‌ట్టున చెట్ల కింద నివాసం ఏర్పాటు చేసుకుని బ‌తుకీడుస్తున్న దుస్థితి. నెల్లూరు -కృష్ణ‌ప‌ట్నం పోర్టు ప్ర‌ధాన ర‌హ‌దారికి ఆనుకుని ఉన్న స్థ‌లంలో ఈ లేఅవుట్ అభివృద్ధి చేసి పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు మంజూరు చేయ‌డం జ‌రిగింది. ఇక్క‌డే ఉన్న ప్రైవేట్ లేఅవుట్లో అంక‌ణం స్థ‌లం రూ. 1.20 ల‌క్ష‌లు ప‌లుకుతోంది. అంటే, వైయ‌స్ఆర్‌సీపీప్ర‌భుత్వం దాదాపు రూ. 15 ల‌క్ష‌ల విలువైన స్థ‌లాన్ని పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల కోసం మంజూరు చేసిన వైయ‌స్ జ‌గన్ గారికే ద‌క్కుతుంది. దీంతోపాటు ఈద‌ర‌వారిపాలెంలో మ‌రికొన్ని ప్లాట్లు అవ‌స‌ర‌మ‌ని భావించి ప్ర‌భుత్వ భూమి అందుబాటులో లేక‌పోవ‌డంతో 1.97 ఎక‌రాల భూమిని ఎక‌రం రూ. 22 ల‌క్ష‌ల చొప్పున రూ. 43.34 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేయ‌డం జరిగింది. అందులో 70 ప్లాట్లు వేయ‌గా 44 ఇళ్ల నిర్మాణం వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలోనే పూర్తి చేయ‌గా మిగిలన‌వి వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయి. దీంతోపాటు గ్రామ స‌చివాలయం పక్క‌నే ఉన్న 2.80 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిలో లేఅవుట్ వేసి ఇళ్ల‌ప‌ట్టాలు మంజూరు చేయ‌డం జ‌రిగింది.

Back to Top