తాడేపల్లి:రాష్ట్రంలో చంద్రబాబు రెండేళ్ల పాలనలో తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని, దాన్ని దాచేస్తూ కలెక్టర్ల సమావేశాల పేరుతో గప్పాలు కొట్టుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశం మరోసారి చంద్రబాబు గొప్పలకు, ఉపన్యాసాలకే పరిమితమైందన్నారు. చంద్రబాబు పాలనలో ఏడుసార్లు నిర్వహించిన కలెక్టర్ల సమావేశాల్లో ఒక్క మంచి సంస్కరణ అయినా తెచ్చారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. గత వైఎస్సార్సీపీ హయాంలో కలెక్టర్ల సదస్సులు పెట్టి విద్య, వైద్య రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని అంబటి రాంబాబు గుర్తుచేశారు. ప్రెస్ మీట్ లో అంబటి రాంబాబు ఇంకేమన్నారంటే.. - చంద్రబాబు గొప్పలకే కలెక్టర్ల సదస్సులు చంద్రబాబు రెండేళ్ల పాలన తర్వాత కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశాం కానీ.. రెండేళ్లలో ఇంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం దేశంలోనే లేదు. చంద్రబాబు రెండేళ్లలో ఏడు కలెక్టర్ల సదస్సులు పెట్టారు. వీటిని సుదీర్ఘంగా నిర్వహించడం, ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం, వారికి ఏదో చేయాలన్న ఉద్బోధలు చేయడం జరిగాయి కానీ వాటిలో ఒక్కటీ అమలు చేయలేదు. మొదటి కలెక్టర్ల సదస్సులోనే సమర్ధులకు ప్రోత్సాహం అన్నారు. వాళ్లు సమర్ధులు కాబట్టేగా ఐఏఎస్ లు అయ్యారు. అంటే తాము చెప్పినట్లు విన్నవాళ్లు సమర్ధులు అన్నమాట. రెండో కలెక్టర్ల సదస్సులో పరిపాలనలో వేగం పెంచాలన్నారు. ప్రభుత్వం ఎలా ఉంటే అలా వాళ్లు నడుచుకుంటారు తప్ప, ప్రత్యేకంగా ఎలా పరిగెడతారు? మూడో కలెక్టర్ల సదస్సులో యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు రూ.800 ఇస్తామన్నారు. యూరియా సరఫరా చేయలేని దుస్దితి ఏర్పడింది కాబట్టే ఇలా చెప్పాల్సి వచ్చింది. నాలుగో కలెక్టర్ల సదస్సులో మీరు అడ్డంకి కాకూడదు, అడ్డంకులు తొలగించాలన్నారు. ఐదో కలెక్టర్ల సదస్సులో సొంతంగా ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆరో కలెక్టర్ల సదస్సులో ఐ.ఎస్.బి తరహాలో ఐఎస్ఏ ఏర్పాటు చేయాలన్నారు. ఏడో కలెక్టర్ల సదస్సులో కడప ఉక్కుకు శ్రీకారం అన్నారు. - ఏడు కలెక్టర్ల సదస్సులో ఒక్క సంస్కరణ అయినా తెచ్చారా ? ఇలా ఏడు కలెక్టర్ల సమావేశాలు నిర్వహించినా ఒక్కటైనా మంచి పాలనా సంస్కరణ తెచ్చిన ఉదాహరణ ఉంటే చెప్పండి. మోడీ కంటే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు, కొత్త సిద్దాంతాలు కనిపెట్టిన వ్యక్తి అని గప్పాలు కొట్టుకోవడం తప్ప ఒక్కటైనా సంస్కరణ తెచ్చారా ? గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన చరిత్ర ఉంది. ఇవాళ సింగపూర్ కు పాలన గురించి నేర్చుకోవడానికి ఓ బృందాన్ని పంపారు. అక్కడ వాళ్లు నేర్చుకుని చంద్రబాబుకు చెప్తే ఈయన అమలు చేస్తాడట. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సహా 142 హామీలిచ్చారు. వాటిలో ఎన్ని అమలు చేశారు? అరకొర చేసి అన్నీ పూర్తయ్యాయని చెప్పుకుంటున్నారు. ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి 18 వేలు ఇస్తామన్నారు, రూపాయి అయినా ఇచ్చారా ? నెలకు 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు 50 ఏళ్లు పైబడితే వారికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నారు. సాధారణ పెన్షన్ ఇచ్చారు కానీ ఇది ఎగ్గొట్టారు. రాష్ట్రంలో మోసాలతో చంద్రబాబు దుష్టపాలన చేస్తున్నారు. ఇప్పుడు సింగపూర్ కు వెళ్లి ఏం నేర్చుకుని అమలు చేస్తారో చెప్పాలి. - జగన్ హయాంలో విద్య, వైద్యరంగంలో సంస్కరణలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మా మ్యానిఫెస్టోను ప్రతీ ఆఫీసులో తగిలించాం. చిత్తశుద్ధిగా అందులో అంశాల్ని అమలు చేసి చూపించారు. మీరు మీ మ్యానిఫెస్టో చూపించలేని పరిస్ధితుల్లో ఉన్నారు. చంద్రబాబు జీవితమంతా ఇదే తీరు. మ్యానిఫెస్టో ప్రకటించడం, ఆ తర్వాత దాచేయడం ఆయనకు అలవాటుగా మారింది. ఎన్నికలకు ముందు గారడీలు చేయడం, ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చాక తిరిగి వారికి వెన్నుపోటు పొడవడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. పేదలు ఇళ్ల స్దలాల కోసం లక్షల్లో దరఖాస్తులు పెట్టుకుంటే వారికి ఇప్పటివరకూ సెంటు కూడా ఇచ్చింది లేదు. సూపర్ సిక్స్ పేరుతో మోసం చేసి డైవర్షన్ పాలిటిక్స్ కు దిగారు. సచివాలయాల్ని నిర్వీర్వం చేసి ఒక దరఖాస్తు పెట్టుకుంటే సమాధానం చెప్పేవారు లేకుండా చేశారు. ఏ పంటకీ గిట్టుబాటు ధర లేక మొక్కజొన్న, ధాన్యం, పొగాకు.. ఇలా ప్రతీ పంటా రోడ్డపై పారేసుకుకోవాల్సిన దుస్దితి. హాస్టళ్లలో సరైన తిండి లేక మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు చాక జనం చనిపోతున్నారు. గతంలో వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని పూర్తిగా మంటగలిపారు. ఆస్పత్రులకు బకాయిలు ఇవ్వట్లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వేల కోట్లు పేరుకుపోయాయి. మంత్రుల్ని సింగపూర్ కు విహారయాత్రకు పంపారు. వాళ్లు ఏం నేర్చుకుని వచ్చారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. చంద్రబాబు పాలనలో సామాన్యుడి పరిస్ధితి రోజురోజుకీ దారుణంగా మారుతోంది. ఇవన్నీ చంద్రబాబు పట్టించుకోకుండా కలెక్టర్ల సదస్సుల్లో డప్పు కొట్టుకుంటున్నారు. సింగపూర్ వెళ్లినా, కలెక్టర్ల సదస్సులు పెట్టినా వాళ్ల పత్రికల్లో రాసుకుని గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు పనికొచ్చే సంస్కరణలు తీసుకొద్దామనే ఆలోచనే లేదు. - మీడియా ప్రశ్నలకు సమాధానాలిస్తూ అంబటి రాంబాబు.. పోలవరం పుష్కరాల్లోపు పూర్తి చేస్తామన్నారు, కానీ కేంద్రం ఇచ్చిన నిధుల్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. మొన్న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇచ్చిన డబ్బులు ఎందుకు ఖర్చుపెట్టలేదని అడిగారు. వర్షాకాలం వచ్చేస్తోంది. పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియదు. పోలవరం ప్రాజెక్టుకు పుష్కరాల్లోపు పూర్తి చేసి నీళ్లు ఇస్తారని మాకు నమ్మకం కలగడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా పనులు పూర్తి చేశాక బిల్లులు ఇవ్వడం కాదు ముందే అడ్వాన్సులు ఇమ్మని ఒత్తిడి తెచ్చి సాధించుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్ధితి పూర్తిగా రివర్స్ అయింది. రాయలసీమ ప్రజల్ని మోసం చేసి రేవంత్ రెడ్డి గారికి రాయలసీమ లిఫ్ట్ ను గిఫ్ట్ గా ఇచ్చిన చరిత్ర చంద్రబాబుది. రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టుల్ని కొనసాగించడం తప్ప చంద్రబాబుకు ఓ విజన్ అంటూ లేదు. వ్యవసాయం, ప్రాజెక్టుల మీద చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అంబటి రాంబాబు చురకలు అంటించారు.