తిరుపతి: జిల్లాలో ఏర్పాటు కానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ యూనిట్‌ను అడ్డుకునేందుకు భూమన అభినయ్ రెడ్డి కోర్టులో కేసు వేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ లాభాల కోసం కావాలనే కొన్ని సోషల్ మీడియా ఖాతాలు ఈ తప్పుడు ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయని మండిపడ్డారు. ఉద్యోగాలు, పరిశ్రమలు, తిరుపతి అభివృద్ధికి వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ మద్దతుగానే నిలిచిందని పేర్కొన్నారు. ఫేక్ పోస్టులు, మార్ఫింగ్ చిత్రాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్న వారి అసలు ఉద్దేశాలు బయటపడుతున్నాయని విమర్శించారు. ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో వైయస్ఆర్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.