మదనపల్లి : మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు, దళిత వికలాంగుడు రవితేజ ఇంటిపై జేసీబీతో దాడి చేసి నిర్మాణంలో ఉన్న ఇంటిని పూడ్చివేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని వైయస్ఆర్‌సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బాధితుడు రవితేజను మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, నిమ్మనపల్లి మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, మండల బూత్ కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజకీయ కక్షసాధింపులతో బలహీన వర్గాలపై ఇలాంటి దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. జేసీబీతో దాడి చేసి నూతనంగా నిర్మాణంలో ఉన్న ఇంటిని ధ్వంసం చేయడం అత్యంత ఖండనీయమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలపై అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రవితేజకు మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి, సుధాకర్, కౌశిక్ శివ, మౌలా, రఫీ తదితరులు పాల్గొన్నారు.