వైయస్ఆర్ కడప జిల్లా: వైయస్ జగన్ చొరవ, శ్రమతో ఏర్పాటై 2023 ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగిన జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ కి చంద్రబాబు మరోసారి శంకుస్థాపన చేశారని, గత ప్రభుత్వ కృషిని తన ఖాతాలో వేసుకోవాలని చూసిన చంద్రబాబు క్రెడిట్ చోరీ కుట్రలు నిన్నటితో బట్టబయలయ్యాయని కడప ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు. కడపలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన పనులు, అందించిన అపారమైన సహకారం, మంజూరు చేసిన అనుమతుల వల్లే ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నామని సజ్జన్ జిందాలే స్వయంగా ప్రకటించారని చెప్పారు. జమ్మలమడుగులో చంద్రబాబు చేసిన రెండోసారి దొంగ శంకుస్థాపన డ్రామాలను, అబద్ధాల గాలిని జేఎస్‌డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్ చేసిన ఒకే ఒక్క రీట్వీట్ పూర్తిగా తుడిచిపెట్టేసిందని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు వైయస్ జగన్ తీసుకున్న చొరవ, వైయస్సార్సీపీ ప్రభుత్వం అందించిన రాయితీలు, చేసిన కేటాయింపులు, జరిగిన పనులను ఈ సందర్భంగా ఆయన వివరించారు. వైయస్ జగన్ గారిని దూషించడానికే సభ నిర్వహించినట్టుందని సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. వైయస్సార్ పెట్టిన రాజకీయ భిక్షతో బతుకుతూ, ఇప్పుడు గతం మరిచి విర్రవీగుతున్న ఆదినారాయణరెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెబుతామని ఎంపీ అవినాశ్ రెడ్డి హెచ్చరించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... - అసలు శ్రమ, చొరవ ముమ్మాటికీ వైయస్ జగన్ గారిదే వైయస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ పనులు పునఃప్రారంభం కావడం శుభపరిణామమే అయినప్పటికీ, దాని వెనుక ఉన్న అసలు శ్రమ, చొరవ ముమ్మాటికీ వైయస్ జగన్ గారిదే. గత ప్రభుత్వం చేసిన కృషిని, తెచ్చిన అనుమతులను తన ఖాతాలో వేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన క్రెడిట్ చోరీ ప్రయత్నం నిన్నటితో పూర్తిగా అభాసుపాలైంది. జమ్మలమడుగులో చంద్రబాబు నాయుడు రెండోసారి దొంగ శంకుస్థాపన చేస్తూ.. ఉక్కు పరిశ్రమను తానే తెచ్చినట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కానీ, సాయంత్రం జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ అధినేత సజ్జన్ జిందాల్ చేసిన ట్వీట్‌తో చంద్రబాబు అబద్ధాల గాలి పూర్తిగా పోయింది. "గత జగన్ ప్రభుత్వం చేసిన పనులు, అందించిన సహకారం, మంజూరు చేసిన అనుమతుల వల్లే ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం" అని సజ్జన్ జిందాల్ చాలా స్పష్టంగా ప్రకటించడంతో కూటమి ప్రభుత్వ నాటకాలు బహిర్గతమయ్యాయి. - జగన్ గారు తెచ్చిన అనుమతులు, ఇచ్చిన రాయితీలు, అందించిన సహకారం 2019లో వైయస్ జగన్ నేతృత్వంలో వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. తొలుత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీ హై గ్రేడ్ స్టీల్స్ ఏర్పాటు చేసి, ఆ తర్వాత పటిష్టమైన ప్రైవేట్ యాజమాన్యం ఉంటేనే ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందని భావించి టాటా, ఎస్సార్, జేఎస్డబ్ల్యూ వంటి దిగ్గజ సంస్థలతో జగన్ గారే స్వయంగా సంప్రదింపులు జరిపారు. డిసెంబర్ 21, 2022న జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ సంస్థను ఒప్పించి, వారికి ఇన్సెంటివ్‌లు ఇస్తూ చారిత్రాత్మక జీవో నెం. 87 విడుదల చేశారు. యాదృచ్ఛికంగా అదే రోజు జగనన్న పుట్టినరోజు కూడా. ఈ జీవో ద్వారా పరిశ్రమకు స్టేట్ జీఎస్టీ మినహాయింపు, పవర్ ఛార్జీలలో సబ్సిడీలు, పన్ను మినహాయింపులు వంటి అనేక రాయితీలను జగన్ ప్రభుత్వం కల్పించింది. పరిశ్రమ స్థాపనకు అత్యంత ప్రాధాన్యమైన పర్యావరణ అనుమతితో పాటు, నిర్మాణ పనులు ప్రారంభించడానికి అత్యంత కీలకమైన సీఎఫ్‌ఈ (కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్) అనుమతులను కూడా నాటి జగన్ ప్రభుత్వమే సాధించి పెట్టింది. ఉక్కు పరిశ్రమ అవసరాల కోసం గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని కేటాయిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. - జిందాల్‌కి భూకేటాయింపులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, సున్నపురాలపల్లె వద్ద క్షేత్రస్థాయిలో మౌలిక వసతులను జగన్ ప్రభుత్వం సమకూర్చింది. వైయస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ పరిధిలోని 3,300 ఎకరాల నుంచి ఫేజ్-1 కింద 1,100 ఎకరాలను జిందాల్ సంస్థకు కేటాయించారు. అందులో దాదాపు 640 ఎకరాల భూమిని పూర్తి స్థాయిలో సేకరించి ఇచ్చింది జగన్ ప్రభుత్వమే. ఇందులో భాగంగా పట్టాలున్న రైతుల నుంచే కాకుండా, ఆన్‌లైన్ రికార్డులు, డి-పట్టాలు లేని నిరుపేద రైతులకు కూడా మానవతా దృక్పథంతో 50శాతం పరిహారం అందించి ఆదుకోవడం జరిగింది. జాతీయ రహదారి ఎన్‌హెచ్ 67 నుంచి ఉక్కు పరిశ్రమకు అనుసంధానంగా 12 కిలోమీటర్ల 4 లైన్ల రోడ్డు కోసం రూ. 50 కోట్లు మంజూరు చేయడమే కాకుండా, జగనన్న హయాంలోనే టెండర్లు పిలిచి దాదాపు రూ. 25 నుండి 30 కోట్ల విలువైన పనులను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇందుకు గానూ 38 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేశాం. - చంద్రబాబు దొంగ శంకుస్థాపనలు ఒక్కసారి చరిత్రను గమనిస్తే, చంద్రబాబు నాయుడికి ఉక్కు పరిశ్రమపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. 2018 డిసెంబర్‌లో, సార్వత్రిక ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు మైలవరం మండలం కంబాలదిన్నెలో చంద్రబాబు ఒంటరిగా పోయి భూమి పూజ చేశారు. ఏ సంస్థ నిర్మిస్తుందో తెలియదు, నిధులు ఎవరిస్తారో తెలియదు.. కేవలం ఎన్నికల స్టంట్ కోసం ఆ రోజు చంద్రబాబు దొంగ శంకుస్థాపన చేశారు. మళ్లీ ఇప్పుడు వైయస్ జగన్ గారు.. సజ్జన్ జిందాల్ తో కలిసి 2023 ఫిబ్రవరిలోనే అధికారికంగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకు, నిన్న చంద్రబాబు మళ్లీ టేపు కట్ చేసి డ్రామాలు ఆడుతున్నారు. - అమరావతి వర్సెస్ మావిగన్ శివరామకృష్ణ కమిటీ వద్దన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు అమరావతి అనే ఒక ఆర్టిఫిషియల్ రాజధాని కోసం దాదాపు రూ. 2 లక్షల కోట్ల ప్రజాధనాన్ని అప్పుల రూపంలో తగలేయాలని చూస్తున్నాడు. ఎక్కడైనా ప్రభుత్వం రెండు రూపాయలు పెడితే, ప్రైవేట్ పెట్టుబడులు పది రూపాయలు వచ్చి నాచురల్ డెవలప్‌మెంట్ జరగాలి. కానీ ఇక్కడ మొత్తం ప్రభుత్వమే అప్పు తెచ్చి పెట్టాలంటే ఎలా? కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా ఒక్కసారి ఆలోచించాలి. గతంలో పవన్ కళ్యాణ్ స్వయంగా "అమరావతి అనేది ప్రజా రాజధాని కాదు, అది ఒక వర్గానికి చెందిన ధనికుల గేటెడ్ కమ్యూనిటీ " అని చెప్పారు. ఇవాళ ఆయన పదవి కోసం మిన్నకుండిపోయారు. వైఎస్ జగన్ గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించారు. ఇప్పటికే బలమైన రోడ్లు, రైల్వే నెట్‌వర్క్, సీ-పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు (మావిగన్) ప్రాంతాలను కలిపి ప్రజా రాజధానిగా ఫామ్ చేస్తే.. కేవలం రూ. 25వేల కోట్ల ఖర్చుతోనే (అమరావతి బడ్జెట్‌లో 10 శాతం) అద్భుతమైన రాజధాని సాధ్యమవుతుంది. మిగిలిన నిధులను రాష్ట్ర ప్రగతికి, ప్రజల పథకాలకు వాడుకోవచ్చనేది జగనన్న పాలసీ. - జగన్ గారిని తిట్టడానికే జమ్మలమడుగు సభ నిన్నటి జమ్మలమడుగు సభ ఉక్కు పరిశ్రమ కోసం పెట్టిన సభలా లేదు, కేవలం జగన్ గారిపై కక్ష సాధింపునకు, వ్యక్తిగత దూషణలకే పరిమితమైంది. సభ ఉద్దేశమే జగన్ గారి వ్యక్తిత్వ హననం చేయడం. సందర్భం ఉన్నా లేకపోయినా చంద్రబాబు అండ్ కో ఒక టేప్ రికార్డర్ లాగా వివేకా కేసును వేల సార్లు ప్లే చేస్తూనే ఉంటారు. కేవలం రాజకీయ మైలేజ్ కోసమే ఈ శవ రాజకీయాలు చేస్తున్నారు. 70 ఏళ్ల వయస్సు ఉండి, మంత్రిగా పనిచేసిన స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సైతం కనీస సంస్కారం లేకుండా జగన్ గారిపై చేసిన వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారు. భగవంతుడికి, ప్రజలకు వాస్తవాలు తెలుసు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, అబద్ధాలు ప్రచారం చేసే ఈ కూటమి నాయకులకు అంతిమంగా భగవంతుడే తగిన గుణపాఠం చెబుతాడు. - సాగునీటి ప్రాజెక్టులు వైయస్సార్, వైఎస్ జగన్ల కృషి ఫలితమే రాయలసీమ సాగునీటి చరిత్ర తెలిసిన ఎవరైనా చంద్రబాబు మాటలకు నవ్వుకుంటారు. తుంగభద్ర హైలెవెల్ కెనాల్ చివరి సిస్టమ్స్ అయిన మైలవరం, చిత్ర రిజర్వాయర్లకు చుక్క నీరు రాని పరిస్థితి ఉంటే.. కృష్ణా జలాలను ఈ ప్రాంతానికి తెచ్చిన మహానాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. గండికోట డ్యామ్ కెపాసిటీని 26 టీఎంసీల నుండి కేవలం 6 టీఎంసీలకు కుదిస్తూ చంద్రబాబు గతంలో జీవో ఇస్తే, వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని మళ్లీ 27 టీఎంసీలకు పెంచి పనులు పూర్తి చేయించారు. ఇక జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక, గతంలో చంద్రబాబు వదిలేసిన నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం అక్షరాలా వెయ్యి కోట్లు చెల్లించి గండికోటలో పూర్తి స్థాయిలో 27 టీఎంసీల నీటిని నిల్వ చేసి చూపించారు. అలాగే చిత్ర రిజర్వాయర్ లో కూడా రూ. 270 కోట్లు వెచ్చించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేసి, నీటి నిల్వ సామర్థ్యాన్ని 5 నుండి 10 టీఎంసీలకు పెంచిన ఘనత జగనన్న ప్రభుత్వానిదే. జీఎన్ఎస్ఎస్ ప్యాకేజీ-1, ప్యాకేజీ -2 కోసం రూ. 400 కోట్లకు పైగా జగన్ ప్రభుత్వమే వెచ్చించింది. ఈ జిల్లాకు కృష్ణా నీరు వచ్చిందన్నా, ఉక్కు పరిశ్రమకు పునాది పడిందన్నా అది కేవలం వైయస్సార్ కుటుంబం వల్లేనని ఈ ప్రాంత యువతకు, ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు ఎన్ని నాటకాలు ఆడినా ఈ నిజాలను మార్చలేరు. వాస్తవానికి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడింది చంద్రబాబు, ఆదినారాయణరెడ్డిలే. వంద సార్లు అబద్ధాలు చెప్పినా వైయస్ కుటుంబం చేసిన మంచిని చెరపలేరు. - ఆదినారాయణ రెడ్డీ.. ఎక్కడికి పారిపోతావో నీ ఇష్టం జంతువులతో పోలుస్తూ వైయస్సార్ కుటుంబంపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అసలు మనిషివేనా అనే అనుమానం కలుగుతోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన రాజకీయ భిక్షతోనే ఈరోజు ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా తిరుగుతున్నాడనే నిజాన్ని మరవకూడదు. గతం మరిచి విర్రవీగుతున్న ఆదినారాయణరెడ్డికి భవిష్యత్తులో ప్రజలు, కాలమే తగిన గుణపాఠం చెబుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి గుండ్లకొండ మీదుగా సొంత ఊరికి పోవాలంటే ప్రత్యర్థులకు భయపడి మైళ్ల దూరం చుట్టుకుని పోయిన చరిత్ర ఆయనది. ఆ రోజుల్లో ఆయనకు అండగా నిలబడి, ఆర్థికంగా సహాయం చేసి, పనులు ఇప్పించి అన్ని రకాలుగా ఆదుకున్న వైయస్సార్ కుటుంబాన్ని విమర్శిస్తే పతనం తప్పదు. ఆదినారాయణరెడ్డికి ఒకటే వార్నింగ్.. అధికారంలో ఉంటే విర్రవీగుతూ మాట్లాడతావు, అధికారం లేకపోతే 'నిక్కర్ నారాయణ'గా మారతావు, ఇదే నీ బతుకు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ వేధించాలనే ఉద్దేశం లేదు కాబట్టే ఆదినారాయణరెడ్డి ఇవాళ ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. ప్రతి మాటకూ సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. వైయస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయించింది తానేనని ఆదినారాయణరెడ్డి ప్రత్యక్షంగా ఒప్పుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం. కూటమి ప్రభుత్వంలో పోలీసులు చర్యలు తీసుకోకపోయినా.. రాబోయే జగనన్న ప్రభుత్వంలో మళ్లీ అదే ఊరిలో వైయస్సార్ విగ్రహాన్ని ఎంతో ఘనంగా ప్రతిష్ఠిస్తాం. ఆ రోజు ఆదినారాయణరెడ్డి ఏ జిల్లాకో, ఏ దేశానికో పారిపోతాడో పారిపోవాలని ఎంపీ అవినాశ్ రెడ్డి హెచ్చరించారు.