అప్పు చేయడంలో ఇదీ చంద్రబాబు ‘మార్క్‌’ 

మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.1,800 కోట్లు అప్పు చేయనున్న ప్రభుత్వం 

మొత్తం అప్పులు రూ.3,56,455 కోట్లు

అమరావతి: ఏ రోజు ఎక్కడ ఎలా అప్పు దొరుకుతుందా... అన్నట్లుగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోంది. తాజాగా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) నుంచి మార్క్‌ఫెడ్‌ రూ.1,800 కోట్లు అప్పు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్క్‌ఫెడ్‌ తీసుకునే రూ.1,800 కోట్ల అప్పునకు అసలు, వడ్డీకి ప్రభుత్వ గ్యారెంటీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్‌సీడీసీ నుంచి మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.12,053 కోట్ల మేర చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. ప్రస్తుత రూ.1,800 కోట్ల అప్పు కూడా కలిపితే మార్క్‌ఫెడ్‌ ద్వారా ఎన్‌సీడీసీ నుంచి తీసుకున్న అప్పు రూ.13,853 కోట్లకు చేరనుంది.
 
చంద్రబాబు ప్రభుత్వం 23 నెలల్లోనే బడ్జెట్‌ పరిధిలో, బడ్జెట్‌ వెలుపల కలిపి సోమవారం వరకు మొత్తం రూ.3,56,455 కోట్లు అప్పు చేసింది. అయితే, బడ్జెట్‌ పరిధిలోనే రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేడు (మే 5, మంగళవారం) రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసి రూ.4,600 కోట్లు రుణం సమీకరించి ఇవ్వనుంది. సోమవారం ఎన్‌సీడీసీ నుంచి మార్క్‌ఫెడ్‌ రూ.1,800 కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీతో అనుమతిచ్చింది.

దీంతో ఇప్పటి వరకు చంద్రబాబు సర్కారు చేసిన అప్పు మొత్తం రూ.3,62,855 కోట్లకు చేరనుంది. ఈ ప్రభుత్వం నెలకు సగటున రూ.15,776 కోట్లు, రోజుకు సగటున రూ.526 కోట్లు అప్పు చేస్తోంది. కాగా, గ్రామీణ విద్యుద్ధికరణ సంస్థ (ఆర్‌ఈసీ) నుంచి డిస్కమ్స్‌ తీసుకున్న రూ.7,000 కోట్ల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీని పొడిగిస్తూ సోమవారం ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Back to Top