కృష్ణా జిల్లా : పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కల మండలం చోరగుడి, కూడేరు శివారు నమితలగుంట గ్రామంలో మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న మొక్కజొన్న రైతులను మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సందర్శించారు. ఆయనతో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు మర్రి బాబురావు తదితరులు పాల్గొన్నారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం కైలే అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించడం దారుణమని మండిపడ్డారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఎలా జీవించాలంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేయడం అన్యాయమని విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, మొక్కజొన్నకు సరైన మద్దతు ధర ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.