ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం నివారణకు కేంద్రం జోక్యం అవసరం

కేంద్ర మంత్రికి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ ఎంపీ గురుమూర్తి లేఖ‌

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్దిప్ సింగ్ పూరికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఇంధన కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఏపీలోని సుమారు 4,510 పెట్రోల్ బంకుల్లో దాదాపు 70 శాతం బంకుల్లో “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. పలుచోట్ల వాహనదారులకు పెట్రోల్, డీజిల్‌ను రేషన్ విధానంలో ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాలో ఎలాంటి అవరోధాలు లేవని పెట్రోలియం శాఖ చెబుతుండగా, క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని గురుమూర్తి అన్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి కూడా సరఫరాపై ఎలాంటి సమస్యలేదని ప్రభుత్వ వాదన ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయని సూచించారు. ఈ కొరత కారణంగా వ్యాపారులు, రైతులు, పేద మరియు మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇంధన కొరతకు గల కారణాలను సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ వంటి అంశాలపై దృష్టి సారించాలని కోరారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అవసరాలకు తగిన విధంగా పెట్రోల్, డీజిల్ సరఫరా జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Back to Top