తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరి అక్రమ అరెస్టును వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఖండించారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు కనీసం నోటీసు ఇవ్వకుండా ఈ ఉదయం తాడేపల్లిలోని తన నివాసానికి సమీపంలో శ్రీహరిని బలవంతంగా అదుపులోకి తీసుకెళ్లడం తీవ్రంగా అభ్యంతరకరమని అన్నారు. పోలీసులు తాము ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పోలీస్ స్టేషన్‌కు చెందినవారు, ఎందుకు తీసుకెళ్తున్నారు అనే వివరాలు కూడా వెల్లడించకపోవడం అన్యాయమని విమర్శించారు. ఇంటికి వెళ్లి వస్తానని శ్రీహరి కోరినా పట్టించుకోకుండా తీసుకెళ్లడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఉదయం మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో అడ్డుకుని పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలిపారు. శ్రీహరి వద్ద ఉన్న ఫోన్, ల్యాప్‌టాప్‌లను కూడా స్వాధీనం చేసుకుని బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించారు. రాష్ట్రంలో పౌర హక్కుల ఉల్లంఘనలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పూడి శ్రీహరిని విడుదల చేసి, అక్రమ అరెస్టులపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రవిచంద్ర డిమాండ్ చేశారు.