వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త కృష్ణార్జున రెడ్డి కుటుంబానికి వైయ‌స్ జ‌గ‌న్ అండ‌

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌ను బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాంబొట్లవారి పాలెంకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త కృష్ణార్జున రెడ్డి కలిసి తనపై జరిగిన దాడి విషయాన్ని వివరించారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాననే నెపంతో చెరుకుపల్లి ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తనను అక్రమంగా స్టేషన్‌లో నిర్భందించి, విచక్షణారహితంగా లాఠీలతో కొట్టాడని కృష్ణార్జున రెడ్డి ఆరోపించారు. తన శరీరంపై వచ్చిన గాయాలను వైయస్‌ జగన్‌కు చూపిస్తూ జరిగిన ఘటనను వివరించారు.

ఈ సందర్భంగా స్పందించిన వైయస్‌ జగన్‌, కొంతమంది పోలీసు అధికారులు టీడీపీ నాయకుల మెప్పు కోసం చట్టాన్ని అతిక్రమిస్తూ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలపై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

కృష్ణార్జున రెడ్డిని అక్రమంగా నిర్భందించి దాడి చేసిన ఎస్‌ఐ అనిల్‌పై చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్‌పీ, డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్సార్‌సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ వైయస్‌ జగన్‌కు వివరించారు.

కృష్ణార్జున రెడ్డికి అవసరమైన న్యాయ సహాయాన్ని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్ అందిస్తుందని, అతని కుటుంబానికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 

Back to Top