తాడేపల్లి: రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అక్రమ కేసులకు కూటమి ప్రభుత్వం తెరలేపిందని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. ఇందులో భాగంగానే సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరిని అక్రమంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. పూడి శ్రీహరిపై ఒకే కంటెంట్‌తో వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారని ఆక్షేపించారు. ఒకే రోజు, ఒకే విధంగా ఫిర్యాదులు ఇవ్వడం కుట్రపూరిత చర్య కాదా? అంటూ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని “ఆర్గనైజ్డ్ క్రైమ్”గా అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వ విధానాన్ని తూర్పారబట్టారు. ప్రెస్‌మీట్‌లో మనోహర్‌రెడ్డి ఏమన్నారంటే.. - ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ పేరుతో అణచివేతలు దాదాపు రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో మొదటి రోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, వాటికంటే దారుణంగా ఇప్పటికీ ఉన్నాయి. ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ పేరుతో తీవ్రమైన అణచివేతలు కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని చురుగ్గా వ్యవహరిస్తోంది. పోలీసులను శాంతిభద్రతల పరిరక్షణకు కాకుండా ప్రతిపక్షాలను ఇబ్బందిపెట్టేందుకు వాడుకుంటున్నారు. - ఓట్లు వేసిన ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు ప్రతి సందర్భంలోనూ ప్రజలు ‘మేం ఏం పాపం చేశాం? కూటమికి ఓట్లు వేసిన తర్వాత మమ్మల్ని రోడ్డుపై నిలబెట్టారు’ అని పశ్చాత్తాపపడుతున్నారు. రేషన్ కోసం, యూరియా కోసం క్యూల్లో నిలబడాల్సి వస్తోంది. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం రాష్ట్రంలో ఉంది. ఈ సంక్షోభాన్ని డైవర్ట్ చేయడానికి మళ్లీ ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ పేరుతో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులకు ప్రభుత్వం తెరలేపుతోంది. - జర్నలిస్టుపై ఈవిధంగా వ్యవహరించడం దుర్మార్గం సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరిని ఈ నెల 15వ తేదీ ఉదయం తాడేపల్లిలోని తన ఇంటికి వెళ్తున్న సమయంలో సివిల్ డ్రస్‌లో వచ్చిన పోలీసులు ఐడెంటిటీ కార్డు కూడా చూపకుండా చుట్టుముట్టి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ‘మేము పోలీసులు, దర్యాప్తు కోసం వచ్చాం’ అని చెప్పి సహకారం కోరాల్సింది పోయి, ఎలాంటి వివరాలు ఇవ్వకుండా వాహనంలో ఎక్కించారు. ఉగ్రవాదులు లేదా క్రిమినల్ చరిత్ర ఉన్న వారిని ఇలా తీసుకెళ్లాలి కానీ, ఒక జర్నలిస్టును ఈ విధంగా వ్యవహరించడం దుర్మార్గం. - కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసినా.. పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకొని కుప్పంలో దాదాపు 36 గంటల నిర్బంధంలో ఉంచి కోర్టులో ప్రవేశపెట్టారు. అరెస్టు చేసిన 24 గంటలలోపే కోర్టులో హాజరు పరచాలి అనే నిబంధనను పోలీసులు ఉల్లంఘించారు. అంతేకాకుండా డెకాయిటీలు, హత్యలు, అపహరణలు, సుపారీ కేసుల్లో ఉపయోగించే 111 సెక్షన్‌ను శ్రీహరిపై పెట్టారు. దీంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, ఒక జర్నలిస్టుకు బెయిల్ ఇవ్వడాన్ని కూడా నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడం ఆశ్చర్యకరం. సుప్రీంకోర్టులో కూడా ఇద్దరు న్యాయవాదులను నియమించి, ఒక్కో లాయర్‌కు రూ.30 లక్షలు ఖర్చు చేయడం వెనుక రాజకీయ ప్రేరణలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తోంది. - ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? శ్రీహరిపై ఇచ్చిన ఫిర్యాదులను మక్కికి మక్కి కాపీ చేసి నల్లపాడు, కుప్పం, గుంటూరు కొత్తపేట ప్రాంతాల్లో 14.04.2026న ఒకే రోజు నమోదు చేశారు. ఒకే కంటెంట్‌తో వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం అనుమానాస్పదం. గుంటూరు కొత్తపేటలో టీడీపీ ఎమ్మెల్యే నజీర్ స్వయంగా ఫిర్యాదు చేసి, ‘వైయస్ఆర్‌సీపీ గూండాలు’ అంటూ కంప్లైంట్‌లో రాశారు. సంతకం తప్ప ఇంకెక్కడా ఒక్క అక్షరం కూడా మారలేదు. ఇది పూర్తిగా ఆర్గనైజ్డ్ క్రైమ్‌లా కనిపిస్తోంది. ఈ వ్యవహారం వెనుక టీడీపీ పాత్ర ఉందని స్పష్టంగా తెలుస్తోంది. - కంప్లైంట్ లో శ్రీహరి పేరు లేదు.. తప్పుడు కేసుల్లో పోలీసులు మితిమీరిన చర్యలకు దిగుతున్నారు. 35–3 కింద ముందుగా నోటీసు ఇచ్చి, సహకరించకపోతే అరెస్టు చేయాల్సి ఉండగా, ముందే అరెస్టు చేసి తరువాత నోటీసులు ఇస్తున్నారు. మధ్యవర్తుల ముందు నేరం ఒప్పుకున్నట్లు తప్పుడు సంతకాలు తీసుకుంటున్నారు. ఇలాంటి విధానం గతంలో ఎప్పుడూ లేదు. ఈ ప్రభుత్వమే కొత్త సంప్రదాయానికి తెరలేపింది. పూడి శ్రీహరిని రెండోసారి అరెస్టు చేసినప్పుడు కూడా తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని 24 గంటల తరువాత కోర్టులో హాజరు పరిచారు. గుంటూరు నుంచి పోలీసులు రావడానికి ఆలస్యం చేశారని కారణం చెబుతున్నారు. ఆశ్చర్యకరంగా ఈ మూడు ఎఫ్‌ఐఆర్‌లలో ఎక్కడా శ్రీహరి పేరు లేదు. ఒకే సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి వచ్చిన పోస్టుకు ప్రతిస్పందనగా చేసిన పోస్టుపై ఇంత పెద్ద రాద్దాంతం చేయడం అన్యాయం. - రాజ్యాంగం అందరికీ ఒకేలా వర్తించదా? టీడీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో వైయస్ జగన్ చేతిలో గొడ్డలి పెట్టి ‘గొడ్డలి పార్టీ’ అంటూ విధ్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు చేసినా ఎలాంటి కేసులు నమోదు చేయలేదు, చర్యలు తీసుకోలేదు. అయితే పార్టీ అధికారిక హ్యాండిల్‌లో వచ్చిన పోస్టులకు సంబంధం లేకపోయినా సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరిని అరెస్టు చేయడం దుర్మార్గం. ఆయన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఈ పోస్టులు లేవు. ఒకే రాజ్యాంగం అందరికీ వర్తించాలి కదా? అయితే అధికారపక్షంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరైన తరువాత కూడా 35–3 నోటీసు ఇచ్చి పంపాలని న్యాయమూర్తి చెప్పినా, గుంటూరు నుంచి 600 కిలోమీటర్లు ప్రయాణించి నాలుగు వాహనాలతో పోలీసులు కుప్పం వెళ్లడం అనవసర వ్యయం కాదా. రైతులు, ఆక్వా రైతులకు డీజిల్ అందక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఒక జర్నలిస్టును అరెస్టు చేయడానికి ఇంత డీజిల్ వినియోగించడం ఎంతవరకు సమంజసం. - పౌర హక్కులు హరిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాజకీయ కక్షతో అమాయకులపై కేసులు పెట్టి వేధిస్తోంది. సాక్షి కార్యాలయాలపై దాడులు జరిగినా కేసులు నమోదు కాలేదు. ఏలూరులో సాక్షి ఆఫీసుపై దాడి ఘటనలో కోర్టు తాజాగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ పేరుతో పౌర హక్కులు హరించబడుతున్నాయి. వ్యవస్థలు ధ్వంసమవుతున్నాయి. ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం నిలవదు. ప్రభుత్వం నియంతల మాదిరిగా వ్యవహరిస్తోంది. ఇది సరైన విధానం కాదు. - బాధితుడి పైనే కేసు నమోదు నిన్న సోషల్ మీడియా కార్యకర్త కరిముల్లా తన మెకానిక్ షాప్ ముందు టీడీపీ బ్యానర్ కట్టొద్దని చెప్పినందుకు అతనిపై దాడి చేసి, షాపును ధ్వంసం చేశారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. చివరికి బాధితుడైన కరిముల్లాపైనే కేసు నమోదు చేయడం అన్యాయం. దాడులు చేసేవారే కేసులు పెట్టించడం, బాధితులపైనే కేసులు నమోదు చేయడం రాష్ట్రంలో జరుగుతోంది. కడపలో పెద్ద దస్తగిరి హత్యపై కూడా మంత్రులు వైయస్ఆర్‌సీపీపై ఆరోపణలు చేస్తుండగా, దస్తగిరి భార్య స్వయంగా సంబంధం లేదని చెప్పినా పట్టించుకోవడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో సాక్షి రిపోర్టర్‌పై దాడి జరగడం ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ప్రయత్నమే. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పక్కనబెట్టి సోషల్ మీడియాపైనే ప్రభుత్వం దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం కోర్టుల పట్ల గౌరవం చూపాలి. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తామని అనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. వైయస్ఆర్‌సీపీ పోరాటం ఆగదు. నిలబడతాం, కలబడతాం, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం. బెదిరింపులకు భయపడేది లేదు అని మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు.