తాడేపల్లి: చంద్రబాబు బినామీలు సృష్టించిన కృత్రిమ ఇంధన కొరత గురించి ప్రజలు ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పుకోలేక జగనన్న కాలనీల్లో నిలువెత్తు దోపిడీ అంటూ మరో డైవర్షన్ డ్రామాకు ఈనాడు ద్వారా చంద్రబాబు తెరదీశాడని మాజీ మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనాడు కిరణ్ మాతో వస్తే వైయస్సార్సీపీ హయాంలో కట్టించిన ఇళ్లను, పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను చూపిస్తామని చెప్పారు. ఆయనకు చేతనైతే తన జీవితంలో పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వని చంద్రబాబుని ప్రశ్నించాలని, రెండేళ్లుగా జగనన్న కాలనీలకు రోడ్లు, మౌలిక వసతులు ఎందుకు కల్పించలేదని చంద్రబాబుని ఈనాడు నిలదీయాలని సవాల్ చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్నా, ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్నా తండ్రీకొడుకులు వైయస్సార్, వైయస్ జగన్‌లకే సాధ్యమైందని ఆయన వివరించారు. వైయస్ జగన్ సినిమాకు ఎండ్ కార్డు అనేదే ఉండదని, గడిచిన ఐదేళ్ల అభివృద్ధి ఒక ట్రైలర్ మాత్రమేనని మాజీ మంత్రి జోగి రమేశ్ స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - దేశంలో ఏపీలో మాత్రమే ఇంధన కొరత దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలోనే ఇంధన కొరత వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు బినామీల పనే. వారం రోజులుగా ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో నిల్చునే దుస్థితిని కల్పించారు. పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించి దోచుకోవాలని చూసిన చంద్రబాబు, ఆయన మనుషుల ఆలోచనలను చూసి రాష్ట్ర ప్రజల కడుపు రగిలిపోతోంది. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం లేక తప్పుడు ఆరోపణలతో వైయస్సార్సీపీ మీద బురదజల్లడం ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారు. అందులో భాగంగానే జగనన్న కాలనీల్లో నిలువెత్తు దోపిడీ అంటూ ఈనాడులో పెద్ద అబద్ధాలతో బ్యానర్ స్టోరీని అచ్చేశారు. సగం పేజీ నిండా అబద్ధాలు రాస్తే ప్రజలు నమ్మేస్తారనే భ్రమల్లో ఉన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్నా, ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నా తండ్రీకొడుకులు వైయస్సార్, వైయస్ జగన్ లకే సాధ్యం. ఈనాడు కిరణ్ మాతో వస్తే ఊరూరా వైయస్ జగన్ గారు కట్టించిన ఇళ్లను, పంచిన ఇళ్ల పట్టాలను చూపిస్తాం. - 31 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చేలా ఇళ్ల పట్టాలు అందజేశారు. ఆ విధంగా 1.20 కోట్ల మందికి మేలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 17,005 జగనన్న కాలనీలు రూపుదిద్దుకున్నాయి. గడిచిన రెండేళ్ల కూటమి పాలనలో చంద్రబాబు పంపిణీ చేసిన వేల ఇళ్ల పట్టాలలతో ఒక్క కాలనీ అయినా వచ్చిందా? వేల ఇళ్లతో ఏకంగా ఊళ్లకు ఊళ్లే రూపు దిద్దుకున్నాయి. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం పేదలకు ఒక్క సెంటు భూమి ఇచ్చిందా? ఒక్క ఇళ్లయినా కట్టించావా చంద్రబాబూ అని ఈనాడు ప్రశ్నించాలి. వైయస్ జగన్ గారు నిర్మించిన కాలనీలకు రోడ్లు, మౌలిక వసతులు కల్పించడానికి కూడా చంద్రబాబుకి మనసురాలేదు. వైయస్సార్సీపీ హయాంలో పూర్తయిన ఇళ్లకు చంద్రబాబు రిబ్బన్ కటింగ్‌లు చేసి క్రెడిట్ చోరీకి పాల్పడ్డాడు. టిడ్కో ఇళ్ల పేరుతో పేదలను జీవితాంతం రుణగ్రస్తులుగా ఉండిపోయేలా చంద్రబాబు చేశాడు. కానీ అదే టిడ్కో ఇళ్లను వైయస్ జగన్ గారు ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి పేద అక్కచెల్లెమ్మలకు కానుకగా ఇచ్చారు. 365 చ అడుగుల అడుగుల ఇంటిని రూ. 25 వేలకు, 430 చదరపు అడుగుల ఇంటిని రూ. 50 వేలకు రిజిస్ట్రేష్ చేసి అందించారు. - జగన్ సినిమాకు ఎండ్ కార్డు ఉండదు జగన్ సినిమాకు ఎండ్ కార్డు వేసేది పసుపు సైన్యమేనని లోకేష్ చెబుతున్నాడు. గడిచిన ఐదేళ్లలో వారికి కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాం. అసలు సినిమా రాబోయే రోజుల్లో చూపిస్తాం. ఐదేళ్లలో 17 మెడికల్ కాలేజీలు, 10 పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌లను మాత్రమే చూపించాం. వైయస్సార్సీపీ ప్రభుత్వంతో వైయస్ జగన్ చూపించబోయే సినిమా రాష్ట్రంలో ఇంకో 30 ఏళ్లు కొనసాగడం తథ్యం. 2029 వరకు చంద్రబాబే సిఎంగా కొనసాగుతాడో లేదా ఇంకెవరినైనా తెచ్చి పెట్టుకుంటారో మాకు అనవసరం, అనేది వారి అంతర్గత విషయం. మా సినిమాకు ఎవరూ ఎండ్ కార్డు వేయలేరు. వైయస్ జగన్ సినిమాకు ఎండ్ కార్డు ఉండదు.