తాడేపల్లి: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రకాశం పంతులుగారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు వైయస్ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులలో దక్షిణ భారతదేశంలో ప్రకాశం పంతులు గారు అగ్రగణ్యులని పేర్కొంటూ, ఆయన జీవిత విశేషాలు భావితరాలకు తెలియజేసేలా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో “ప్రకాశం స్మృతివనం” ఏర్పాటు చేయాలని, అలాగే శాసనసభ ప్రాంగణంలో టంగుటూరి ప్రకాశం పంతులుగారి విగ్రహం ప్రతిష్ఠించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జ్వాలాపురం శ్రీకాంత్, ద్రోణంరాజు శ్రీవాత్సవ, రాంపల్లి రవిచంద్ర, పురుషోత్తమ శర్మ, ఈ.కృష్ణమాచారి, సీహెచ్.శ్రీనివాసరావు, కె.వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన వైయస్ జగన్, అధికారంలోకి రాగానే తప్పనిసరిగా ప్రకాశం పంతులుగారి స్మృతివనం, విగ్రహం ఏర్పాటుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.