తూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం మండలంలోని భీమోలు చెరువు వద్ద అక్రమంగా చెరువుల నుంచి మట్టిని తరలిస్తున్నారంటూ వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తానేటి వనిత నాయకత్వం వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, సత్తి సూర్యనారాయణరెడ్డి, రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ గూడురు శ్రీనివాస్, నియోజకవర్గ పరిశీలకుడు చందన నాగేశ్వరరావు, తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణు, తానేటి వనిత మాట్లాడుతూ, కోట్లాది రూపాయల విలువైన మట్టిని అక్రమంగా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మట్టి మాఫియా పెట్రేగిపోయిందని విమర్శించారు. అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే అరికట్టాలని, లేకపోతే వైయస్ఆర్‌సీపీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తానేటి వనిత హెచ్చరించారు.