బూత్ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి

మాజీ మంత్రి వెలంపల్లి ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నాయకుల సమావేశం

విజయవాడ: బూత్ స్థాయిలో పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు సూచించారు. స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైయ‌స్ఆర్‌సీపీ విజయవాడ పశ్చిమ కార్యాలయంలో మాజీ మంత్రి, పశ్చిమ వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జ్ వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ నేపథ్యంలో బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) విధి విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా సవరణ వంటి కీలక సమయంలో పార్టీ శ్రేణులు అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించాలని, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు బీఎల్ఏలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని వెలంపల్లి సూచించారు.

భారత ఎన్నికల సంఘం (ECI) నిబంధనలను కచ్చితంగా పాటించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఈసీఐ రూపొందించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. బూత్ లెవల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో రక్షణ కవచంలా వ్యవహరిస్తూ, ఓట్ల నమోదు మరియు తొలగింపుల్లో జరిగే అక్రమాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.  ఈసీఐ నిబంధనల ప్రకారం బూత్ లెవల్ అధికారులు (BLO) ప్రదర్శించే ముసాయిదా ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఎన్యుమరేషన్ ప్రక్రియలో పొరపాట్లు జరిగినా, రాజకీయ ఒత్తిళ్లతో అక్రమంగా ఓట్లు చేర్చినా లేదా తొలగించినా వాటిని సహించబోమని హెచ్చరించారు. అలాంటి ఘటనలు గమనించిన వెంటనే తగిన ఆధారాలతో ఈఆర్ఓ (ERO), జిల్లా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.

నగరంలో జరుగుతున్న డివిజన్ల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపైనా సమావేశంలో చర్చించారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి లిఖితపూర్వకంగా తెలియజేయాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు. అదేవిధంగా పార్టీలో వివిధ పదవులకు నియమితులైన వారి పెండింగ్ వెరిఫికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత డివిజన్ల మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులను మాజీ మంత్రి వెలంపల్లి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top