తాడేపల్లి: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే పెట్రో ధరలు అధికమని, తాము అధికారంలోకి రాగానే వాటిని తగ్గిస్తామని నాడు ప్రకటించిన ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ వెంటనే ఆ పని చేయాలని విశాఖ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కెకె రాజు డిమాండ్ చేశారు. నాడు పెట్రో ధరలు ప్రస్తావిస్తూ, నానా హంగామా చేసిన తండ్రీ కొడుకులు, ఇప్పుడు ఆనాటి మాదిరిగా పెట్రోల్ బంక్‌ల ముందు సెల్ఫీ దిగే దమ్ముందా? అని ఆయన సవాల్ చేశారు. రెండేళ్ల చంద్రబాబు పాలనంతా అబద్ధాలు, అప్పులు, మోసాలే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక, పాలన చేత కాక రెండేళ్లలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, అందుకే చెప్పుకోవడానికి ఏమీ లేక, డ్రామాలు, రీల్స్‌తో సీఎం చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని కెకె రాజు ఆక్షేపించారు. చంద్రబాబుకి 28 జిల్లాల ఏపీ కన్నా 29 గ్రామాల అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారమే ముఖ్యమని, అక్కడి నిర్మాణాలకు డీజిల్ కొరత రాకూడదని ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ కొరత సృష్టించారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కెకె రాజు దుయ్యబట్టారు. ప్రెస్‌మీట్‌లో కెకె రాజు ఇంకా ఏమేం మాట్లాడారంటే..: - చంద్రబాబు డ్రామాలు. రీల్స్: ఎన్నికలకు ముందు ప్రజలకు మాయమాటలు చెప్పి, వారిలో భ్రమలు కల్పించి తప్పుడు హామీలతో చంద్రబాబు ఎలాగైతే అధికారంలోకి వచ్చాడో, గడిచిన రెండేళ్లుగా అవే అబద్ధాలను, మోసాలతోనే పాలన సాగిస్తున్నాడు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం చేతకాక, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్‌గారిపైనా, మా పార్టీపైనా దుష్ప్రచారంతో కాలక్షేపం చేస్తున్నాడు. రెండేళ్ల పాలనలో చేసిందేమీ లేకపోయినా మీడియా పబ్లిసిటీతో హడావుడి చేస్తున్నాడు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ చార్జీల భారంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ కోసం వీడియోలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అదే నాడు జగన్ గారు పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలనే సంకల్పంతో వినూత్న మార్పులు తీసుకొచ్చారు. ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్న మత్స్యకారుల కష్టాలను తన పాదయాత్రలో కళ్లారా చూసిన, జగన్‌గారు రాష్ట్రంలో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అవకాశంగా చేసుకుని పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఎవరూ ఆలోచన చేయని విధంగా బ్లూ ఎకానమీని సృష్టించడానికి కృషి చేశారు. కానీ చంద్రబాబు వీడియోలతో పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఏమీ కనిపించడం లేదు. ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్ పంపిణీ సందర్భంగా గ్రామాన్ని పోలీసులతో దిగ్బంధించి ఒక్కోసారి ఒక్కో కుటుంబాన్ని ఎంచుకుని వారింట్లో హడావుడి చేసి పోతున్నాడు. తాజాగా మత్స్యకారుల సేవలో అంటూ నెల్లూరు జిల్లా కావలిలో కూడా డ్రామా చేసి వెళ్లారు. - ఆ బోట్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు?: కావలి పర్యటనకు వెళ్లిన చంద్రబాబు అక్కడ ఒక చిన్న గుడిసె ఏర్పాటు చేసి అందులో చేపలు కొనుగోలు చేస్తున్నట్టు హడావుడి చేశాడు. ఆ తర్వాత ఒకరి ఇంటికి వెళ్లి గ్యాస్ కూడా వెలిగించకుండానే వంట చేస్తూ వీడియోలు ప్రచారం చేసుకున్నాడు. చంద్రబాబుకి పాలన చేతకాక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేశాడు. ప్రజలు ప్రశ్నిస్తున్నారనే భయంతో ఇలాంటి వీడియోలు తీసుకుని డ్రామాలు చేసి వెళ్తున్నాడు. తమిళనాడు జాలర్లు మన రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించి మత్స్యసంపదను దోచుకుని వెళ్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మన మత్స్యకారులు ప్రాణాలకు తెగించి బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే, పోలీసులు సీజ్ చేసిన బోట్లను అర్థరాత్రి పూట తప్పించేశారు. ఆ డ్యామేజ్‌ని కవర్ చేసుకోవడానికి నిన్న కావలి పర్యటనకు వెళ్లిన చంద్రబాబు మనల్ని ఆపేదెవరు అంటూ రెచ్చిపోయాడు తప్ప, మత్స్యకారులకు ఎలాంటి భరోసా కల్పించలేకపోయారు. - అమరావతిలో రియల్ ఎస్టేట్ చంద్రబాబు ప్రయారిటీ: చంద్రబాబుకి అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారమే ముఖ్యం. రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల కన్నా ఆయనకు 29 గ్రామాల అమరావతే ముఖ్యం. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారమే చంద్రబాబుకి కావాలి. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా రియల్ ఎస్టేట్ వెంచర్ ఓనర్‌గా వ్యవహరిస్తున్నారు. డీజిల్ కొరత వల్ల అమరావతిలో నిర్మాణాలు ఆగకూడదనే తపనతో, రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ కొరత సృష్టించారు. రిటైల్ డీలర్లను బెదిరించి లక్షలాది లీటర్ల డీజిల్ స్టోర్ చేసి పెట్టారు. దీంతో రాష్ట్రంలో కృతిమ కొరత ఏర్పడి, వాహనదారులు నానా ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీ నాయకులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక సమయం, సందర్భం, వేదికలతో సంబంధం లేకుండా గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని, జగన్‌గారిని నిందించడమే తన పని అన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చివరకు పారిశ్రామికవేత్తల ముందు కూడా రాజకీయ ఉపన్యాసాలు చేస్తూ, ప్రతిపక్ష నాయకుడిని బూతులు తిడుతూ చంద్రబాబు, లోకేష్ రాష్ట్రం పరువు తీస్తున్నారు. - సింహాచలం భూములు కాజేస్తున్నారు: సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన పార్టీలు సింహాచలం గిరి ప్రదక్షిణ జరిగే ప్రాంతంలో 160 ఎకరాలను గూగుల్ సంస్థకు కట్టబెట్టేశారు. విశాఖ సెంట్రల్ జైలు నిర్మించిన భూములు కూడా సింహాచలం ఆలయానికి చెందిన భూములే. వాటిని గతంలో చంద్రబాబు ధారాదత్తం చేశాడు. సింహాద్రి అప్పన్న భూములనే సింహాచలం డిపోకి కేటాయించాడు. రుషికొండలో బార్లు, కన్వెన్షన్ సెంటర్ ఉండే ప్రాంతంలో భారీ స్థాయిలో ప్రభుత్వ టూరిజం గెస్ట్ హౌస్‌లు నిర్మిస్తే రుషికొండకు గుండుకొట్టారని దుష్ప్రచారం చేశారు. గతంలో జగన్‌గారు ఆదిశంకరాచార్యలు మెమోరియల్ కోసం 15 ఎకరాల పావురాల కొండ ప్రాంతాన్ని కేటాయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. అంతే కాకుండా ఆ భూములను స్పాలు, వెల్‌నెస్ సెంటర్లు నిర్వహించే రిసార్టుకి కేటాయించింది. - దమ్ముంటే ఇప్పుడు సెల్ఫీ దిగండి: ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే పెట్రోల్ డీజిల్‌పై వెంటనే పన్నులు తగ్గించాలి. చంద్రబాబు, లోకేష్‌కు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే గతంలో మాదిరిగా పెట్రోల్ బంక్‌ల వద్ద ధరల పట్టికల ముందు సెల్ఫీ దిగగలరా? మండుతున్న పెట్రో ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెట్రో ధరలు తగ్గేలా చూడాలి. దేశవ్యాప్తంగా మన దగ్గరే పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్నందున, వెంటనే ఆ ధరలు తగ్గించాలని కెకె రాజు తేల్చి చెప్పారు.