పార్టీ పటిష్టతకు బూత్ స్థాయి కార్యకర్తలే మూలస్తంభాలు

వైయ‌స్ఆర్‌సీపీ యువ నాయకురాలు డాక్ట‌ర్ బొత్స అనూష 

గరివిడిలో వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి అవగాహన సదస్సు

విజ‌య‌న‌గ‌రం: పార్టీ పటిష్టతకు బూత్ స్థాయి కార్యకర్తలే మూలస్తంభాలు వైయ‌స్ఆర్‌సీపీ యువ నాయకురాలు డాక్ట‌ర్ బొత్స అనూష అన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు క్యాడర్‌ను సమాయత్తం చేయడం లక్ష్యంగా గరివిడిలో విస్తృత స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ఆదేశాల మేరకు గరివిడి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో చీపురుపల్లి టౌన్, మండల పరిధిలోని నాయకులు, క్లస్టర్ ఇంచార్జీలు, డివిజన్ ఇంచార్జీలు, బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు. 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యువ నాయకురాలు డాక్ట‌ర్ బొత్స అనూష‌ ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

 బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి అసలైన బలం : డాక్టర్ బొత్స అనూష 
ఏ రాజకీయ పార్టీ విజయానికైనా బూత్ స్థాయి కార్యకర్తలే నిజమైన బలమైన పునాదని బొత్స అనూష‌ పేర్కొన్నారు. నాయకులు దిశానిర్దేశం చేయగలరేమో గానీ, క్షేత్రస్థాయిలో పార్టీ జెండాను మోసి ప్రజాదరణను ఓట్ల రూపంలో మార్చేది బూత్ ఏజెంట్లు, క్లస్టర్ ఇంచార్జీలేనని అన్నారు. బొత్స సత్యనారాయణ ఆశయాలకు అనుగుణంగా చీపురుపల్లి నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ తిరుగులేని శక్తిగా నిలవాలంటే ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

 ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి

ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అత్యంత కీలకమని పేర్కొన్న ఆమె, ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల ఓటు హక్కు నమోదు చేయించడం, ఓటరు కార్డుల్లో పేర్లు, చిరునామాలు, ఫొటోల్లో ఉన్న తప్పులను సరిచేయించడం, మరణించిన లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను నిబంధనల ప్రకారం తొలగించేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. “మన నిర్లక్ష్యం వల్ల ఒక్క ఓటు మిస్ అయినా అది పార్టీకి పెద్ద నష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలి” అని స్పష్టం చేశారు.

సమన్వయంతోనే విజయమని పిలుపు
రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని, కానీ ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉండేందుకే నాయకత్వం ప్రాధాన్యత ఇస్తోందని డాక్టర్ అనూష పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం క్లస్టర్, డివిజన్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందనే నమ్మకం కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇప్పిలి అనంత్, వలిరెడ్డి శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు మీసాల వరహాల నాయుడు, బెల్లాన వంశీకృష్ణ, బుర్లె నరేష్, కరిమజ్జి శ్రీను, రాజారావు, జనార్ధన్, త్రినాధ్, గంగాధర్, పొన్నాడ కుమార్, గవిడి సురేష్ తదితర నాయకులతో పాటు ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, జెడ్పీటీసీ సభ్యులు, సోషల్ మీడియా ప్రతినిధులు, వైయ‌స్ఆర్‌సీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top