ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి 

ఎస్‌ఐఆర్‌పై వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం 

తాడేపల్లి: తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌ (ఓటర్ల జాబితా సవరణ)పై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, ఐటీ, సోషల్ మీడియా, బూత్ కమిటీల అధ్యక్షులు, పలు జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 ఓటర్ల జాబితాపై అప్రమత్తత అవసరం 
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ శ్రేణులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌ఐఆర్ పేరుతో అధికార పక్షం చేసే అక్రమాలను అడ్డుకోవడంతో పాటు, పార్టీ ఓట్లు ఎక్కడా తొలగించకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.

 బూత్ కమిటీలదే కీలక పాత్ర 
బూత్ కమిటీల పని అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు, దుర్వినియోగాన్ని కూడా గుర్తించి అడ్డుకోవాలని సూచించారు. పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిపోకుండా, అక్రమ ఓట్లు చేర్చకుండా కచ్చితంగా పర్యవేక్షించాలన్నారు.

 గత అనుభవాలు గుర్తుంచుకోవాలి 
గతంలో జరిగిన ఓటర్ల తొలగింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ, ఎన్నికల ముందు లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించిన ఘటనలను గుర్తు చేశారు. ఆ సమయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన విషయాన్ని వెల్లడించారు.

 సవరణ ప్రక్రియలో జాగ్రత్తలు అవసరం 
2002 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని సవరణలు జరుగుతున్నాయని, అప్పటి నుంచి పరిస్థితుల్లో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అర్హులైన ఓటర్లు జాబితాలో ఉండేలా కచ్చితంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

 ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు 
ఎస్‌ఐఆర్ ప్రారంభానికి ముందే అవసరమైన డేటా సిద్ధం చేసుకోవాలని, జోన్‌ల వారీగా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. పార్లమెంట్, అసెంబ్లీ స్థాయిలో టీమ్‌లు ఏర్పాటు చేసి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

 విజయం సాధించే సామర్థ్యం ఉంది 
మైక్రో లెవల్ మేనేజ్‌మెంట్ బలంగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించవచ్చని, 2019 కంటే మెరుగైన ఫలితాలు సాధించే శక్తి పార్టీకి ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు సమర్థవంతంగా పనిచేసి తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు.

 సీరియస్‌గా తీసుకోవాలి: లేళ్ళ అప్పిరెడ్డి 
ఈ సందర్భంగా లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం కొనసాగిస్తూ, అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని తెలిపారు. పార్టీ అధినేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా ఓటర్ల జాబితా సవరణపై పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.


 

Back to Top