వైయ‌స్ఆర్ ఘాట్‌ను సంద‌ర్శించిన‌ అంబటి రాంబాబు  

వైయ‌స్ఆర్‌ జిల్లా:  ఇడుపులపాయలోని డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారి ఘాట్‌ను మాజీ మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు. ఈ సందర్భంగా దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి విగ్ర‌హానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైయ‌స్ఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ప్రజలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు.  తొలుత గండి వీరాంజనేయ దేవస్థానానికి వెళ్లిన అంబటి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే కూలుస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. వైయ‌స్ జగన్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకూ అలుపెరగని పోరాటం చేస్తామని.. ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని.. వైయ‌స్ఆర్‌ సాక్షిగా ఇదే నా ప్రతిజ్ఞ అని అన్నారాయన.

అంబ‌టిపై అక్ర‌మ కేసు
ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబుపై అక్రమ కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. ఈ వ్యవహారంలో అంబటి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకుని క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కూడా వినకుండా టీడీపీ గూండాలు ఆయన ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్‌ చేయకపోగా.. టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంతో అంబటిపైనే కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. 
రెండువారాల పాటు రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి దాడి చేసిన వాళ్లపై, కస్టడీలో తనను టార్చర్‌ చేసిన పోలీసు అధికారులపై చర్యలు కోరుతూ ధర్మ పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసుల విచారణలో భాగంగా.. వేంపల్లి, పులివెందుల పోలీస్ స్టేషన్లలో ఇవాళ విచారణకు అంబటి హాజరవుతున్నారు.

Back to Top