రాష్ట్రంలో కృత్రిమ ఇంధన కరువు.

సచివాలయ ఉద్యోగులపై కూటమి సర్కార్ కక్షసాధింపు.

సచివాలయ సిబ్బందిని వలస కూలీల్లా, అడ్డా కూలీల్లా ట్రీట్ చేస్తారా?

ఆగ్రహం వ్యక్తం  చేసిన వైయ‌స్ఆర్‌సీపీ  ఎంప్లాయూస్ వింగ్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి.

తాడేపల్లి లోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ ఎంప్లాయూస్ అండ్ 
పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి.

ఇంధన కొరత ప్రభుత్వ కుట్రే 

బంకుల వద్ద జనం కష్టాలు పట్టవా?

సచివాలయ ఉద్యోగులకు బాత్రూమ్ డ్యూటీలా? 

కూటమి సర్కార్ కక్షసాధింపు పరాకాష్ట.

6,200 మంది సచివాలయ సిబ్బందిపై డిప్యుటేషన్ల భారం 

వలస కూలీల్లా ట్రీట్ చేస్తున్నారా?

జీతాల చెల్లింపుపై సీఎం ఏడుపు విడ్డూరం 

బకాయిలు వెంటనే చెల్లించాలి.

ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే వేధింపులేనా? 

ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన నలమారు చంద్రశేఖర్ రెడ్డి .

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు సామాన్య ప్రజలను, ఇటు ప్రభుత్వ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ ఎంప్లాయూస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కుట్రేనని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో లేని ఇంధన కష్టాలు కేవలం ఏపీలోనే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించిన ఆయన, బంకుల వద్ద ప్రజలు పగలు, రాత్రి అల్లాడుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని విమర్శించారు.

ముఖ్యంగా వైయస్. జగన్ ప్రభుత్వ హయాంలో నియమితులైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. పవిత్ర పుణ్యక్షేత్రాల్లో సచివాలయ సిబ్బందికి బాత్రూమ్ డ్యూటీలు వేయడం, డిప్యుటేషన్ల పేరుతో వేల మందిని తమకు సంబంధం లేని శాఖలకు పంపడం వారిని అవమానించడమేనన్నారు. సచివాలయ ఉద్యోగులను అడ్డా కూలీల్లా చూస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాల మీద ముఖ్యమంత్రి ఏడుస్తూ మాట్లాడటం సిగ్గుచేటని, వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించి ఉద్యోగుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..

- కృత్రిమ ఇంధన కొరత – ప్రభుత్వ వైఫల్యం..

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వం సృష్టించిందే. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో అల్లాడుతున్నా ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదు. పక్క రాష్ట్రాల్లో ఇంధనం పుష్కలంగా దొరుకుతుంటే, కేవలం ఏపీలోనే కొరత ఉండటం ప్రభుత్వ కుట్రే. పౌరసరఫరాల శాఖ సమన్వయ లోపం వల్లే ప్రజలకు ఈ విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. 

- సచివాలయ ఉద్యోగులను అడ్డా కూలీల్లా చూస్తారా?..

వైయస్ జగన్ హయాంలో నియమితులయ్యారనే ఒకే ఒక్క కారణంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. పవిత్రమైన శివరాత్రి పర్వదినాన  ఆలయాల వద్ద క్యూలైన్లలో, బాత్రూమ్స్ వద్ద కాపలా కాసే డ్యూటీలు వేయడం సచివాలయ ఉద్యోగులను అవమానించడమే. దాదాపు 6,200 మందిని డిప్యుటేషన్ల పేరుతో తమకు ఏమాత్రం సంబంధం లేని పనులకు, వివిధ శాఖలకు అడ్డా కూలీల్లా పంపిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులకంటూ ఒక ప్రత్యేక శాఖ, జాబ్ చార్ట్ ఉన్నా వాటిని తుంగలో తొక్కి ప్రభుత్వం ఇష్టానుసారంగా వాడుకుంటోంది. 

- జీతాలపై చంద్రబాబు వింత వాదన..

రాష్ట్ర రెవెన్యూలో 99 శాతం ఉద్యోగుల జీతాలకే సరిపోతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత, అది ఏదో బిచ్చం వేసినట్లు మాట్లాడటం సీఎంగా చంద్రబాబుకు తగదు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఉద్యోగులపై ఏడుస్తూ పాలన సాగిస్తున్నారు. 

- డిమాండ్లు - హెచ్చరిక..

కూటమి ప్రభుత్వం తన కక్షసాధింపు చర్యలను వీడి ఉద్యోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హితవు పలికారు. లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఉద్యోగులకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 'ఉద్యోగ ఫ్రెండ్లీ' ప్రభుత్వం అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు.. మాటలకు పరిమితం కాకుండా చేతల్లో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యోగ, పెన్షనర్ల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన స్పష్టం చేశారు.

Back to Top