చంద్రబాబు పతనం తమిళనాడులో ప్రారంభమై ఆంధ్రాలో ముగుస్తుంది

 చెవి రెడ్డి హర్షిత్ రెడ్డి 

తిరుపతి: తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపనున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవి రెడ్డి హర్షిత్ రెడ్డి అన్నారు. తమిళనాడు నాయకుడు విజ‌య్ సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తూ, సీఎం చంద్ర‌బాబు రాజకీయ పతనం అక్కడి నుంచే ప్రారంభమై, ఆంధ్రప్రదేశ్‌లో ముగుస్తుందని వ్యాఖ్యానించారు.

తమ నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్‌ లాగానే విజయ్ కూడా ఒంటరి పోరాటంతో ప్రజల మద్దతు పొందారని ఆయన తెలిపారు. కంటెంట్ కంటే కటౌట్ ముఖ్యమని ప్రజలు మళ్లీ నిరూపించారని, జగనన్న ఫోటోతో నిర్వహించిన ర్యాలీలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయని అన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్‌కు చంద్రగిరి నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని హర్షిత్ రెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌, విజయ్ ఇద్దరికీ ప్రజల మద్దతు, పోరాట పంథాలో పోలికలు ఉన్నాయని అన్నారు. విజయ్‌ను సీబీఐ కేసులతో వేధించారని, అదే విధంగా ఏపీలో జగనన్నను కూడా తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. అయినప్పటికీ ఇద్దరూ ప్రజల మద్దతుతో విజయాన్ని సాధించారని పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 20 వేలకుపైగా తమిళ ఓటర్లు ఉన్నారని, వారు అందరూ విజయ్ విజయాన్ని ఆనందంగా స్వీకరిస్తున్నారని తెలిపారు. విజయ్ అభిమానులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు.
 

Back to Top