సుప‌రిపాల‌నే వైయ‌స్ జ‌గ‌న్‌..విజ‌య్ ల‌క్ష్యం 

మాజీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి

గంగాధ‌ర నెల్లూరులో సంబ‌రాలు

చిత్తూరు జిల్లా: తమిళనాడులో విజయ్ దళపతి, ఆంధ్రప్రదేశ్‌లో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి..ఈ ఇద్దరి లక్ష్యం సుపరిపాలననేనని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం శ్రీరంగరాజపురం మండలం కేంద్రంలో తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీ విజయోత్సాహం సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మి పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ, కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ, తమిళనాడులో విజయ్ దళపతి ప్రజలకు కాబోయే ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కేవలం రెండేళ్లలోనే సీఎం స్థాయికి ఎదగడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైయ‌స్ జ‌గ‌న్‌, తమిళనాడులో విజయ్ దళపతి..ఇద్దరి ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలు ఒకటేనని తెలిపారు. ప్రజలకు సంక్షేమం, పారదర్శక పరిపాలన అందించడమే వీరి ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. అందుకే వీరిద్దరూ ఒకే కోవాకు చెందిన నాయకులని వ్యాఖ్యానించారు.

ఇంకా కొంతమంది నాయకులు పార్టీలు ఏర్పాటు చేసినప్పటికీ, ఇతర పార్టీలపై ఆధారపడుతూ తమ కార్యకర్తల నమ్మకాన్ని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. అయితే వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి, టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి మాత్రం తమను నమ్ముకున్న ప్రజల కోసం ఎంతదూరమైనా పోరాటం చేసే నాయకులని అన్నారు. కృపాలక్ష్మి మాట్లాడుతూ, “ఓడినా గెలిచినా… సింహం సింగిల్‌గా వస్తుంది” అంటూ పార్టీ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  
 

Back to Top