ప్రజలను ఇబ్బంది పెడితే వైయ‌స్ జగన్ ఉపేక్షించరు 

 మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ హెచ్చరిక 

దుప్పుతూరు గ్రామంలో ప‌ర్య‌టించిన‌ వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

అనకాపల్లి: ప్రజలను ఇబ్బంది పెడితే వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి ఉపేక్షించరని మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ హెచ్చరించారు.  దుప్పుతూరు గ్రామంలో  కొనసాగుతున్న ప్రహరీ గోడ వివాదం నేపథ్యంలో ‘చలో దుప్పుతూరు’ కార్యక్రమంలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు గ్రామంలో పర్యటించారు. గ్రామస్తుల సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ ఎంపీ సత్యవతి, కంబాల జోగులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గ్రామానికి వచ్చామని, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నామని తెలిపారు.  గ్రామస్తులకు మంచి ఆర్ అండ్ ఆర్‌ (పునరావాస, పునరుద్ధరణ) ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని నాయకులు పేర్కొన్నారు. 22 ఏళ్లుగా సమస్య కొనసాగుతున్నా పరిష్కారం కాలేదని విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు సమస్య పరిష్కారం తర్వాతే గోడ నిర్మాణం చేపట్టాలని ఆదేశించామని గుర్తుచేశారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు దాడులు చేయడం, స్టేషన్లకు తిప్పడం దారుణమని మండిపడ్డారు.

పరిశ్రమలు రావాలని వైఎస్ జగన్ లక్ష్యం: గుడివాడ అమ‌ర్నాథ్ 

రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని వైఎస్ జగన్ లక్ష్యం అయినప్పటికీ, ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించరని స్పష్టం చేశారు. 750 కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని పేర్కొన్నారు. గ్రామాన్ని తరలించే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. “పరిహారం ఇచ్చిన తర్వాతే గోడ నిర్మాణం చేపట్టాలి. ప్రజలకు న్యాయం జరిగే వరకు ఒక్క మట్టి కూడా కదల్చనివ్వం” అని హెచ్చరించారు. మహిళలపై లాఠీచార్జ్ జరగడం దురదృష్టకరమని, గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదని అన్నారు. ప్రజలపై పెట్టిన తప్పుడు కేసులను వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. 

మహిళలను ఈడ్చుకెళ్లడం అమానుషం: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి 
మహిళలను ఈడ్చుకుంటూ వాహనాల్లో ఎక్కించి అరెస్టు చేయడం అమానుషమని విమర్శించారు. వెంటనే ఆర్ అండ్ ఆర్‌ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ, “ప్రజలకు న్యాయం చేయలేని పాలకులు అవసరమా?” అని ప్రశ్నించారు. దుప్పుతూరు ప్రజలకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 

 పోలీసుల వ్యవహారం దుర్మార్గం: ధర్మశ్రీ 
పోలీసుల వ్యవహారం దుర్మార్గమని ధర్మశ్రీ అన్నారు. పరిహారం చెల్లించే వరకు గోడ నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న ప్రజలపై తప్పుడు కేసులు పెట్టడం అన్యాయమన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. వైయ‌స్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు గోడ ఎందుకు కట్టలేదు? ఇప్పుడు కూటమి నాయకులు డబ్బులు తీసుకుని గోడ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అని విమర్శించారు.
 

Back to Top