రైతు కథ… కన్నీటి వ్యధ 

పెనుకొండలో రైతుల కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ధర్నా 

 శ్రీ సత్యసాయి జిల్లా:  జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై స్పందిస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెనుకొండలో ఆందోళన చేపట్టారు. పెనుకొండ నియోజకవర్గంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి ఉషాశ్రీ చరణ్ ధర్నా నిర్వహించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన పంటలకు సరైన ధరలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి ఆర్థిక భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ, గతంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు, కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, ధర స్థిరీకరణ, గిట్టుబాటు ధర, పంట కొనుగోలు, రైతు భరోసా వంటి పథకాల ద్వారా అండగా నిలిచారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా కూడా అందించలేకపోతోందని విమర్శించారు. ప్రస్తుతం మొక్కజొన్న రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని, కనీస మద్దతు ధర (MSP) క్వింటాల్‌కు రూ.2,400 ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదన్నారు. దళారులు మాత్రం క్వింటాల్‌కు రూ.1,600కే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు క్వింటాల్‌కు రూ.600 నుంచి రూ.700 వరకు నష్టపోతున్నారని, ఒక్కో రైతు లక్షల్లో నష్టపోతున్న పరిస్థితి నెలకొన్నదన్నారు. రైతు సమస్యలపై కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి, గిట్టుబాటు ధరలు కల్పించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.


 

Back to Top