బిల్లుల కక్కుర్తి వల్లే ఉండవల్లిలో స్టీల్ బ్రిడ్జి కుంగింది

అన్ని అనుమతులు తీసుకోకుండానే నిర్మాణ పనులు

ఇలాగే చేస్తే అమరావతిలో భవనాలూ కుంగిపోతాయి

చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైయ‌స్ఆర్‌సీపీ  నేతలు

ఉండవల్లి వద్ద బకింగ్ హామ్ కెనాల్ పై కుంగిపోయిన స్టీల్ వంతెనను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, దొంతిరెడ్డి వేమారెడ్డి..

ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి కుంగుబాటుకు కారణాలెన్నో

బిల్లుల కక్కుర్తితో హడావిడిగా పనులు చేసే యత్నం

వంతెనలో లోపాల్ని నిర్మాణ సంస్థే అంగీకరించింది

హైవేకు కలుపుతామని చెప్పి రూటు మార్చేశారు

60 కోట్లతో చేపట్టిన వంతెనకు జాగ్రత్తలు ఏవీ?

అమరావతిలోనూ హడావిడిగా భవనాల నిర్మాణం

చిన్న వంతెనే కట్టలేరు కానీ గ్రీన్ ఫీల్డ్ సిటీ కబుర్లు

కూటమి సర్కార్ పై మండిపడ్డ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు 

ఉండవల్లి:     ఉండవల్లిలో బకింగ్ హామ్ కెనాల్ పై చేపట్టిన స్టీల్ వంతెన కుంగిపోవడం వెనుక ప్రభుత్వ కాసుల కక్కుర్తి, హడావిడే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, దొంతిరెడ్డి వేమారెడ్డి ఆరోపించారు. ఉండవల్లిలో కుంగిన వంతెనను పరిశీలించిన పార్టీ నేతలు.. అమరావతిలో నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ చిన్న వంతెన నిర్మించలేని ప్రభుత్వం.. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీ చేస్తామంటూ పెద్ద పెద్ద కబుర్లు చెబుతోందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. 
ప్రెస్ మీట్లో వైయ‌స్ఆర్‌సీపీనేతలు ఇంకేమన్నారంటే...    

స్టీల్ వంతెన కుంగుబాటుపై ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి:
దొంతిరెడ్డి వేమారెడ్డి, మంగళగిరి వైయ‌స్ఆర్‌సీపీ ఇన్ ఛార్జ్

సీడ్ యాక్సెస్ రోడ్డును పాత గుంటూరు రోడ్డుకు తీసుకొచ్చి కలిపేందుకు  బకింగ్ హామ్ కాలువ మీద నిర్మిస్తున్న స్టీల్ వంతెన కుంగిపోయింది. ఈ రోడ్డు ఇంకా అర కిలోమీటర్ కూడా పూర్తి కాలేదు. మధ్యలో ఉన్న గుంటూరు కాలువ, కొండవీటి వాగును అలాగే ఉంచి జనవరిలోనే దీన్ని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్తున్నారు. నీటి పారుదల శాఖ అనుమతి తీసుకోకుండా, ఇంజనీరింగ్ నైపుణ్యం లేకుండా జరుగుతున్న ఈ పనులు అంతిమంగా ఎటు వెళ్తాయో తెలియడం లేదు. ఇప్పటికే రైతులు కొంత మంది ఈ రోడ్డుకు భూములు ఇవ్వలేదు. ఇది ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్ధితి. దీనిపై ప్రజలకు ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి. 

అభివృద్ధి ముసుగులో చేస్తున్న దోపిడీకి నిదర్శనం: 
మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే

ఇవాళ ఉదయమే నిర్మాణ కంపెనీ ఈ వంతెన కుంగలేదని చెప్పింది. సాయంత్రానికి మాట మార్చి నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే అమరావతిలో పనులు ఎలా జరుగుతున్నాయో అర్దమవుతుంది. మేం అభివృద్దికి వ్యతిరేకం కాదు. దాని మాటున చేసే కార్యక్రమాల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మొదటి విడత భూసేకరణ రైతులకు ప్లాట్ల కేటాయింపు, వారి సమస్యలపై ఇప్పటికే అండగా నిలబడుతున్నాం. విజయవాడ నగరాన్ని పాతబస్తీగా మార్చేశారు. వేల కోట్ల అప్పులు అమరావతికి తెచ్చి పెడుతున్నారు. నిన్న కేంద్రం రూ.15 వేల కోట్లు మంజూరు చేసింది. అప్పులు రాష్ట్రానికి భారంగా మారుతున్నాయని మేం పదే పదే చెప్తున్నాం. కేంద్రం దుబారాను అరికట్టాలని తాజాగా మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. రూ.60 కోట్లకు పైగా ఖర్చుపెడుతున్న ఈ వంతెన నిర్మాణంలో ఎందుకు లోపం జరిగిందో ప్రభుత్వం చెప్పాలి. సీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చి జాతీయ రహదారికి కలుపుతామని చెప్పారు. కానీ పరిస్ధితి అందుకు భిన్నంగా ఉంది. అభివృద్ది ముసుగులో చేసే దోపిడీకి ఇదే నిదర్శనం. 

కొంపముంచిన బిల్లుల తాపత్రయం: 
అంబటి రాంబాబు, మాజీ మంత్రి

సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి గుంటూరు పాత రోడ్డుకు కలిపే వంతెన పనులు ఆరు నెలల క్రితం ప్రారంభించారు. మధ్యలో పొరబాటు జరిగి నిర్మాణం కుంగింది. దాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఇక్కడికి వచ్చాం. ప్రస్తుతం కుంగిన భాగాన్ని పక్కనబెట్టి దాన్ని సరిచేసే కార్యక్రమం చేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా ప్రధానమైనదని చంద్రబాబు పదే పదే చెప్తూ వచ్చారు. దీన్ని మణిపాల్ ఆస్పత్రి దగ్గర హైవేకు కనెక్ట్ చేస్తామని చెప్పిన మంత్రి నారాయణ ..ఇప్పుడు ఈ రోడ్డును ట్రాఫిక్ తో కిక్కిరిసిన ప్రాంతానికి, కొండ పక్కన తీసుకొచ్చి కలుపుతున్నారు. ఇది తప్పేమో అని మా అభిప్రాయం. 60 కోట్లు ఖర్చుపెట్టి ఈ వంతెన హడావిడిగా నిర్మించాల్సిన అవసరం ఏముంది ?, గుంటూరు ఛానల్, కొండవీటి వాగు వంతెన పూర్తి కాకుండా ఈ స్టీల్ వంతెన కోసం ఎందుకు హడావిడి చేస్తున్నారో తెలియడం లేదు. బకింగ్ హామ్ కెనాల్ మీద 60 కోట్లలో చేపట్టిన వంతెన 6 నెలల్లోనే కుంగితే ఇక గ్రీన్ ఫీల్డ్ సిటీ అమరావతిని చంద్రబాబు ఎలా కడతారో అర్దమవుతోంది. బకింగ్ హామ్ కెనాల్ పై వంతెన నిర్మాణం చేయాలంటే చాలా అనుమతులు కావాలి. అలాంటి అనుమతులు ఏమైనా తీసుకున్నారా అని చంద్రబాబు, మంత్రి నారాయణ, లోకేష్  ను అడుగుతున్నాం. ఈ అనుమతులేవీ తీసుకోకుండానే వంతెన నిర్మాణం చేపట్టారు. బిల్లుల కోసం లోకేష్ పడ్డ తాపత్రయమే ఇవాళ ఈ పరిస్ధితికి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు దీని మీద సమాధానం చెప్పాలి. ఇలాగే చేస్తే అమరావతిలో నిర్మాణాలు సైతం కుంగిపోవడం ఖాయం. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని చెప్తే .. ఆయన చెప్పాడనే కారణంతో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి నారాయణ అన్ని అనుమతులు తీసుకుని అమరావతిలో పనులు చేపట్టాలని కోరుతున్నాం..
 

Back to Top