తాడేపల్లి: తన స్వార్థ రాజకీయాల కోసం సీఎం చంద్రబాబునాయుడు రాయలసీమ గొంతు కోస్తూ, రాష్ట్ర నీటి హక్కులను పొరుగు రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్నారని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలో సాగు, తాగు నీరు లేక రాయలసీమ ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి అబద్ధపు ప్రచారాలతో కాలయాపన చేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడికి లొంగి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేసిన చంద్రబాబు, ఇప్పుడు ఏకంగా 120 టీఎంసీల తెలంగాణ అక్రమ ప్రాజెక్టులకు ’విశాల దృక్పథం’ పేరుతో బ్లాంక్ చెక్ ఇస్తున్నారని మండిపడ్డారు. మహానేత వైయస్సార్, జగన్ గారు 45.72 మీటర్ల ఎత్తుతో ప్లాన్ చేసిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం 41.15 మీటర్లకు కుదించి, లక్షలాది ఎకరాల సాగునీటి ఆశలను నీరు గార్చిందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాకే శైలజానాథ్ ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో సాకే శైలజానాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..: అది తెలంగాణకు బ్లాంక్ చెక్: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాటిల్‌తో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు చంద్రబాబు అంగీకరించడం రాయలసీమకు తీరని ద్రోహం. పాలమూరు–రంగారెడ్డికి 90 టీఎంసీలు, దానికి అనుబంధంగా ఉన్న డిండి ప్రాజెక్టుకు 30 టీఎంసీలు కలిపి మొత్తం 120 టీఎంసీల నీటిని తెలంగాణ తరలించుకుపోతుంటే చంద్రబాబు నోరు మెదపడం లేదు. నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అడ్డుపడరనే సాకుతో, కేంద్రం చేసిన బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు లొంగిపోయి ’విశాల దృక్పథం’ అని మాట్లాడటం సిగ్గుచేటు. చంద్రబాబు నిర్ణయం తెలంగాణకు ఒక బ్లాంక్‌చెక్‌లా మారింది. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడికి తలొగ్గి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు ఆపేశారు. దీనివల్ల రాయలసీమలో తాగడానికి గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. పోలవరం ఎత్తు కుదింపు.. ఒక చారిత్రక ద్రోహం: మహానేత వైయస్సార్, ఆ తర్వాత వైయస్ జగన్ గారు పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల పూర్తి స్థాయి ఎత్తుతో, 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించేలా పనులు చేపట్టారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దాన్ని 41.15 మీటర్ల ఎత్తుకు, కేవలం 119 టీఎంసీల సామర్థ్యానికి కుదించేసింది. కేంద్ర క్యాబినెట్‌లో భాగస్వాములుగా ఉన్న ఏపీ మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ దీనికి ఆమోదముద్ర వేయడం దారుణం. వైయస్సార్ ప్లాన్ ప్రకారం 45.72 మీటర్ల ఎత్తు ఉంటే 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. కానీ చంద్రబాబు ఒప్పుకున్న ఎత్తు వల్ల అది కేవలం 1.98 లక్షల ఎకరాలకే పరిమితం కానుంది. పోలవరం కుడి కాలువ కెపాసిటీని వైయస్ జగన్ 17 వేల క్యూసెక్కుల నుండి 40 వేల క్యూసెక్కులకు పెంచి, బొల్లాపల్లి, వెలిగొండ మీదుగా బనకచర్లకు గోదావరి నీటిని తరలించేలా ప్లాన్ చేశారు. పోలవరం ఎత్తును కుదిస్తే బనకచర్లకు నీళ్లు ఎలా తెస్తారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ‘అప్పర్ భద్ర’పై మౌనం – రాయలసీమకు గొడ్డలిపెట్టు: కృష్ణానదిపై ఎలాంటి నీటి కేటాయింపులు లేకపోయినా కర్ణాటకలోని ’అప్పర్ భద్ర’ ప్రాజెక్టును కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, రూ. 12,500 కోట్లు కేటాయించింది. దీనిపై గతంలో జగన్‌గారి ప్రభుత్వం ట్రిబ్యునల్‌లో గట్టిగా ఫిర్యాదు చేస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. అప్పర్ భద్ర ద్వారా కర్ణాటక 29.9 టీఎంసీల నీటిని వాడుకుని 5.57 లక్షల ఎకరాలకు నీరివ్వబోతోంది. దీనికి తోడు భద్ర నదిపై కల్బుర్గి ప్రాంతంలో మరో ఎత్తిపోతల ప్రాజెక్టుకు కర్ణాటక ప్లాన్ చేస్తోంది. దీనివల్ల తుంగభద్రకు నీరు తగ్గి హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, కేసీ కెనాల్స్ పూర్తిగా ఎండిపోయి గ్రేటర్ రాయలసీమ ఎడారిగా మారుతుంది. హార్టికల్చర్ హబ్ ఒట్టిమాట. ఎండుతున్న చీనీ తోటలు: పుట్టపర్తి పర్యటనలో ’ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం’ అని చంద్రబాబు చెప్పిన మాటలు కేవలం ఒక స్లోగన్‌లా మిగిలిపోయాయి. చంద్రబాబుకు మొదటి నుంచీ వ్యవసాయం అంటే గిట్టదు. క్షేత్రస్థాయిలో నీరు లేక అనంతపురం జిల్లాలో వందలాది ఎకరాల్లో చీనీ తోటలు ఎండిపోతున్నాయి. హార్టికల్చర్, వరి, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర లేక రోడ్డున పడుతున్నారు. గతంలో ’రెయిన్ గన్స్’తో పంటలు పండించానని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు, ఆ రెయిన్ గన్స్ కూడా కేవలం తన అనుయాయులకే ఇచ్చుకున్నారు. ’శ్రీకాకుళం వర్షపు నీటిని అనంతపురంలో చెట్లకు ఇస్తా’ అని బాబు చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్థానిక యువతకే 100% ఉద్యోగాలు ఇవ్వాలి: వైయస్సార్‌గారు తన హయాంలో చెన్నై–బెంగళూరు కారిడార్ కింద అనంతపురంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి ’హాల్’ లాంటి పరిశ్రమలను తెచ్చారు. కూటమి ప్రభుత్వం రాయలసీమను ’రక్షణ సీమ’గా మారుస్తామని గొప్పలు చెప్పుకుంటోంది తప్ప స్థానికులకు ఇచ్చే ప్రాధాన్యత శూన్యం. గతంలో వచ్చిన ’కియా’ కార్ల పరిశ్రమ ద్వారా అనంతపురం జిల్లా వాసులకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఇప్పుడు పుట్టపర్తిలో రాబోయే ఆధునిక మధ్య తరగతి యుద్ధ విమాన తయారీ కేంద్రం ద్వారా మొత్తం 15 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. మా భూములు తీసుకుని నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులోని ఉద్యోగాలన్నీ 100 శాతం అనంతపురం మరియు రాయలసీమ వాసులకే ఇవ్వాలని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు.