చంద్రబాబు రూల్స్‌ పెడతాడు.. పాటించడు

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఫైర్‌

విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌

దుబారా ఖర్చులు తగ్గించాలని పిలుపిచ్చి ప్రత్యేక విమానాల్లో చంద్రబాబు, లోకేష్‌ షికార్లు

వైయ‌స్ఆర్ ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ 

సుదీర్ఘ సముద్ర తీరంలో మేం పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్‌లు కట్టించాం. 

బీచ్‌లలో టీడీపీ బికినీ ఉత్సవాలు చేయాలనుకుంది

ఏ కొండా వదలకుండా మొత్తం ఉత్తరాంధ్రకే చంద్రబాబు గుండు కొడుతున్నాడు  

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆగ్రహం 

దేశం కన్నా చంద్రబాబుకు వ్యక్తిగత అజెండాలే ముఖ్యం

అమరావతికి అడ్డంకులు రాకపోతే ఆయనకు చాలు

29 గ్రామాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే ముఖ్యం 

ప్రజలు ఏమైపోయినా చంద్రబాబుకి అవసరం లేదు

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ధ్వజం

విశాఖపట్నం:     చంద్రబాబు ఎప్పుడూ వ్యక్తిగత అజెండాతోనే పనిచేస్తాడే తప్ప ఎవరో ఏదో చెప్పారని చేయడని వైయ‌స్ఆర్‌సీపీరీజినల్‌ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ్‌ అమర్నాథ్‌ స్పష్టం చేశారు. చంద్రబాబుకి రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదని, ఆయనకు మాత్రం 29 గ్రామాల అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగుంటే చాలని ఆరోపించాడు. ఒకపక్క దుబారా ఖర్చులు తగ్గించాలని పిలుపునిచ్చి తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌ వేర్వేరుగా ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రూల్స్‌ పెడతాడే కానీ ఫాలో అవ్వడని రాష్ట్ర ప్రజలకు కూడా పలు సందర్భాల్లో అనుభవం అయ్యిందని చెప్పారు. 
    చంద్రబాబు, లోకేష్‌లకు కొన్ని సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం లేకుండా పోయిందని, పారిశ్రామికవేత్తల ముందు రాష్ట్రం పరువు తీస్తున్నారని గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. వైయస్సార్‌ ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ అయితే, వైశ్రాయ్‌ హోటల్‌ లో వెన్నుపోటుతో పుట్టిన పార్టీ తెలుగుదేశం అని బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌ అంటూ లోకేష్‌కి హితవు పలికారు. ఇకనైనా ఎక్కడ, ఏం మాట్లాడాలో సభ్యత సంస్కారంతో వ్యవహరించాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్‌ సూచించారు.  
ప్రెస్‌మీట్‌లో గుడివాడ అమర్‌నాథ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

రెండు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తికి తండ్రీకొడుకులు:
    దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిస్తే చంద్రబాబు దాన్ని కూడా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటానని చెప్పే చంద్రబాబు దేశ సంక్షోభాన్ని కూడా తన పబ్లిసిటీకి చేసుకుంటున్నాడు. కేబినెట్‌ సమావేశంలో పొదుపు చర్యలు పాటిస్తానని చెప్పినట్టు మీడియా ద్వారా ప్రచారం చేసుకున్న చంద్రబాబు దాన్ని మాటలకే పరిమితం చేశాడు. ఒకపక్క టీవీల్లో బ్రేకింగ్‌ న్యూస్‌లు వస్తూ ఉంటే ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్‌ ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వెళ్లడంతోపాటు భారీ కాన్వాయ్‌తో దర్పం ప్రదర్శించాడు. రాత్రి లోకేష్‌ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళితే, తెల్లారి చంద్రబాబు మరో విమానంలో వెళ్లాడు. ఒకపక్క పైకి మాత్రం పొదుపు చర్యలు పాటించాలని, మేమూ పాటిస్తామని పిలుపునిస్తూ వారు మాత్రం దర్జాగా ప్రజాధనంతో జల్సా యాత్రలు చేస్తున్నారు. మీడియాలో మాత్రం కేబినెట్‌ సమావేశానికి చంద్రబాబు మూడు కార్ల కాన్వాయ్‌తో వెళ్తున్నట్టు చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాడు.
    ఒకపక్క పొదుపు చర్యలు పాటించాలని ప్రజలకు సూచనలు చేస్తూనే చంద్రబాబు ఢిల్లీలో అధికారిక నివాసం మరమ్మతుల కోసం రూ. 6.5 కోట్లు కేటాయిస్తూ జీవో ఇచ్చాడు. హైదరాబాద్‌లో సొంత ఇంటి నిర్మాణం కోసం, ఉండవల్లిలో నివాసం ఉంటున్న అక్రమ నివాసం మరమ్మతుల కోసం ఇప్పటికీ కోట్లకు కోట్లు ఖర్చు చేస్తూనే ఉన్నారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబం స్టార్‌ హోటల్‌లో నివాసం ఉంటూ దానికి కోట్ల బిల్లులు చెల్లించాడు. రెండేళ్లలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా రూ. 3.61 లక్షల కోట్లు అప్పులు చేశాడు. కానీ ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు జరగలేదు. అభివద్ధికి సంబంధించిన ఆనవాళ్లు కూడా లేవు. గతంలో పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు, ఈ ప్రాజెక్టును చూపించే పేరుతో బస్సు యాత్రలు పెట్టి రూ.80 కోట్లకు పైగా ఖర్చు చేశాడు.  
 
వీడియో కోసం సీఎం కాన్వాయ్‌లో కార్లు తగ్గించినట్టు షో:
    సీఎం చంద్రబాబు నాయుడు కేవలం రెండేళ్లలోనే ప్రత్యేక విమానాల కోసం చేసిన ఖర్చు రూ.120 కోట్లు. 2026–27 కోసం మరో రూ.60 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లు చేస్తున్న ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ఖర్చు అదనం. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి ప్రత్యేక విమానాల్లో తిరిగే వెసులుబాటు ఉన్నా, మంత్రులుగా లోకేష్, పవన్‌ కళ్యాణ్‌కు ఆ వెసులుబాటు లేకపోయినా వారం వారం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో హైదరాబాద్‌కి వెళ్లి వస్తూనే ఉన్నారు. వారి ఖర్చుల వివరాలు సమర్పించాలని ఆర్టీఐ ద్వారా అడుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు.
    ప్రధాని పిలుపునిచ్చాక వారిలో మార్పు వస్తుందనుకుంటే ఏమాత్రం సిగ్గు లేకుండా తిరుగుతున్నారు. చంద్రబాబు రూల్స్‌ పెడతాడే కానీ, తాను ఫాలో అవ్వడనే విషయం మరోసారి రుజువు చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలు కనాలని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తాడు కానీ, తన కొడుక్కి మాత్రం చెప్పడంలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. రెండేళ్ల చంద్రబాబు పాలన మొత్తం పబ్లిసిటీ, అబద్ధాలతోనే నడుస్తున్నాయ. పాలనలో ఎక్కడా నిజం, నిజాయితీ లేదు. సూపర్‌ సిక్స్‌ లో ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేసిన పాపానపోలేదు.  

‘బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌’.. లోకేష్‌బాబు:
    ప్రాజెక్టుల శంకుస్థాపనలు జరుగుతుంటే తండ్రీకొడుకులు రాజకీయాలు మాట్లాడుతూ రాష్ట్రం పరువు బజారున పడేస్తున్నారు. వేదికలతో సంబంధం లేకుండా వైయస్‌ జగన్‌ గారిని, వైయ‌స్ఆర్‌సీపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఎక్కడ ఏం మాట్లాడాలో వారికి తెలియడం లేదు. పెట్టుబడులకు సంబంధించి పారిశ్రామివేత్తలు పాల్గొన్న వేదికలపైన పంచ్‌లు, ప్రాసల కోసం నారా లోకేష్‌ తాపత్రయ పడుతున్నాడు.
    వైయ‌స్ఆర్‌సీపీ వైయస్సార్‌ ఆశయాల నుంచి పుట్టిన పార్టీ అయితే, టీడీపీ వైశ్రాయ్‌ హోటల్‌ లో పుట్టిన పార్టీ. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వైయ‌స్ఆర్‌సీపీ పురుగు పోసుకుంది. కాగా, బడా బాబులు, పెత్తందారులు, బినామీలు, దళారుల సంక్షేమం కోసమే తపించేది టీడీపీ. కాబట్టి ‘బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌’.. గుర్తుంచుకో నారా లోకేష్‌.

ఉత్తరాంధ్రను బోడి గుండు చేస్తున్నారు:
    వైయ‌స్ఆర్‌సీపీ చేసిన పనులు కళ్లముందు కనిపిస్తున్నాయి. టీడీపీ చేసేవన్నీ పబ్లిసిటీ స్టంట్లు. బారు, బీరు టీడీపీ సిద్ధాంతం. విద్య, వైద్యం  మా పార్టీ సిద్ధాంతం. వైయ‌స్ఆర్‌సీపీచేతల పార్టీ, టీడీపీ కోతల పార్టీ. సుదీర్ఘ సముద్ర తీరం వెంబడి మేం పోర్టులు ఫిషింగ్‌ హార్బర్‌లు కడితే, బీచ్‌ కనపడితే చాలు బికినీ ఉత్సవాలు చేయాలని చూసిన పార్టీ టీడీపీ. వైయస్‌ జగన్‌ ఫోబియా తండ్రీకొడుకుల మాటల్లో చేతల్లో నిత్యం కనిపిస్తోంది. రుషికొండలో టూరిజం ప్రాజెక్టులు కడితే రుషి కొండకు జగన్‌ గుండు కొట్టించాడని ప్రచారం చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఏకంగా ఉత్తరాంధ్రకే బోడి గుండు చేస్తున్నాడు.
    రుషికొండ, ఎండాడ, భీమిలి, ముధురవాడ, సింహాచలం.. ఏ కొండ చూసినా వదలకుండా గుండు కొట్టిస్తున్నారు. ఉత్తరాంధ్రలో కూటమి భూదోపిడీపై వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమిస్తుంది. దేశంలోనే ఎక్కువ పెట్రోల్‌ ధరలు ఏపీలో వసూలు చేస్తున్నారు. ఇదొక్కటే వారు సాధించిన ఘనత. టీడీపీ అరాచకాలను ప్రజల ముందు ఉంచుతాం.

చంద్రబాబుకు అవే ముఖ్యం:
    చంద్రబాబుకి రాష్ట్ర ప్రజలతో పని లేదు. అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మాత్రమే ఆయనకు ముఖ్యం. రాష్ట్రం ఏమై పోయినా ఆయనకు పర్వాలేదు. అమరావతికి ఏరకమైన అడ్డంకులు రాకపోతే ఆయనకు చాలు. ఎవరో ఏదో చెప్పారని చంద్రబాబు ఫాలో అవ్వడు. చంద్రబాబుకు ఎప్పుడూ తన ప్రయోజనాలు, వ్యక్తిగత ఎజెండాలే ముఖ్యం అని గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు.

Back to Top